1, నవంబర్ 2020, ఆదివారం

రామాయణమ్ 184

 రామాయణమ్ 184

.....................................

ఋక్షరజస్సు అనే వానరుడి భార్యకు సూర్యదేవుడి అనుగ్రహము వలన పుట్టిన వాడీ సుగ్రీవుడు ,సూర్యకిరణములు ప్రసరించినట్లు అతని దృష్టి పుడమి నాలుగు దిక్కులా ప్రసరిస్తుంది .ఆయన ఋష్యమూకము అనే పర్వతము మీద నలుగురు వానరులతో కలిసి నివసిస్తున్నాడు .

.

అతని అన్న అయిన వాలి అతనిమీద కోపించి రాజ్యమునుండి వెడలగొట్టినాడు.

.

ఆయనచాలాగొప్పపరాక్రమము ,తేజస్సు

సాటిలేనికాంతికలిగినవాడు .సత్యసంధుడు ,వినయవంతుడు,ధైర్యవంతుడు ,బుద్ధిశాలి .

.

 ఇతను వానరుడే కదా ! అని నీవు సుగ్రీవుని అవమానించరాదు ,ఆయన కృతజ్ఞుడు స్వేచ్చానుసారము రూపము ధరించగల సమర్ధుడు .

.

అతనికిప్పుడు మీ అవసరమున్నది ,

అతని కార్యమొకటి నెరవేర్చవలసి ఉన్నది .

ఇంకోక్కమాట !అతని కార్యము నేరవేరిననూ నేరవేరకపోయిననూ అతడు నీపని చేయగలడు .సీతను రావణుడు ఎక్కడ దాచిఉంచినా కనుగొనగలడు.

.

రామా నీవు శీఘ్రమే ఇక్కడనుండి బయలుదేరి సుగ్రీవుని వద్దకు వెళ్లి అగ్నిసాక్షిగా ఆయనతో స్నేహము చేసికొనుము .

.

రామా! ,సుగ్రీవునకు నరమాంసభక్షకులయిన రాక్షసుల స్థావరములన్నియు తెలియును .నదులు,పర్వతాలు,సముద్రాలు ,దుర్గములు అన్ని ప్రదేశములు తన అనుచరుల చేత వెదికించి సీత జాడ కనుగోనగలడు.

.

రామా ముందుగా ఇక్కడనుండి పడమర దిక్కుగా ప్రయాణము సాగించండి .ఆ మార్గములోని అరణ్యమునందు ఎక్కడ చూసినా పుష్పించి ఫలములతో నిండి ఉన్న వివిధ వృక్షజాతులతో దట్టముగా మార్గములల్లుకొని ఉండును.

. నేరేడు,మొరటి,పనస,జువ్వి,మర్రి,తుమ్మిక,రావి ,కొండగోగు,మామిడి,చండ్ర,పొన్న ,బొగ్గు,కానుగ,అశోక,కదంబ,గన్నేరు,భల్లాతక,నల్ల అశోక,రక్తచందన,వేప వృక్షజాతులతో ఆ అరణ్యము శోభాయమానముగా ఉందును.

.

లక్ష్మణుడు ఆ వృక్షములను ఎక్కిగానీ ,బలముచేత క్రిందకు పడగోట్టికానీ వాటి అమృత ఫలములను భక్షిస్తూ వెళ్ళండి .

.రామాయణమ్ 185

...

రామా పుష్పించిన ఆ వనము దాటిన పిమ్మట మరియొక సుందరమైన వనమున్నది చైత్రరధమునందువలే ఆవనమందు అన్ని ఋతువులు ఒకేసమయమున ఉండును.రామా అచటనున్న పర్వతము దాటి మరియొక పర్వతము తదుపరి మరియొక వనము దాటిన పిదప మీరు పంప అనే పద్మ సరస్సును చేరగలరు.

.

ఆ సరస్సు కడు నిర్మలముగా ఉంటుంది ,జారుడు ప్రదేశముగానీ నాచుగానీ అస్సలు కనుపించదు అన్ని ప్రదేశములు సమతలముగా ఉంటాయి .అక్కడ హంసలు నీరుకోళ్ళు,క్రౌంచపక్షులు,

కురరపక్షులు,మధరధ్వనులతో ఆ సరస్సులో కూస్తూ కనబడతాయి.

.

నేతిముద్దల వలె పెద్దప్రమాణములో ఉన్న పక్షులను మీరు భక్షించవచ్చును.

.

ఆ రమణీయమైన ప్రదేశము నీ దుఃఖము పోగొట్టగలదు.

.

అక్కడ మతంగ మహాముని శిష్యురాలు శబరి ,తన తోటివారంతా స్వర్గస్థులైనా కన్నులలో ప్రాణములు నిలుపుకొని నీ దర్శనముకొరకు ఎదురు చూస్తూ ఉంటుంది.

.

ఆ పంపా తీరమునకు పడమర దిక్కున నీకు సాటిలేనిదీ, రహస్యమూ అయిన ఒక ఆశ్రమము క‌నపడుతుంది .ఆ ఆశ్రమము ఇప్పటికీ అక్కడ మతంగమహాముని ఏర్పాటు చేసిన నియమములు పాటింపబడుతున్నవి.

.

దానికి ఇంకాస్త ముందుకు వెళ్ళినచో ఋష్యమూక పర్వతము నీకు అగుపించగలదు.

.

ఆ పర్వతము మీద నిదురించినవారు తమ కలలో చూసిన ధనమును వెంటనే పొందగలరు.

.

దురాచారి అయినవాడు ఆ కొండ ఎక్కినచో అతనిని నిద్రలోనే రాక్షసులు చంపివేయుదురు.

.

రామా ! ఆ పర్వతము మీద ఒక పెద్ద గుహ ఉండి దానికి అడ్డముగా ఒక పెద్దకొండరాయి నిలబెట్టబడి ఉంటుంది.

.

ఆ గుహలోనే తన అనుచరులైన నలుగురు వానరులతో కలిసి సుగ్రీవుడు నివసిస్తున్నాడు.

.

అని కబంధుడు చెప్పగా విని అతనిని ఇక నీవు వెళ్ళుము! అని అనుమతించారు.

కామెంట్‌లు లేవు: