19, సెప్టెంబర్ 2021, ఆదివారం

సత్యం జ్ఞానమనంతం

 

సత్యం జ్ఞానమనంతం యద్బ్రహ్మా తద్వస్తు తస్యతత్
ఈశ్వరత్వం జీవత్వముపాధిద్వయ కల్పితం

అంటుంది వేదాంత పంచదశి. సత్యం, జ్ఞానం, అనంతం అనే లక్షణాలతో పేర్కొన్న పరబ్రహ్మం ఏది కలదో అదే వస్తువు (పరమార్థం). పరబ్రహ్మం ఈశ్వరత్వం, జీవత్వం అనే రెండు ఉపాధులు కలిగి ఉంటుంది.ప్రపంచం ఏర్పడేందుకు మూలకారణమైన ప్రకృతి త్రిగుణాత్మకమైంది. అంటే సత్వ, రజస్తమో గుణాలు కలది. జ్ఞానం, స్వచ్ఛత, శాంతి మొదలైన వృత్తులకు సత్వగుణం, కామం, క్రోధం మొదలైన వాటికి రజోగుణం, అలాగే మూఢత్వం, సోమరితనం మొదలైన వృత్తులకు తమోగుణాలు కారణాలు. శుద్ధ సత్తం అంటే రజస్తమో గుణాల కలయిక లేని నిర్మలమైన సత్వగుణమేమాయ’. మాయాశక్తి ఉపాధిగా కలవాడు ఈశ్వరుడు. ఇతడు సర్వనియామకుడు. సర్వజ్ఞుడు, శాసకుడు. మాయను ఆధీనంలో ఉంచుకొని ప్రపంచకార్యాలు నిర్వహించువాడు. మలిన సత్తం అంటే రజస్తమో గుణాల కలయిక కలిగినది. అవిద్య, అజ్ఞానం.. వీటిని ఉపాధిగా కలవాడు జీవుడు. మాయకు వశుడు. మాయలో ప్రతిబింబించిన బ్రహ్మం ఈశ్వరుడు అయితే, అవిద్యలో ప్రతిబింబించే బ్రహ్మం జీవుడు. విధంగా ఒకే పరబ్రహ్మం ఉపాధి భేదం కారణంగా ఈశ్వరునిగా, జీవునిగా ఉన్నాడు.

పంచమహా భూతాల్లోని సత్వగుణ అంశాలు జ్ఞానేంద్రియాలుగా, సత్వగుణ సమష్టి అంతఃకరణంగా రూపొందినవి. అలాగే రజోగుణ అంశాల కారణంగా కర్మేంద్రియాలు, సమష్టి రజో అంశం కారణంగా ప్రాణాలు ఏర్పడినవి. పంచీకరణమైన పంచభూతాల నుంచి స్థూల శరీరం ఏర్పడింది. ఇది నానా రూపాలతో, నానా గుణాలతో జీవులుగా మనుగడ సాగిస్తున్నది. మూడు శరీరాలతో అంటే పంచభూతాలతో ఏర్పడిన స్థూల శరీరం, జ్ఞానేంద్రియ పంచకం, కర్మేంద్రియ పంచకం, ప్రాణ పంచకం, మనస్సు, బుద్ధి అనే అంతఃకరణాలు మొత్తం 17 తత్వాలతో సూక్ష్మ శరీరం, కారణ శరీరాలలో జీవులు ప్రపంచంలో భోగాలను అనుభవిస్తున్నాయి. మూడు శరీరాలు మళ్లీ ఐదు కోశాలుగా విభజన చెందాయి. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ అని పంచ కోశాలు. కోశం అనగా కత్తిని దాచు ఒర.

వివిధ అవయవాలతో బయటకు కనపడేది స్థూల శరీరం. దీనినే అన్నమయ కోశం అంటారు. ఇది అన్నం చేత పుట్టింది. దీని పోషణ అన్నంతోనే! దీని ఉనికి జాగ్రదవస్థ అంటే.. ఇంద్రియాలతో పదార్థాలను గ్రహిస్తుంది. రూపాలను, గుణాలు తెలుసుకుంటుంది. పూర్వజన్మలలో చేసిన వివిధ కర్మఫలాలను అనుభవించడానికి ఇది ఏర్పడింది.

శరీరంలో వాయురూపంలో ఇంద్రియాలను ప్రేరేపిస్తూ, దేహానికి బలాన్నిచ్చేది ప్రాణం. చేసే వృత్తులను బట్టి దీనికి పలు పేర్లు. శ్వాసరూపంలో ప్రాణం, మలమూత్ర విసర్జన కలిగించునది అపానం, జీర్ణక్రియ నిర్వహించేది సమానం, ఆహారాన్ని గ్రహించడానికి ఉపయోగపడేది ఉదానం, రక్తప్రసరణకు ఉపకరించేది వ్యానం.. ఇలా ఐదు రకాలుగా చెప్పారు. ప్రాణాలతో కూడినది కాబట్టి దీనిని ప్రాణమయ కోశం అన్నారు. ఇంద్రియ విషయాలను విచారించేది మనస్సు. ఇది మనోమయం. మనోమయ కోశం సాధనం కాగా, కర్తృత్వం చేసేది బుద్ధిమయ కోశం లేదా విజ్ఞానమయ కోశం. ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశాలు మూడు కలిసి సూక్ష్మ శరీరం. దీని ఉనికి స్వప్నావస్థ.

అంతర్ముఖత్వం చేత బ్రహ్మమును గ్రహించు ఒక విశేష బుద్ధి వృత్తి ఆనందమయ కోశం. ఇది ఇష్టం, సంతోషం అనే వృత్తులు కలది. దీని ఉనికి సుషుప్త అవస్థ. దీనికి కారణ శరీరం. అనుభవం చేత పంచకోశాలు అనుభవిస్తున్నదేదో అదే ఆత్మ. తనకు తానుగా ప్రకాశిస్తుంది. అన్ని అవస్థలకు సాక్షిగా ఉన్నది పరబ్రహ్మం. ఇది తురీయావస్థ. ఇలా జీవుడు పంచకోశాలతో కూడిన తన స్వ స్వరూపాన్ని మరచి సంసార చక్రంలో పరిభ్రమిస్తున్నాడు. వివేకజ్ఞానంతో తర్కిస్తూ కోశములు బ్రహ్మం కాదనీ, అశాశ్వతమని తెలుసుకొన్న జీవుడు భ్రాంతిని తొలగించుకుని బ్రహ్మమును సాక్షాత్కరించుకోగలడు.

సేకరణ 

కామెంట్‌లు లేవు: