12, సెప్టెంబర్ 2020, శనివారం

మొగలిచెర్ల అవధూత

మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..
అవధూతల దర్శనం..

నెల్లూరు నుంచి శ్రీ చంద్రశేఖర్ గారు అదే మొదటిసారి మొగలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిరానికి రావడం..శ్రీ స్వామివారి సమాధిని దర్శించుకుని..మందిరం లోని ప్రధాన మంటపం చుట్టూరా ప్రదక్షిణం చేసి..శ్రీ స్వామివారి విగ్రహం వద్ద పూజ చేయించుకొని..కొద్దిసేపు మంటపంలో కూర్చున్నారు..చంద్రశేఖర్ గారి మనసులో ఒక కోరిక కలిగింది..అడగాలా?..వద్దా?..అనే సందేహం లో కొంచెం సేపు మథనపడి.. చివరకు..

"ప్రసాద్ గారూ..మిమ్మల్ని ఒకటి అడగొచ్చా?.."అన్నారు..

"మందిరానికి సంబంధించినది ఏదైనా సరే..నిరభ్యంతరంగా అడగండి.." అన్నాను..

"శ్రీ గొలగమూడి వెంకయ్య స్వామి వారి పటాన్ని తీసుకొచ్చి..ఇక్కడ..ఈ మందిరం వద్ద ఒక ప్రక్కన పెట్టాలని కోరిక కలిగిందండీ..మీరు అనుమతి ఇస్తే..శ్రీ వెంకయ్య స్వామి వారి పటాన్ని తీసుకొస్తాను.." అన్నారు..

"ఎటువంటి ఇబ్బందీ లేదు..మీరు చూస్తున్నారు కదా..నైరుతి మూలలో శ్రీ సాయిబాబా మందిరం ఉన్నది..శ్రీ దత్తాత్రేయ స్వామివారిని దర్శించిన తరువాత..శ్రీ సాయిబాబా ను కూడా దర్శించుకుంటున్నారు..అలాగే శ్రీ వెంకయ్య స్వామి వారి పటం వుంటే..ఆ స్వామికి నమస్కరించుకుంటారు..గొలగమూడి లో ఉన్న వెంకయ్య స్వామి వారిని కూడా అవధూత పరంపర లోనే పరిగణిస్తున్నారు కదా..నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదండీ.." అన్నాను..

చంద్రశేఖర్ గారు ఎంతో సంతోషం తో .."ఈసారి వచ్చేటప్పుడు శ్రీ వెంకయ్య స్వామి వారి పటాన్ని తీసుకొస్తానండీ..ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు.." అని చెప్పి..నెల్లూరు వెళ్లిపోయారు..

రెండు నెలలు గడిచాయి..ఒకరోజు చంద్రశేఖర్ గారు ఫోన్ చేసి.."ప్రసాద్ గారూ..శ్రీ వెంకయ్య స్వామి వారి చిత్రం ఒక్కటే కాకుండా..ఇతర అవధూతల చిత్రాలు కూడా తీసుకురావాలని నాకు స్వప్నంలో ఆదేశం వచ్చిందండీ..శ్రీ దత్తాత్రేయస్వామి వారి గర్భ గుడి వెలుపల గోడ మీద నాలుగు వైపులా కొలతలు తీసుకొని..అందుకు తగ్గట్టుగా అవధూతల పటాలు చేయించి..తీసుకొస్తాను..రేపుదయం వస్తున్నాను..నాతో పాటు నెల్లూరు లోని సత్యం స్థూడియో యజమాని గారు కూడా వస్తున్నారు.." అన్నారు..తీరా చూస్తే..ఆ సత్యం గారు మాకు దూరపు బంధువు..దత్త భక్తుడూ..

అనుకున్న విధంగానే ప్రక్కరోజు శ్రీ స్వామివారి మందిరానికి వచ్చి..ప్రధాన మంటపం చుట్టూరా కొలతలు తీసుకొని వెళ్లిపోయారు..మళ్లీ రెండు నెలల పాటు ఎటువంటి కబురూ లేదు..

ఆ తరువాత ఒక ఆదివారం నాడు..
శ్రీ దత్తాత్రేయ (త్రిమూర్తి స్వరూపుడు)
శ్రీ పాద శ్రీ వల్లభులు..
శ్రీ నృసింహ సరస్వతి..
శ్రీ స్వామీ సమర్ధ..
శ్రీ మాణిక్ ప్రభు మహారాజ్
శ్రీ సాయిబాబా..
శ్రీ వెంకయ్య స్వామి..

వీటన్నింటి తో పాటు..మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారు..

మొత్తం ఎనిమిది చిత్రపటాలు.. పెద్ద సైజువి తీసుకొని వచ్చి..మంటపం చుట్టూ ఒక పద్ధతి ప్రకారం అమర్చారు..

"చిత్రమేమిటంటే..అందరు అవధూతల చిత్రపటాలు తయారయ్యేదాకా..శ్రీ వెంకయ్య స్వామి వారి చిత్రపటం పూర్తి కాకపోవడం..అందరి తో కలిసే శ్రీ వెంకయ్య స్వామి వారు మొగలిచెర్ల స్వామివారి దగ్గరకు రావడం.."

మొగలిచెర్ల శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిరానికి వచ్చిన భక్తులు ప్రధాన ఆలయం చుట్టూ ఒక ప్రదక్షిణ చేసేటప్పుడు..పై అవధూతలందరి దర్శనము అవుతుంది..

ఒక్క వెంకయ్య స్వామి వారి పటాన్ని మాత్రం పెట్టుకోవడానికి అనుమతి కోరిన చంద్రశేఖర్ గారు..శ్రీ స్వామివారి ఆదేశం తో అందరు అవధూతల చిత్రపటాలూ తీసుకొచ్చారు..తనకూ ఇతర అవధూతలకూ బేధమే లేదని శ్రీ స్వామివారు పరోక్షంగా సూచించారు..

సర్వం..
దత్తకృప.

(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం.. మొగలిచెర్ల గ్రామం...లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్:523114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: