8, మార్చి 2023, బుధవారం

WOMEN'S DAY

 ॐ           WOMEN'S DAY అవసరమా? 


భారతీయ శాస్త్రం 


యత్ర నార్యస్తు పూజ్యంతే 

రమంతే తత్ర దేవతాః I

యత్రైతాస్తు నపూజ్యంతే 

సర్వాస్తత్రాఫలాక్రియః ॥

              మనుస్మృతి 3/56 

  - ఎక్కడ స్త్రీలు పూజింప బడతారో,అక్కడ దేవతలు నివసిస్తారనీ, 

    ఎక్కడ పూజింప బడరో అక్కడ కార్యాలన్నీ నిష్ఫలాలని తెల్పి, 


స్త్రియః శ్రియశ్చ గేహేషు  

నవిశేషోస్తి కశ్చన I

  - స్త్రీలు గృహంలో గృహలక్ష్ములే, ఇంతకన్నా వేరే విశేషపదం లేదని మనువు స్త్రీని కీర్తిస్తాడు. 


    అందుకనే వివాహ సమయంలో కన్యాదాత “లక్ష్మీ నామ్నీం" కన్యాం "శ్రీమన్నారాయణ" స్వరూపాయ వరాయ దదాతి - అనిచెప్పి కన్యాదానం చేస్తారు.   

    తమ ఇంటబుట్టిన ఆడపిల్లని తండ్రి,సోదరులు బాగా చూసుకోవాలనీ, అమ్మాయికి కావలసినవి సమకూర్చాలనీ మనువు ఎంతో విపులంగా వివరిస్తాడు. 


స్త్రీలని గౌరవించడం మన సాంప్రదాయం. 


పౌరాణికం 


     ప్రహ్లాదుడు  

" కన్నుదోయికి అన్యకాంతలడ్డంబైన 

  మాతృ భావము జొచ్చి మరలువాడు" అని పోతన వివరిస్తాడు. 

    సీతని పరాభవించి రావణుడు, 

    ద్రౌపదిని అవమానపరచి  కౌరవులు ఎలా నాశానమయ్యారో మనకి తెలుసు. 


ప్రస్తుత పరిస్థితి 


    ప్రగతి పథంలో పయనించే ఈ ఆధునిక యుగంలో నవ నాగరిక సమాజంలో 

(i) కార్యాలయాల్లో, కళాశాలల్లో, అన్నిచోట్లా స్త్రీలు వేదింపబడటం శోచనీయం. 

(ii) చాటింగులు, డేటింగులతో, సెల్ ఫోను సంభాషణలతో యువత విచ్చలవిడిగా సంచరించడం ప్రమాదకారి అయింది. 

(iii) లేత వయస్సు లోనే విషయవాంఛలకు లోబడి జీవితాలను నాశనం చేసుకోడం చూస్తూనే ఉన్నాం. 

(iv) స్త్రీలపై యాసిడ్ దాడులు, గొంతులు కోయడాలు, అత్యాచారాలు ఇలా ఎన్నోదురాగాతాలు సమాజంలో జరగడానికి కారణం క్రమశిక్షణా లోపమే. 

    ఎంత చదువు చదివినా,ఎంత విజ్ఞానం సంపాదించినా, "అరణ్యరోదనన్యాయంలా” పనికి రాకుండా పోతోంది.   

    

పరిష్కారం 


    అసమానతలు తొలగి, ఆభిజాత్యాలు మరచి, అందరూ సుఖశాంతులతో జీవించాలన్నా, సమతా - మమతా - మానవతలు సమాజంలో వెల్లివిరియాలన్నా ఒక్కటే మార్గం. 

    అది మన సంప్రదాయాలని పాటిస్తూ, పెద్దలుచేప్పిన మార్గంలో పయనించడమే. 


    అప్పుడు, సంవత్సరానికి ఒకరోజు తద్దినం పెట్టినట్లు "WOMEN'S DAY" జరుపుకోవలసిన అవసరం ఉండదు.

కామెంట్‌లు లేవు: