27, అక్టోబర్ 2021, బుధవారం

ఉచ్ఛిష్టం* ( ఎంగిలి )

 *ఉచ్ఛిష్టం* ( ఎంగిలి )

 ఇంత గొప్ప వ్యాసాన్ని ప్రచురించిన ఋషిపీఠం వారికి నమో నమః🙏

బొట్టు జారిపోతోంది...
'కట్టు' మారిపోతోంది!
కూరుచున్న కొమ్మలను 
కూలదోయుచున్న దెవరు? 
మూలం తెలియక మాయల 
జాలంలో పడినవారు.... 
మారీచుని భూతం కని 
మదనుడన్న వారెవరు? 
ఎంగిలి చదువుల ముంగిట 
చతికిల పడి ఉన్న వారు! 


గలగలా కబుర్లు చెప్పుకుంటూ వారు నలుగురూ బస్ స్టాప్ వద్దకు నడచి వచ్చారు. బహుశా ఆ నలుగురూ ఒక జట్టు కావచ్చు! పసితనం ఇంకా తొలగని మిసిమితనం వారి వదనారవిందాలలో ప్రస్ఫుటిస్తోంది. సందేహం లేదు, వారంతా ఇంటర్మీడియట్ విద్యార్ధినులే. కళాశాలల నుంచి ఇళ్లకు బయలుదేరిన వారంతా అక్కడ చేరిపోయారు. 


ఆ నలుగురూ ఒక 'శీతల పానీయశాల' వద్దకు వచ్చి నిలబడినారు. కొట్టువాడు రెండు పెద్ద గ్లాసులు నిండా 'పెప్సీ' పానీయం పోశాడు. ఇద్దరు అమ్మాయిలకు అందించాడు. ఇద్దరు బాలికలే కొన్నారు. మిగిలిన ఇద్దరి వద్ద పైసలు లేవేమో? .. 'పెప్సీ' గ్లాసులు అందుకున్న అమ్మాయిలిద్దరూ నిలబడినారు. అందుకోని పిల్లలు ఇద్దరూ బెంచిమీద కూచున్నారు. ఒక అమ్మాయి గ్లాసులోని పానీయం కొంచెం తాగింది. ఆ తరువాత చాలా జాగ్రత్తగా ఆ గ్లాసును కూర్చున్న బాలికకు అందించింది. ఆమె కూడ కొంచెం తాగి, పక్కనున్న నాలుగవ అమ్మాయికి అందించింది. ఆ నాలుగవ బాలిక కూడ తాగి మళ్లీ మొదటి అమ్మాయికి ఇచ్చింది. వారు తాగిన దాన్ని మళ్లీ తాను తాగుతోంది.... 


ఇలా ఒకరి ఎంగిలి మరొకరు తాగడం, తినడం ఇప్పుడు భలే ఫ్యాషనైపోయింది. ఇలా చేయడం "ఆత్మీయత"కు చిహ్నంగా, స్నేహానికి పరాకాష్ఠగా ప్రచారం జరిగిపోతోంది. "అయినా! ఎంగిలి ఏమిటి?? ఎక్కడుంది?? " అని ఎదురు ప్రశ్నలు కూడ దూసుకొని వస్తున్నాయి. 

"రెండు గ్లాసుల పానీయాన్ని నాలుగింటిలో పంచుకొని తాగవచ్చు కదా?" అని అడిగి చూడండి "అదంతా పూర్వ కాలం నాటి మూఢాచారం. ఇది కంప్యూటర్ యుగం..." అన్న సమాధానం కూడ వచ్చేస్తుంది! 

 ఘరానా హోటళ్ళలో 'సాంబారు'ను 'సీజనింగ్' చేసే 'కిచెన్ మాస్టర్' (వంటవాడు అనడం అవమానకరం) గరిటెలో పులుసును తీసుకొని చేతిలో పోసుకొని నాకుతాడు. చెయ్యి కడగడు. ఒక్కొక్కసారి, మిగిలిన ఎంగిలి సాంబారును 'స్టైల్' గా పొయ్యిమీద ఉన్న పులుసు గిన్నెలోకి విదిలించి పారేస్తాడు! 

"వేలుపులటె నాకంటెను
వేలుపు మరి ఎవ్వడంచు వికవిక నగి, మా 
వేలుపుల గోడపై ఓ 
హేలావతి! నీతనూజు డెంగిలిపూసెన్!" 

అంటూ ఆనాడు, ద్వాపర యుగంలో గోపకాంతలు యశోదమ్మ దగ్గర వాపోయారు. చిన్ని కృష్ణుని 'ఆగడాల' లో ఇలా 'ఎంగిలి పూయడం' ఒకటి. "పసిపిల్ల వాడు కదా. ఎంగిలి పూస్తే పూశాడులే!" అని గోపెమ్మలు ఎందుకు ఊరుకోలేదు? ఎందుకంటే, 'ఎంగిలి' ని 'మంగళం'గా స్వీకరించడం భారతీయతకు వ్యతిరేకం కాబట్టి! తండ్రీ కొడుకులు, తల్లీ కూతుళ్లు సైతం ఒకరి 'ఎంగిలి' మరొకరు తినడం, తాగడం భారతదేశంలో అనాదిగా నిషిద్ధం! 

ఒక పల్లె నుండి కొంత మంది జానపదులు ఒక పట్టణానికి వెళ్లారు. మధ్యాహ్నమైంది. ఆ గ్రామీణులు భోజనం చేయడానికై ఒక 'హోటల్' కు వెళ్లారు. ఒక 'టేబిల్' చుట్టూ కూచున్నారు. భోజనం చేయడం ఆరంభించారు. కానీ పక్కన ఉన్న మరో బల్ల వద్ద కనిపించిన దృశ్యం చూసి వాళ్ళకు డోకు వచ్చిందట. వాంతి అవుతుందేమోనని భయపడినారు. వారంతా అర్ధాంతరంగా లేచివచ్చేశారట - బిల్లు చెల్లించి! 

పక్క టేబిల్ వద్ద వారికి కన్పించిన దృశ్యం ఏమిటి? నలుగురు వ్యక్తులు ఆ టేబిల్ వద్ద కూర్చున్నారు. వారంతా విదేశీయ మతం స్వీకరించిన వారు. ఆ విధర్మీయులు నలుగురూ తమ కంచంలోనుండి తింటున్నారు. ఒకరు, మిగిలిన ముగ్గురి కంచాలలోని పదార్థాలను సైతం తింటున్నారు. ఒకరి ఎంగిలి కంచంలో నుండి మరొకరు మెక్కుతున్నారు. బల్లమీదంతా ఈ 'సామూహిక ఉచ్ఛిష్ట భక్షణ అవశేషాలు' నిండిపోయాయట. అది వారి మతం, వారి పద్ధతి. ఈ విదేశీయ మ్లేచ్ఛ ఆచారం ఆ జానపదులకు నచ్చలేదు. అసహ్యం వేసింది. ఎందుకంటే, ఆ గ్రామీణులంతా హిందువులు. 

ఆ జానపదులలోని ఒక వృద్ధుడు ఇంకా ఇలా వివరించాడు ".....మనం ఒకరి ఎంగిలి మరొకరు తినము. అంతేకాదు ఒకరి ఎంగిలిని మరొకరు తింటూ ఉంటే చూడలేం కూడ! బిచ్చగాడికి సైతం మనం ఎంగిలి అన్నం పెట్టం, కుక్కకు కూడా ఎంగిలి కూడు వెయ్యం...." ఇలా 'ఎంగిలి'ని నిరసించిన వారు వేద పండితులు కాదు, విదేశీయమైన 'ఎంగిలి' చదువులు వంట బట్టని సామాన్య గ్రామీణులు, సాదా సీదా హిందువులు!

దేవుడికి నైవేద్యం పెట్టిన తరువాత భూత యజ్ఞం చేయడం కూడ హిందూ జీవన పద్ధతి. సనాతన ధర్మం నిర్దేశిస్తున్న పంచయజ్ఞాలలో భూతయజ్ఞం ఒకటి. ఇది నిత్యవిధి. 'బలిహరణం' పెట్టడం కూడ భూతయజ్ఞమే. ఈ 'బలిహరణం' కుక్కకు, అవుకు, జలచరాలకు, పక్షులకు వేయవచ్చు. ఇప్పుడు ఇలా భూతతృప్తి చేసిన తరువాతనే మనం భోజనం చేయాలన్న సనాతన ఆచారాన్ని నగరాలలోని అత్యధిక హిందువులు మరచిపోయారు. కొంతమంది కేవలం పండుగలప్పుడు మాత్రం 'బలిహరణం' పెడుతున్నారు. బూట్లు కట్టుకొని టేబుల్ ముందు కూచోని నడుము వంగకుండా చెంచాలతో ఆరగించే నవ నాగరికులు మనవన్నీ మరచిపోతున్నారు.

విదేశీయమైన ఎంగిలి సంప్రదాయాలను 'కల్చర్' అనుకొని మురిసి పోతున్నారు. అలా 'బలిహరణం' వేయడం మనంణ తినక పూర్వం జరిగే నిత్యవిధి. ఈ 'బలిహరణ' ఓదనం 'ఎంగిలి ముద్ద' కాదు, కారాదు. అన్నం పెట్టలేక పోతే గోధుమలను బియ్యపు గింజలను సైతం ఒక గుప్పెడు పక్షులకు బలిహరణం పెట్టవచ్చు. పొలాలలో బువ్వతినే రైతన్నలు, గ్రామీణులు మాత్రం నిత్యం భూతయజ్ఞం చేస్తున్నారు. చూసివస్తే తెలుస్తుంది. మొదటి ముద్దను తుంచి (ఎంగిలి కాకపూర్వం) ఎదురుగా ఉండే కుక్క ముందుకు విసురుతారు. లేదా దూరంగా పక్షులకు విసిరివేస్తున్నారు. మరోసారి కుక్కకు పెట్టాలనుకుంటే 'బుట్ట' లోని 'ఎంగిలికాని' ముద్దలను పెడతారు కానీ, తాము తింటున్న 'తట్ట'లోని ఎంగిలి ముద్దలు వేయరు. ఇలా 'ఉచ్ఛిష్ట భోజన' నిషేధం అక్షరాలురాని జానపదులలో సైతం అనాదిగా అభివ్యాప్తమై ఉంది. కానీ అక్షరాలు నేర్చిన వారు ఈ సనాతన పద్ధతులకు దూరమైపోతున్నారు. ఇదంతా చెబితే చాలా మందికి బ్రహ్మాండమైన కోపం కూడ వచ్చేస్తుంది. 

మంగళకర భావాలను పరస్పరం పంచుకోవడం, మంచి సంస్కారాలను సమష్టిగా ఆచరించడం సనాతన ధార్మిక జీవన రీతి. కాని ఎంగిలి తినడం కాదు! ఒక వ్యక్తి తన ఎంగిలి అన్నాన్ని సైతం మరోసారి తినరాదని వేద శాస్త్ర పురాణాలు చెబుతున్నాయి. 

 ప్రతీ ఉదయం చేసే సంధ్యావందనం లో ...
"యదుచ్ఛిష్టం, అభోజ్యం యద్వాదుశ్చరితం మమ సర్వం పునంతు మాం ఆపః...." అని నీరు జల్లుకుంటాం. 
అర్థం: "ఎంగిలి తిన్నందువల్ల, తినకూడనిది తిన్నందువల్ల, తెలియక చేసిన ఇతర చెడ్డ పనుల వల్ల వచ్చిన పాపం నుంచి ఈ ఉదకం నన్ను విముక్తిణ్ని చేయుగాక...." 

బాలుడికి ఉపనయనం చేసేటప్పుడు నందిమోహం లో తల్లి, కుమారుడు ఒకే పళ్లెంలో భుజిస్తారు. పిల్లవాడు తల్లి ఎంగిలి తినడం అదే చివరి సారి. రజస్వల అయిన బాలికలు, పెళ్లయిన బాలికలు తల్లి ఎంగిలిని సైతం తినరు. పది పదిహేనులోపు వయసున్న బడిపిల్లలు సైతం ఒకరి ఎంగిలి మరొకరు తినరు. నిన్న మొన్నటి వరకు సజీవంగా ఉండిన ఈ సనాతన తత్వం నేడు పాశ్చాత్య నాగరికతా గ్రస్తమైపోతోంది. 'పదార్థ మోహం'తో బాల్య చాపల్యంతో పిల్లలు 'కాకెంగిలి' తినేవారు. ఒక మిఠాయిని కాని, తిను బండారాన్ని కాని పిల్లలు చేతితో తుంచలేనప్పుడు ఆ పదార్ధం చుట్టూ గుడ్డ చుట్టి కొరకడం, ముక్కలు చేయడం "కాకి ఎంగిలి". అది చిన్న పిల్లలు మాత్రమే ఈ పని చేసేవారు. ప్రస్తుతం కాకిని తోలేసి పెద్దలంతా 'ఎంగిలి'ని తినేస్తున్నారు. వారిని చూసి పిల్లలు కూడ నేర్చుకుంటున్నారు. మళ్లీ ఎప్పుడో.... "ఎంగిలి తినడం, తాగడం ప్రమాదకరం, రోగాలు వ్యాపిస్తాయి సుమా!" అంటూ పాశ్చాత్య దేశాలలో శాస్త్రీయ ప్రచారం మొదలైపోతుంది. అప్పుడు కానీ మన విద్యావంతులు ఎంగిలి తినడం మానరేమో! మన ఉత్కృష్ట సంస్కృతిని ఉచ్ఛిష్ట నాగరికత మింగివేస్తోంది! 

రైల్లో బస్సుల్లో ఆసీనులైన వారు 'ఉర్లగడ్డ ఉప్పేరి' (పొటాటో చిప్స్) ప్లాస్టిక్ పాకెట్లను నోటితో కొరికి చింపుతున్నారు. తరువాత ఆ ఎంగిలిని అందరికీ పంచుతున్నారు.          

"అక్టోబర్ 2007 ఋషిపీఠం మాస పత్రికలో 'హెబ్బార్ నాగేశ్వరరావు' గారు రచించిన ప్రత్యేక రచన".

కామెంట్‌లు లేవు: