27, అక్టోబర్ 2021, బుధవారం

సంస్కృత మహాభాగవతం*

 *27.10.2021 ప్రాతః కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - పందొమ్మిదవ అధ్యాయము*


*జ్ఞాన-భక్తి-యమనియమాది సాధనముల వర్ణనము*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*19.9 (తొమ్మిదవ శ్లోకము)*


*తాపత్రయేణాభిహతస్య ఘోరే సంతప్యమానస్య భవాధ్వనీశ|*


*పశ్యామి నాన్యచ్ఛరణం తవాంఘ్రిద్వంద్వాతపత్రాదమృతాభివర్షాత్॥12969॥*


స్వామీ! దుస్సహమైన ఈ సంసారమార్గమున సాగిపోవుచున్న మానవుని తాపత్రయములు అనుక్షణము పీడించుచుండును. అందు నిరంతరము పరితాపమునకు లోనగుచున్న పురుషునకు సర్వరక్షకమైన నీ పాదపద్మయుగళమనెడి గొడుగునీడ తప్ప శరణ్యమైనది మరియొకటి లేదు. అది అమృతమయమైన మోక్షమును ప్రసాదించును.


*19.10 (పదియవ శ్లోకము)*


*దష్టం జనం సంపతితం బిలేఽస్మిన్ కాలాహినా క్షుద్రసుఖోరుతర్షమ్|*


*సముద్ధరైనం కృపయాఽఽపవర్గ్యైవచోభియాసించ మహానుభావ॥12970॥*


మహానుభావా! దుర్భరమైన ఈ సంసారకూపమునపడి, కాలసర్పముచే కాటువేయబడుచున్నను మానవుడు క్షుద్రసుఖములపైగల తృష్ణను వీడలేక విలవిలలాడుచున్నాడు. అట్టి స్థితిలో నున్న పురుషుని మోక్షబోధకములైన నీ అమృతవచనములతో తడిపి దయతో ఉద్ధరింపుము.


*శ్రీభగవానువాచ*


*19.11 (పదకొండవ శ్లోకము)*


*ఇత్థమేతత్పురా రాజా భీష్మం ధర్మభృతాం వరమ్|*


*అజాతశత్రుః పప్రచ్ఛ సర్వేషాం నోఽనుశృణ్వతామ్॥12971॥*


*శ్రీభగవానుడు వచించెను* ఉద్ధవా! నీవు అడిగిన ఈ ప్రశ్ననే పూర్వము అజాతశత్రువైన ధర్మరాజు ధర్మాత్ములలో మేటియైన (భగవద్భక్తులలో శ్రేష్ఠుడైన) భీష్మపితామహుని మా అందరి సమక్షమున (మేము అందరము వినుచుండగా) అడిగెను.


*19.12 (పండ్రెండవ శ్లోకము)*


*నివృత్తే భారతే యుద్ధే సుహృన్నిధనవిహ్వలః|*


*శ్రుత్వా ధర్మాన్ బహూన్ పశ్చాన్మోక్షధర్మానపృచ్ఛత॥12972॥*


కురుక్షేత్రయుద్ధము ముగిసిన పిమ్మట ధర్మరాజు తనయొక్క బంధుమిత్రుల మృతికారణముగా ఎంతయు శోకవిహ్వలుడయ్యెను. అంతట అతడు భీష్మాచార్యుని నుండి పెక్కు ధర్మములను గూర్చి వినినమీదట మోక్షధర్మములను గూర్చి అభ్యర్థించెను.


*19.13 (పదమూడవ శ్లోకము)*


*తానహం తేఽభిధాస్యామి దేవవ్రతముఖాచ్ఛ్రుతాన్|*


*జ్ఞానవైరాగ్యవిజ్ఞానశ్రద్ధాభక్త్యుపబృంహితాన్॥12973॥*


అప్పుడు భీష్మపితామహుడు జ్ఞాన, విజ్ఞాన, వైరాగ్య, శ్రద్ధాభక్తిభావములతో పరిపూర్ణమైన పెక్కుమోక్షధర్మములను ధర్మరాజునకు నా సమక్షముననే తెలిపియుండెను. ఇప్పుడు నేను వాటిని నీకు వివరింతును.


*19.14 (పదునాలుగవ శ్లోకము)*


*నవైకాదశపంచత్రీన్ భావాన్ భూతేషు యేన వై|*


*ఈక్షేతాథైకమప్యేషు తజ్జ్ఞానం మమ నిశ్చితమ్॥12974॥*


ఉద్ధవా! ప్రకృతి, పురుషుడు, మహత్తత్త్వము, అహంకారము, పంచతన్మాత్రలు (శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు) అను తొమ్మిది, ఐదు జ్ఞానేంద్రియములు, ఐదు కర్మేంద్రియములు, మనస్సు - అను పదకొండు, పంచమహా భూతములు (పృథివ్యాపస్తేజోవాయురాకాశములు), త్రిగుణములు (సత్త్వరజస్తమో గుణములు) అను ఈ ఇరువది ఎనిమిది తత్త్వములు మొదలుకొని బ్రహ్మపర్యంతముగల అన్ని కార్యములలో గోచరించును. వీటిలో కూడ పరమాత్మతత్త్వము ఒక్కటే అవగతమై యున్నట్లు దర్శించుటయే - పరోక్షజ్ఞానము అనబడును.


*19.15 (పదిహేనవ శ్లోకము)*


*ఏతదేవ హి విజ్ఞానం న తథైకేన యేన యత్|*


*స్థిత్యుత్పత్త్యప్యయాన్ పశ్యేద్భావానాం త్రిగుణాత్మనామ్॥12975॥*


ఈ ఇరువది ఎనిమిది తత్త్వములు ఉత్పత్తి, స్థితి, నాశములుగలవి. ఇవి త్రిగుణాత్మకమైన మాయయొక్క కార్యములు. ఈ భావములతో పరమాత్మ జగత్తుయొక్క సృష్టి, స్థితి, లయములను జరుపుచుండును. ఇవి ఆ స్వామియొక్క లీలలే. వీటిలో అంతర్లీనమైయున్న ఆ పరమాత్మతత్త్వమే శాశ్వతము. ఆ తత్త్వము అనుభవైకవేద్యము. అదే విజ్ఞానము.


*19.16 (పదహారవ శ్లోకము)*


*ఆదావంతే చ మధ్యే చ సృజ్యాత్సృజ్యం యదన్వియాత్|*


*పునస్తత్ప్రతిసంక్రామే యచ్ఛిష్యేత తదేవ సత్॥12976॥*


ఈ విధముగా పరమాత్మయే జగత్తుయొక్క ఆది మధ్యాంతములలో ఉండును. ఆ ప్రభువు ఈ విశ్వమును సృష్టించి, అందులో తానే అంతర్యామియై విలసిల్లుచుండును. ప్రళయకాలమున దానిని మరల తనలో లీనమొనర్చుకొను చుండును. అటుపిమ్మట ప్రళయానంతరము గూడ నిత్యసత్యమైన ఆ పరమాత్మతత్త్వమే మిగిలియుండును.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని పందొమ్మిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

కామెంట్‌లు లేవు: