12, మార్చి 2021, శుక్రవారం

మన మహర్షులు- 46

 మన మహర్షులు- 46


 సాందీపని మహర్షి


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷


 సాందీపని మహర్షి  ఈపేరెప్పుడేనా విన్నారా? ఆలోచించండి. కృష్ణుడి గురువుగారు ఎవరు? 


ఇప్పుడు ఆయన గురించి తెల్సుకుందాం...


అవంతీపురంలో వేదజ్ఞులు, శాస్త్రజ్ఞులు, పురాణజ్ఞులు అయినటువంటి బ్రాహ్మణులుండే వాళ్ళు.

వారిలో సందీపని మహర్షి కొడుకు సాందీపుడు. సాందీపుడు చిన్నతనంలోనే అన్ని వేదశాస్త్రాలు నేర్చుకుని అన్ని వేదరహస్యాలు తెలుసుకుని దయాశాలి. ప్రియదర్శనుడు, సాత్వికుడు, విష్ణుపూజారతుడు, వివేకధనుడు అంటూ   పిలవబడేవాడు. తండ్రికి తగ్గ తనయుడునిపించుకున్నాడు.


సాందీపనికి వివాహం చేశాక ఒక కొడుకు పుట్టాడు. అతడు ఏకసంథాగ్రాహి, తండ్రి దగ్గర అన్ని విద్యలు నేర్చుకున్నాడు. అతడికి విష్ణు పాదపద్మాల దగ్గరే వుండాలని, సంసారం చావు, పుట్టుక ఇలాంటివి తనకిష్టం వుండదని అంటూండేవాడు.


ఒకరోజు మాఘ పౌర్ణమినాడు స్నానం చేస్తూ ఈ పుణ్యకాలం దాటితో మళ్లీ రాదు అనుకుని విష్ణుమూర్తిని తల్చుకుని నీళ్ళల్లో మునిగిపోయాడు. ఎంత వెతికించినా కనపడలేదు సాందీపని మహర్షి బంధాలుండకూడదని సరిపెట్టుకున్నాడు, కానీ ఆయన భార్య మాత్రం ఏడుస్తూనే వుండేది.


కంసుణ్ణి వధించాక దేవకీ వసుదేవులు బలరామకృష్ణులకి గర్గుడు మొదలైన మహార్షులతో ఉపనయనం చేయించి దానాలు, ధర్మాలు అన్నీ చేసి సాందీపని దగ్గర విద్యాభ్యాసం కోసం పంపించారు.


బలరామకృష్ణులు స్వతహాగా జగద్గురువులు, సంపూర్ణులు, సర్వజ్ఞులు అయినా కూడా గురుశుశ్రూషతో నేర్చిన విద్యే సరైన విద్యని లోకానికి తెలియచెప్పడం కోసం గురువు దగ్గర చేరి చదువుకున్నారు.


ఐలరామకృష్ణులు మహావైభవరాతియైన కాశీకి బ్రహ్మచారులై చేరి అక్కడ అవంతీపురంలో వున్న సాందీపని మహర్షికి సాష్టాంగ నమస్కారం చేశారు. 


సర్వజగత్తుని నియంత్రించగల బలరామకృష్ణులు తనకి సాష్టాంగపడ్డం ఎంత అపురూపం! ఎంత అద్భుతం ఎంత అదృష్టం! అనుకుని సాందీపని మహర్షి వాళ్ళని శిష్యులుగా అంగీకరించి విద్యాభ్యాసం మొదలుపెడితే రోజుకి ఒక విద్య చొప్పున చెప్పింది చెప్పగానే నేర్చేసుకున్నారు.


అదృష్టమంటే అందరినీ వరించదు. త్రిమూర్తుల్ని పరీక్షించే శక్తి భృగుమహర్షికి, త్రిమూర్తుల్ని చంటి పిల్లల్ని చేయగల శక్తి అనసూయకి, శ్రీరాముడికి గురువయ్యే అదృష్టం వసిష్ఠుడికి, విష్ణుమూర్తిని కొడుకుగా పొందిన యోగం కశ్యపుడిది, పద్నాలుగు లోకాల్ని సంరంక్షించే బలరామకృష్ణులకి పాఠం చెప్పే అదృష్టం వేలాది మహర్షుల్లో ఒక్క సాందీపనికే కలిగింది. 


బలరామకృష్ణులు విద్యాభ్యాసం అయిపోయాక గురువుగారికి, గురుపత్నికి నమస్కారం చేసి గురు దక్షిణగా ఏంకావాలనడిగారు.


 సాందీపని మహర్షి తన కొడుకు వృత్తాంతం చెప్పి నేనయితే ఇవన్నీ మాములే అని సరి పెట్టుకున్నానుగాని, నా భార్య కొడుకు కోసం ఏడ్వనిరోజు లేదు. మాకు తప్పకుండా గురుదక్షిణీవ్వాలని వుంటే నా కొడుకుని తీసుకురండని చెప్పాడు సాందీపని మహర్షి.


బలరామకృష్ణులు సముద్రుడి దగ్గరకెళ్ళి మా గురుపుత్రుణ్ణివ్వమని అడిగారు.


 సముద్రుడు అతణ్ణి నాలో వున్న పంచజన్య అనే రాక్షసుడు మింగేశాడని చెప్పాడు.


అప్పుడు కృష్ణుడు సముద్రంలోకి వెళ్ళి రాక్షసుడి పొట్ట చీల్చాడు. లోపల గురుపుత్రుడు లేడుగాని ఒక శంఖం వుంది. అది తీసుకుని యమపురం వెళ్ళి శంఖారావం చేశాడు. యముడు భయపడి బయటకి వచ్చి, బలరామకృష్ణులకి నమస్కారం చేసి ఆ పిల్లవాణ్ణి వాళ్ళకి అప్పగించాడు.


బలరామకృష్ణులు గురుపుత్రుణ్ణి తీసికొచ్చి సాందీపని మహర్షికి అప్పగించి

నమస్కరించి ఆశీర్వాదం తీసుకుని తమ గురుదక్షిణ చెల్లించుకున్నారు.


సాందీపని మహర్షి ఎంతోమంది శిష్యులకి విద్యాదానం చేస్తూ లోకకళ్యాణానికి పాటుపడ్డాడు.


సాందీపని మహర్షి కథ చదివారు కదా! ఈ మహర్షి గొప్పతనం ఎంత చెప్పినా తరగనిది..


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷

కామెంట్‌లు లేవు: