16, అక్టోబర్ 2022, ఆదివారం

అన్నం - తైత్తిరీయోపనిషత్తు

 ॐ     అన్నం - తైత్తిరీయోపనిషత్తు 


1. అన్నం న నింద్యాత్ - తద్వ్రతం (తై .ఉ. 3.7). 


    మనం ఆహారాన్ని ఎప్పుడూ నిందించరాదు  - అనేది వొక వ్రతం. 


    అన్నాన్ని నిందించని వాడే - బ్రహ్మజ్ఞానానికి అర్హుడు. అటువంటి వాడికే - పుష్కలంగా - అన్నం ఇవ్వబడుతుంది. 

    అన్నాన్ని నిందించే వాడికి, సరైన ఆహారమూ దొరకదు. అది పుష్కలంగానూ యివ్వబడదు. ఇచ్చినా, అతడు ఆ ఆహారాన్ని తినలేని పరిస్థితుల్లో వుంటాడు. 

    ఇలా ఎన్నో చోట్ల ఉపనిషత్తులలో చెప్పబడింది.  

    

    నిందించడమంటే - తిట్టడం మాత్రమే  కాదు. కంచంలోనో, ఆకులోనో వేసుకున్న ఆహారాన్ని, ఎవరిపైననో కోపంతో  విసిరి వేయడం, 

    చేసిన వారినో, వండిన వారినో తిట్టడం కూడా ఇందులోకే వస్తుంది. 

    మనలో కొంత మంది ఇలాంటివి ఎన్నో చేస్తాము. 

    ఇది బాగు లేదు, అది బాగు లేదు - అనడం కూడా పనికి రాదు. ఇవన్నీ చేయరాదు. దీని తరువాత మరి కొన్ని వస్తాయి. అవికూడా చదువుదాం.


2.అన్నం న పరిచక్షీత - తద్వ్రతం (తై .ఉ. 3.8). 


    అన్నాన్ని నిరసన  భావంతో ఎప్పుడూ నిరాకరింప కూడదు. 

    ఇది కూడా ఒక వ్రతం. 


    వ్రతం అంటే ఏమిటి?  నమ్మకంతో, భక్తితో పాటించ వలసిన నియమం. 

    అన్నం పట్ల పూర్తి సద్భావం ఉండాలి. వీళ్లిచ్చారనో, వాళ్లిచ్చారనో - బాగున్న అన్నాన్ని తృణీకరించరాదు.


    ఈ మొదటి రెండూ - తీసుకుని తినేవారికీ, అతిథులకీ చెప్పబడింది. 

    అంతే కాదు. ఇంట్లో సాధారణంగా గృహిణి  వండివడ్డిస్తుంది. మిగతా వారు తింటారు. 

    ఆ తినేవాళ్లకు అందరికీ ఇది తప్పకుండా వర్తిస్తుంది. 

    వండిన వాళ్లనో, వడ్డించే వాళ్లనో, తినే ఆహారాన్నో - తినే వారు తప్పు పట్టకూడదు. కృతజ్ఞతా భావం ఉండాలి.   

    అది ఉపనిత్  వాక్యం. ఇది జీవితాంతం పాటించ వలసిన వ్రతం.   


    ఈ క్రింద వచ్చే సూత్రాలు - అన్నాన్ని  సంపాదించేవారికి, చేసేవారికి, వడ్డించేవారికి వర్తించే నియమాలు, వ్రతాలు.


3. అన్నం బహుకుర్వీత - తద్వ్రతం (తై .ఉ. 3.9). 


    అన్నాన్ని ఎంత ఎక్కువగా వీలైతే అంత ఎక్కువగా  సంపాదించాలి. ఇది కూడా ఒక వ్రతం. 

    అన్నం - అంటే, మనం నిత్యం ఉపయోగించే ఆహార వస్తువులు కూడా - అని తెలుసుకోవాలి. 

    అంటే, మనుషులకు ఉపయోగపడే అన్ని ఆహార వస్తువులు సంపాదించాలి. 

    ఎందుకు మన అవసరాలకు మించి సంపాదించాలి?  ఈ ప్రశ్న  మన మనస్సులో తప్పక వస్తుంది .


ఎందుకు?


    దీనికి సమాధానం, దీని తరువాత చాలా రకాలుగా నిర్దిష్టంగా  యివ్వ బడింది.     

    మనం  గమనించ వలసిన  ముఖ్య విషయం ఏమిటంటే   -  "ఎక్కువ సంపాదించడం " - తప్పు  అని మన వారు అనలేదు. 

    ధార్మికంగా  ఎంతైనా  సంపాదించవచ్చు. తప్పులేదు.  


4. న కంచన వసతౌ ప్రత్యా చక్షీత . తద్వ్రతం - తస్మాత్ యయాకయా చ విధయా - అన్నం - ప్రాప్నుయాత్ (తై .ఉ .3.10.)


    ఆశ్రయాన్ని కోరి మన ఇంటికి ఎవరైనా వస్తే, అటువంటి అతిథిని - ఎవరినికానీ - లేదు, అని చెప్పి తిప్పి పంపరాదు. ఇది కూడా ఒక వ్రతం.      

    వారికి కావలసినవన్నీ - ఎంత వీలైతే అంత, ఎన్ని రకాలుగానైనా సంపాదించాలి. అంటే అన్నీ ధర్మ బద్ధమైన మార్గాలలోనే. 

    చూశారా ! 

    అతిథుల కోసం, అవసరం ఉన్నవారి కోసం, అడిగే వారి కోసం, లేనివారి కోసం - మనం (ఎంత ఎక్కువైనా)  సంపాదించాలనే  - ఉపనిషత్తు కూడా చెబుతోంది. 

    - ఇది వ్రతం అన్నారు.  

          ...ఇంకాఇంకా ఇలాంటి విషయాలెన్నో శాస్త్రం చెబుతుంది.

కామెంట్‌లు లేవు: