11, జూన్ 2023, ఆదివారం

ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 87*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 87*


ఆనాడే చంద్రగుప్త మౌర్యుని పట్టాభిషేకం. 


పాటలీపుత్రం అంతటా మామిడి తోరణాలతో, రంగురంగుల రంగవల్లికలతో సువాసనలు గుభాళించే వివిధ పూలహారాలతో అలంకరించబడింది. మహానందుల వారిపై తమకి గల భక్తి అభిమానాలను నగర పౌరులు వీధి వీధినా, ఇంటింటా రకరకాల రంగురంగుల అలంకారాలతో ముస్తాబు చేసి తమ రాజభక్తిని చాటుకున్నారు. 


ఆ ఆలంకరణల్లో అతి ముఖ్యమైనవి, ప్రజలను విశేషంగా ఆకర్షిస్తున్నవి స్వాగత ద్వారాలు. మహారాజుగా సింహాసనాన్ని అధిష్టించబోతున్న చంద్రగుప్తుడు గజరాజు చంద్రలేఖ మీద ఆసీనుడై ఊరేగింపుగా ఒక్కొక్క ద్వారం క్రింది నుంచి వస్తాడు. ఆ ద్వారాలు దాటుతున్నప్పుడు వాటి మధ్య ప్రత్యేకంగా నిర్మించిన గుమ్మటాల్లోంచి పూలవర్షం మహారాజు పై కురుస్తుంది. ఆ వింతలూ, విడ్డూరాలూ కళ్ళారా చూడడానికి నగర పౌరులు ప్రధానవీధులకి ఇరువైపులా బారులు తీరి గుంపులు గుంపులుగా నిలబడి ఆ ఘడియ కోసం ఉత్సాహంగా ఎదురు చూడసాగారు. 


అయితే అతిథి భవనంలో చాణక్యుడు ఏ మాత్రం ఉత్సాహంగా లేడు. 'ఆ స్వాగత ద్వారాలలో ఒకటి దారువర్మ అనే శిల్పి నిర్మించాడు. దారువర్మ రాక్షసమాత్యునికి భక్తుడు, భృత్యుడు. అజ్ఞాతవాసంలో ఉన్న అమాత్యుడు శిల్పి దారువర్మ ద్వారా ఊరేగింపు సమయంలో చంద్రగుప్తుని హతమార్చడానికి వ్యూహం రచించాడు' అని వర్తమానం పంపించాడు ఇందుశర్మ. 


చాణక్యుడు ఈ వార్త తెచ్చిన ఆగమసిద్ధి వైపు చిరాకుగా చూస్తూ "ఒకవైపు ఊరేగింపుకి సమయం దగ్గర పడుతుంటే ఇంత ఆలస్యంగా వార్తలు పంపడం ?" అని విసుక్కున్నాడు. 


ఆగమసిద్ధి తలవంచుకుని "విషకన్య ప్రయోగం విఫలమై అజ్ఞాతవాసంలోకి వెళ్ళినప్పటి నుంచి అమాత్యుడి అనుపానులు తెలియడంలేదు. అతడిప్పుడు జీవసిద్ధిని కూడా కలవడం లేదు. అసలు ఈ మాత్రం విషయ సేకరణయే గగన కుసుమం అయిందని, ఇందుశర్మ గురుదేవులు, మనవి చెయ్యమన్నారు" చెప్పాడు వినయంగా. 


చాణక్యుడు అసహనంగా పచార్లు చేస్తూ..  

"పోనీ ఆ దారుశర్మ నిర్మించిన ద్వారం ఎక్కడో గుర్తించారా" అడిగాడు. 


"అలా గుర్తించడం అసాధ్యం. మౌర్యుడు ఊరేగింపుగా వచ్చే ప్రధానమార్గాలలో పౌరులు ఎవరిశక్తి, భక్తి కొలది వారు ద్వారాలు నిర్మించుకున్నారు. నగరంలో రాజమార్గంలో సుమారు 250 స్వాగతద్వారాల నిర్మాణం జరిగింది. అయితే ఉత్తరదిశలో ఆ ద్వారం నిర్మించమని దారుశర్మను అమాత్యుడు ఆదేశించినట్లు తెలిసింది" అని మనవి చేశాడు ఆగమసిద్ధి. 


చాణక్యుడు చప్పున ప్రచార్లు ఆపి 

"ఆహా ... ! రాక్షసామాత్యా...! నీ రాజభక్తి ప్రశంసనీయము. నవనందులపై నీకు గల ప్రేమాభిమానములు అసామాన్యములు. ఈ చాణుక్యుని తంత్రములనే త్రిప్తిగొట్టుటకు విశ్వప్రయత్నాలు చేయుచుంటివిగా ...? చూసేదగాకా..." అన్నాడు సాలోచనగా. 


అంతవరకూ మౌనంగా ఉన్న చంద్రగుప్తుడు నోరు విప్పి "తమరు, అసలా రాక్షసుని ఎందుకు ఉపేక్షిస్తున్నారో అర్థం కావడం లేదు" అన్నాడు అసహనంగా. 


"ఉపేక్ష కాదు చంద్రా, ఆపేక్ష... రాజభక్తిలో, మంత్రాంగంలో, పరిపాలనా చాతుర్యంలో అమాత్యుడు అసమాన ప్రజ్ఞా దురంధరుడు. అతడు నీకు విధేయుడే, ఈ మంత్రిమండలికి నాయకుడై ' మహామంత్రి'గా బాధ్యతలు స్వీకరించేనా... ఇక నీకూ, నీ సామ్రాజ్యమునకూ ఎదురే ఉండదు. అందుకే అతడంటే ఆపేక్ష. ఎలాగైనా నీకు విధేయుడుగా మార్చవలెనని యే ఉపేక్ష..." చెప్పాడు చాణక్యుడు. 


చంద్రుడు నొసలు చిట్లించి "ఏమో... అతనిని ఎవరు నమ్మగలరు ? ఎట్లు నమ్మగలరు ? అతను నందానుకూలుడు" అన్నాడు అనాసక్తిగా. 


"ఏం... ? నువ్వు కావా, నందుడివి... ?" ఎదురు ప్రశ్నించాడు చాణుక్యుడు. చంద్రుడు నిర్ఘాంతపోయాడు. 


చాణక్యుడు నవ్వి "మీ తండ్రిగారిది నందవంశము. వారి వారసుడివైన నువ్వే అసలైన నందుడివి కానీ.... సంకరజాతి వారైనా నవనందులు నందవంశస్థులు కారు. కాలేరు. ఈ సత్యం రాక్షసామాత్యునికి కూడా తెలుసు. అందుకే అతడికి నీ పట్ల బయటికి వ్యక్తం చెయ్యలేనంతటి ప్రేమాభిమానాలున్నాయి. కానీ అతడు మహాపద్మనందుడికి ఇచ్చిన మాట గురించి ఇదంతా చేస్తున్నాడు. అపాత్రదానం ఎంత పాపమో, అధర్మనుడికి చేసిన వాగ్దానమూ అటువంటిదే... దానిని మీరడం దోషం కాదు. ద్రోహం కాదు. ఈ ధర్మసూక్ష్మాన్ని రాక్షసుడు గ్రహించేటట్లు చెయ్యగలిగితే... చంద్రా... ! నేను కలలుకంటున్న మహాసామ్రాజ్య స్థాపన జరుగుతుంది. దానికి నువ్వు సార్వభౌముడివై, రాక్షసామాత్యుని సారధ్యంలో ప్రజారంజకంగా పాలన చేస్తూ నా అర్థశాస్త్రమును ఈ దేశవ్యాప్తంగా ఆచరణ సాధ్యం చేసి ప్రజలను ధర్మ, న్యాయ, సత్య, అహింస, ప్రేమ మార్గాలలో బుద్ధి జీవులుగా మార్చవలెనని నా సంకల్పం... దానికోసమే ఈ ప్రయాస... అందుకే ఈ ఉపేక్ష..." అని వివరించాడు గంభీరంగా. 


చాణక్యుని అంతర్యానికీ ఆత్మ విచక్షణకి జేజేలనర్పిస్తూ చంద్రుడు, ఆగమసిద్ధి చేతులెత్తి నమస్కరించారు. క్షణం తర్వాత ఆగమసిద్ధి కల్పించుకొని ... "ఊరేగింపు బయలుదేరడానికి అట్టే వ్యవధి లేదు. రాక్షసామాత్యుని వ్యూహాత్మక ద్వారం ఎక్కడ నిర్మించబడిందో తెలుసుకునేంతటి వ్యవధి లేదు. పోనీ... ఊరేగింపు మానేస్తే ... ?" అన్నాడు.


"అసంభవం ...." అన్నాడు చాణక్యుడు పట్టుదలగా. దీర్ఘాలోచనతో వికృతంగా భృకుటి ముడిచి "ఈ చాణక్యుడు ఒకసారి నిర్ణయం తీసుకుంటే. దాని ప్రకారం ఆ కార్యక్రమం జరిగిపోవాలి. చంద్రుడు భద్రగజంపై ఊరేగింపుగా పురవీధుల్లో సాగుతూ సుసాంగ ప్రాసాధాన్ని చేరుకుంటాడని చాణక్యుడు నిర్ణయించాడు. ఆ నిర్ణయానికి తిరుగులేదు. చంద్రా ! నువ్వు సిద్ధంకా... ఇప్పుడే వస్తా..." అనేసి విసవిసా బయటికి నడిచాడు. 


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.* 


🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: