7, జనవరి 2023, శనివారం

నూటెనిమిది సార్లు

 ఒక్కసారి కాదు నూటెనిమిది సార్లు


పరమాచార్య స్వామివారికి మెడవెనుక భాగంలో కొంచం నొప్పిగా ఉంది. స్వామికి కంటిశుక్లాల ఆపరేషన్ చేసిన డా. బద్రినాథ్ అది బహుశా స్పాండిలోసిస్ ఏమో అని అనుమానంగా ఉందని, స్వామిని పరీక్షించి చికిత్స చేయవలసిందని డా. కళ్యాణరామన్ ని కోరారు. 


ఒకరోజు మద్యాహ్నం షోలాపూర్లో ఉన్న స్వామివారి మకాంకి వచ్చారు. భోజనం అయిన పిదప వారిని స్వామివారి వద్దకు తీసుకునివెళ్ళారు. మహాస్వామి వారికి మెడనొప్పితో పాటు చాలా జ్వరంగా కూడా ఉందని చెప్పారు. వారిని పరీక్షించడానికి స్వామివారు అనుమతిచ్చారు. 


డా. కళ్యాణరామన్ మొదటగా నమస్కరించారు. ఎందుకు నమస్కరించావని స్వామివారు అడిగారు. అందుకు మహాస్వామివారితో, “నా క్లినిక్ లో ప్రతి రోగిని పరీక్షించే ముందు నా మనస్సులో మిమ్మల్ని తలచుకొని నమస్కరించి అతని వ్యాధి నయంకావాలని కోరుకునేవాణ్ణి. ఇప్పుడు నేను పరీక్షించవలసింది మిమ్మల్నే కాబట్టి ఇంకెవరికి నమస్కరించగలను నా చికిత్స సఫలం అవ్వాలని. మీకు తప్ప” అని అన్నాడు. 


స్వామివారు నవ్వి “సరే కానివ్వు” అని అన్నారు. 


పరీక్షించిన తరువాత మహాస్వామివారికి 105 డిగ్రీల జ్వరం ఉందని గ్రహించాడు. కొద్దిగా సంకోచిస్తూ స్వామివారితో, “స్వామివారికి జ్వరం చాలా ఎక్కువగా ఉంది. జ్వరం తగ్గేంతవరకు ఒకటి రెండు రోజులపాటు చన్నీటి స్నానం మానడానికి వీలవుతుందా?” అని అడిగాడు. 


”అది ఎలా కుదురుతుంది? ఇదే జ్వరంతో నిన్న రాత్రి చంద్రగ్రహణమని గ్రహణ సమయంలో స్నానం చేశాను” అని అన్నారు. 


వారి మాటలు విని కళ్యాణరామన్ ఆశ్చర్యంతో, ”ఈశ్వరా! ఎలా పరమాచార్య స్వామివారి దేహం ఇంతటి శ్రమను ఓర్చుకోగలుగుతోంది?” అని అడిగాడు.


మహాస్వామివారు అతనితో, “గ్రహణస్నానం ఎలా చేస్తారో తెలుసా?” అని అడిగారు. 


”లేదు పెరియవ”


“నీ చేతివేళ్ళతో ముక్కు మూసుకుని నదినీటిలో తల పూర్తిగా తడిసేలాగా మునగాలి”


నేను ఆశ్చర్యంతో నిలబడిపోయాను. 


తరువాత మహాస్వామివారు “ఒక్కసారి కాదు. నూటెనిమిది సార్లు” అని అన్నారు. 


ఆ మాటలు వినగానే ఒక్కసారిగా దాదాపు కుప్పకూలిపోయాను. తరువాత తేరుకుని “నేను మీకు ఏమి చికిత్స ఇవ్వగలను?”


“మీరు సాక్షాత్ శివావతారులు. 105 డిగ్రీల జ్వరంతో ఉండి కూడా 108 సార్లు తలస్నానం చేశారంటే కేవలం ఆ పరమశివుడే మీ శరీరాన్ని కాపాడుతున్నాడు. మీకు నాలాంటి అల్పుడు చేయగలిగిందేమి ఉంది? మాలాంటి వారికోసం, మిమ్మల్ని పూర్తి ఆరోగ్యంగా ఉంచమని ఆ శివుణ్ణి వేడుకోవడం తప్ప” 


--- డాక్టర్ యస్. కళ్యాణరామన్, న్యూరోసర్జన్, చెన్నై


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కామెంట్‌లు లేవు: