4, సెప్టెంబర్ 2022, ఆదివారం

సంభోగ నియమాలు -

 ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలలో తెలియచేసిన స్త్రీ సంభోగ నియమాలు  -


 *  ప్రాణులకు నిత్యము శరీరము నందు సంభోగేచ్ఛ కలుగుచుండును. సంభోగం ఆచరించని యెడల శరీరము నందు మేహరోగం , మేధోవృద్ది , శరీర సంధులు సడలుట వంటి సమస్యలు కలుగును.


 *  సంభోగ సంబంధ ఆలోచనలు కలిగినపుడు బలవంతముగా మనస్సును నిరోధించుట , క్రోధము చెందుట, బ్రహ్మచర్యము , స్త్రీ సంభోగ సుఖం అనుభవించకుండా ఉండటం వలన మనుష్యుడు యొక్క శుక్రము క్షీణించును.


 *  శుక్రము క్షీణించినవానికి శరీర దౌర్బల్యము , ముఖం వాడుట, పాండురోగం , చిక్కిపోవుట , భ్రమ , నపుంసకత్వం , తన ప్రమేయం లేకుండానే శుక్రస్కలనం జరుగును.


 *  ఒకే గోత్రం గల స్త్రీ , శత్రువు భార్య , రాజు భార్య , మిత్రుని భార్య , దీర్ఘరోగములు కలిగిన స్త్రీ , శిష్యుని భార్య , బ్రాహ్మణ స్త్రీ , పిచ్చితో బాధపడుతున్న స్త్రీ , సన్యసించిన స్త్రీ , పతివ్రత , గురువు యొక్క భార్య , ముసలితనం గల స్త్రీ , గర్భవతి , అపరిచిత స్త్రీ వీరితో సంభోగం జరుపుట నిషిద్దం మరియు ధర్మశాస్త్ర విరుద్ధం.


 *  బాల,ముగ్ధ , ప్రౌఢ (అధిక వయస్సు ) స్త్రీల యొక్క వయోబేధమును , అనురాగమును అనుసరించి సంభోగక్రియ జరుపవలెను .


 *  స్త్రీ పదహారు సంవత్సరముల వరకు బాల అనియు , పదహారు మొదలుకొని ముప్పైరెండు సంవత్సరముల వరకు తరుణి అనియు , ముప్పైరెండు సంవత్సరముల నుండి యాభై సంవత్సరాల వరకు ప్రౌఢ అనియు , యాభై సంవత్సరాల పైబడిన వృద్ధస్త్రీ అని అందురు . ఈ వృద్ధస్త్రీతో సంభోగం నిషిద్దం.


 *  గ్రీష్మ, శరదృతువుల యందు కామేచ్ఛ గల పురుషుడు బాలసంభోగం హితకరం . హేమంత , శిశిర ఋతువు నందు తరుణియగు స్త్రీతో రమించుట హితకరం , వర్ష, వసంత ఋతువు యందు ప్రౌడస్త్రీతో రమించుట హితకరం.


 *  బాలా సంభోగం బలమును వృద్దిచేయును. తరుణీ సంభోగం శక్తిని క్షీణింపచేయును. ప్రౌఢ సంభోగం ముసలితనమును కలిగించును. ఈ నియమాలు అతిగా సంభోగించువారికి మాత్రమే . నియమిత పద్దతిలో కాలాన్ని అనుసరించి సంభోగించువారికి ఎటువంటి అనారోగ్యం కలగదు .


 *  కొత్తమాంసం , వేడిగా ఉన్న అన్నం , యవ్వనస్త్రీతో సంభోగం , పాలతో కూడిన అన్నం , నెయ్యి , వేడినీటి స్నానం ఈ ఆరు సేవించినవెంటనే శరీరబలాన్ని పెంచును.


 *  చెడిపోయిన మాంసం , వృద్ధస్త్రీ సంభోగం , ఉదయపు ఎండ , రేగటి పెరుగు , ప్రాతఃకాలంలో స్త్రీతో సంభోగం , ప్రాతఃకాలంలో నిద్ర ఈ ఆరు వెంటనే బలాన్ని హరించును .


 *  వయస్సులో తనకంటే పెద్దది అయిన స్త్రీతో రమించిన పడుచువాడు అయినను వృద్ధలక్షణాలు కలిగినవాడిగా అగును.


 *  హేమంత , శిశిర ఋతువుల యందు వాజీకరణ ఔషధాలు సేవించిన పురుషుడు యథేచ్ఛగా స్త్రీతో రమించవచ్చు. తప్పనిసరిగా వాజీకరణ ఔషధాలు సేవించవలెను . వసంత, శరదృతువుల యందు మూడు దినములకొకసారి , గ్రీష్మ , వర్ష ఋతువుల యందు పదిహేను రోజులకు ఒకసారి స్త్రీ సంభోగం ఆచరించవలెను.


 *  మనుష్యునికి శీతాకాలం నందు రాత్రి సమయములో , గ్రీష్మ కాలము నందు పగటి యందు , వసంతఋతువులో ఆహోరాత్రుల యందు , వర్షాకాలం నందు మేఘాలు గర్జించు కాలం నందు , శరదృతువులో ఎల్లప్పుడూ కామోద్రేకం కలుగుచుండును.


 *  పగటి యందు స్త్రీ సంభోగం ఆయుక్షీణం . సంభోగమునకు గ్రీష్మ, వసంత ఋతువులు అనుకూల కాలం .


 *  ఉదయ సంధ్య, సాయంత్రపు సంధ్యాకాలము నందు , పర్వదినముల యందు , గోవులను విడుచు ప్రభాతవేళ , అర్థరాత్రి యందు , మధ్యాహ్న కాలం నందు సంభోగం నిషిద్దం.


 *  శరీరబలం కలిగినవాడు, వాజీకరణ ఔషధాలు సేవించువాడు , యవ్వనవంతుడు ప్రతినిత్యం సంభోగం జరపవచ్చు.


 *  గురువులు నివశించే ప్రదేశమునకు సమీపస్థలం , బహిరంగ ప్రదేశముల యందు , దుఃఖకరమైన మాటలు వినపడు ప్రదేశముల యందు స్త్రీసంభోగం నిషిద్దం.


 *  అధికభోజనం చేసినవాడు , భయం కలిగినవాడు, శరీర అవయవముల యందు బాధ కలిగినవాడు , దప్పిక కలిగినవాడు , బాలుడు , వృద్దుడు , మలమూత్రాలు వచ్చువాడు , రోగముతో భాధపడువాడు స్త్రీసంభోగం చేయరాదు .


 *  రజస్వల అయిన స్త్రీ , సంభోగము నందు ఇష్టతలేనిది , మాలిన్యము కలిగినది , వయస్సులో తనకంటే పెద్దది అయిన స్త్రీ , రోగపీడితురాలు , అంగలోపము కలిగినది , గర్బవతి, ద్వేషించునది అయిన స్త్రీతో సంభోగం నిషిద్దం. ఇట్టి స్త్రీలతో రమించిన రోగములు కలుగును.


 *  సంభోగ నిగ్రహము లేని పురుషుడు రజస్వల అయిన స్త్రీతో సంభోగించిన పురుషునికి దృష్టి, ఆయువు, తేజస్సు నశించును.


 *  గర్భవతితో రమించిన గర్బమునకు హాని , రోగగ్రస్థ స్త్రీతో రమించిన బలం కోల్పోవును . మరియు మలినంతో ఉన్నది, ద్వేషించునది , శరీరం కృశించినది , బహిరంగ ప్రదేశమునందు సంభోగించిన శుక్రము క్షీణించి మనస్సు వికలతనొందును.


 *  ఆకలిగొనినవాడు , మనస్సు యందు కలవరం కలిగినవాడు , దప్పికతో ఉండువాడు , శరీర దుర్బలత కలిగినవాడు స్త్రీసంభోగం చేసినయెడల శుక్రం క్షీణించి వాతం ప్రకోపించును . ఆరోగ్యవంతుడు అయినను మధ్యాహ్న కాలం నందు రమించిన యెడల పైనచెప్పిన గుణములే కలుగును.


 *  రోగపీడితుడు స్త్రీసంభోగం చేసిన దేహబాధ , ప్లీహోదరం (spleen enlargement ) , మూర్చ, మృత్యువు కలుగును. సంధ్యాసమయం , అర్థరాత్రి యందు సంభోగం వొనర్చిన వాత,పిత్తములు ప్రకోపించును .


 *  రోగములు కలిగిన యోని యందు , గుదము నందు అంగప్రవేశం చేసి సంభోగం జరిపిన ఉపదంశం ( అంగము నందు తీవ్రంగా పోటు , కురుపులు ) , వాతప్రకోపం , శుక్ర క్షయం కలుగును.


 *  మలమూత్రాలు వచ్చుచున్నప్పుడు అవి నిరోధించి (ఆపుకొని ) సంభోగం చేసిన , స్కలన సమయంలో శుక్రము బయటకి రాకుండా బలవంతముగా ఆపుట వలనను , శుక్ర స్కలన సమయంలో వెల్లికిలా పడుకొని శుక్రం స్కలించుచున్న శుక్రం రాయిలా గడ్డకట్టి విపరీతమగు నొప్పి వచ్చు శుక్రశ్మరీ అను వ్యాధి వచ్చును.  కావున ప్రకృతి విరుద్ధములు అగు కార్యములను చేయకుండా ఉండటం మంచిది .


 *  సంభోగానంతరం , స్నానం , చందనలేపనం చేసుకుని చల్లనిగాలి , మధురభక్ష్యములు , చల్లనినీరు , పాలు , మాంసరసం , పెసరకట్టు , ద్రాక్షారసం వంటివాటిని సేవించి మెత్తనిపాన్పుపైన పడుకొని నిద్రించవలెను . ఇలా చేయుట వలన శరీరమునకు అంతకు ముందు ఉండు బలం సిద్ధించి నీరసం , నిస్సత్తువ పోవును .


 *  మన శరీరబలమునకు మించి అతిమైధునం చేయుటవలన వాతవ్యాధులు , శూల , కాస , జ్వరం , శ్వాస , లివరు రోగములు , పాండువు , క్షయ వంటి వ్యాధులు సంభంవించును.


         పైనచెప్పిన విధముగా నియమితకాలాన్ని అనుసరించి సంభోగ క్రియను నిర్వర్తిస్తూ ఆరోగ్యముగా ఉండగలరు.


              పూర్తి వివరణాత్మకమైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథములు చదవగలరు . 


    

కామెంట్‌లు లేవు: