16, జనవరి 2022, ఆదివారం

సొంతింటి కల

 🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹

   కోట జగదీశ్ గారి "సొంతింటి కల" కథనం.

                🌷🌷🌷

‘అక్కడేదో కనిపిస్తోంది. అదొక్కటీ చూసేసి ఇంటికెళిపోదాం!’ అంది సావిత్రి. అప్పటికే చాలాసేపట్నుంచీ ఊరంతా తిరుగుతున్నారు. ఎలాగైనా నెలాఖరుకల్లా ఏదో ఒక అపార్ట్‌మెంట్ బుక్ చేసెయ్యాలని నిర్ణయించుకున్నారు. 


‘ఇది డెడ్ ఎండ్‌లా ఉంది. దీని తరవాత ఇంకలేవు. పేరు కూడా ఎన్‌క్లేవ్ అనే పెట్టాడందుకే!’ చిరాకుని చిగురాకంత చిరునవ్వుతో దాచాలని ప్రయత్నిస్తున్నాడు ప్రసాద్.


బిల్డింగైతే చూడటానికి ఏదో బానే వుందనిపిస్తోంది. కింద మేనేజర్ని అడిగితే మూడో అంతస్తులో ఖాళీ ఉన్నాయని చెప్పాడు. లిఫ్టదీ ఇంకా తయారవలేదు. మెట్లెక్కి పైకి వెళ్లారు. ఇల్లంతా కలియజూసేసి కిచెన్ వైపు వచ్చారు. దక్షిణం వైపు బాల్కనీలోకి వచ్చి గోడవతల దృశ్యం చూసి ఒక్కసారిగా కొయ్యబారిపోయారు.


అప్పుడే ఫ్రెష్‌గా శవాన్ని కాలుస్తున్నారక్కడ. పక్కనే, గోడనానుకునే స్మశానం. 


‘ఇదేందివయా ఇదీ? బెడ్‌రూమ్ కిటికీలోంచి చూస్తే డైరెక్టుగా కనబడేలా ఉంది? సీ వ్యూ, లేక్ వ్యూ పేర్లు పెడతారు చూడూ, దీనికి ‘గ్రేవ్ వ్యూ’ అపార్ట్‌మెంట్స్ అని పెట్టండి పేరు. సరిపోతుంది. పద సావిత్రీ!’


‘సర్, అదేంలేద్సార్! మనకసలు ఎటువంటి డిష్టబెన్సూ ఉండదు. ఇన్నిరోజుల్నించీ కడతన్నామా, ఇప్పటివరకూ ఒక్క బాడీని కూడా కాల్చలేద్సార్! బాడ్‌లక్ మీరొచ్చినపుడే రావాలా? అయినా మన కాంపౌండ్ వాల్ చాలా హైటొస్తాద్సార్! కిటికీలకి టింటెడ్ గ్లాసేసుకుంటే కనబడే అవకాశం కూడా ఉండదు!’ 


ఎలాగోలా ఒప్పించేద్దామని చూస్తున్నాడు.


‘వద్దులే తమ్ముడూ! మాకు సెంటిమెంట్లవీ ఎక్కువ. ఇలా స్మశానాలవీ ఆక్రమించేసి రియల్ ఎస్టేట్‌ కాస్తా బరియల్ ఎస్టేట్‌లా మార్చేస్తున్నారు!’


చూసింది చాల్లే అనుకుని కిందకొచ్చి బండెక్కేశారు. ఎండ తీవ్రంగా ఉంది. ఇక ఆపేసి ఇంటికెళిపోదామని నిర్ణయించుకున్నారు దంపతులిద్దరూ.


మెయిన్‌రోడ్డు మీదకు రాగానే వెంకట్రెడ్డి కనబడ్డాడు. 


‘నమస్తే ప్రసాద్‌గారూ! ఇళ్ల వేటా? ఇంకా కొనలేదేటి?’ అన్నాడు పెద్దగొంతేసుకుని.


‘ఏవీ నప్పట్లేదు వెంకట్రెడ్డీ! మీ బావమరిదేదో కడుతున్నాడని చెప్పావు, పూర్తైందా?’


‘అయిపోవచ్చింది ప్రసాద్‌జీ! కానీ కాస్త తక్కువ రేంజ్. మీకు నచ్చుద్దోలేదో?’


‘ఒకసారి చూసేస్తే పోలా? పద వెళ్దాం!’


అక్కణ్ణుంచి మూడువీధులవతల కాస్త గోప్యంగా కట్టాడు బిల్డింగ్. చుట్టూ బోల్డన్ని చెట్లు, పొదలమధ్య దాక్కున్నట్టుంది బిల్డింగ్.


రెడ్డి చెప్పినట్టు కాస్త మీడియం రేంజే! గదులవీ బావున్నాయి కానీ బాల్కనీలు మాత్రం చిన్నవి. బెడ్‌రూమ్ కిటికీని బాగా దగ్గరగా ఆనుకుని పక్కనే మరొక అపార్ట్‌మెంట్ వాళ్ల బాల్కనీ ఉంది. ఏ పచ్చిమిరపకాయలో అయిపోతే అక్కణ్ణుంచి విసిరితే ఇటొచ్చి పడేంత దగ్గర. 


కిటికీగనక తీస్తే ఆయింట్లో ఉండేవాళ్ల డ్రాయర్లు, లంగాల కలర్సన్నీ మనకి కంఠతా వచ్చేస్తాయి. అన్నీ సెవెంటీ ఎంఎం స్క్రీన్ మీద చూస్తున్నట్టుగా ఆరేశారు. చెరుకుపల్లి టవర్స్ కాదు. ఇరుకుపల్లి టవర్సని పెట్టాల్సింది పేరు. నవ్వుకుని బయటికొచ్చాడు ప్రసాద్.


బాత్రూములోకి వెళ్లి చూశాడు. ప్లంబర్ కుర్రాడెవరో బాగా అప్రెంటిస్ అనుకుంటా! ఫ్లష్ ట్యాంకుకీ, కమోడ్‌కీ కనీసం తొంభై డిగ్రీలైనా ఉండాలికదా? పాపం, ఎనభై డిగ్రీలే పెట్టిచచ్చాడు. దాంతో బాత్‌రూముకి వెళ్లిన ప్రతిసారీ ఆ లిడ్‌ని పైకెత్తితే, అదొచ్చి సరిగ్గా ‘అక్కడే’ పడి కొట్టుకుంటుంది. రోజూ ఆ హింస భరించడం ఎంతకష్టం? పైగా పైకి చెప్పుకోవడానికి కూడా వీల్లేని కష్టమది!


అయినా అతను మాత్రం ఏంజేస్తాడు, బాత్రూములు అంత చిన్నవిగా ఉంటే? 


మళ్ళీ నవ్వొచ్చింది ప్రసాద్‌కి. ఇవన్నీ వెంకట్రెడ్డితో మాటాడ్డానికి మొహమాటపడి థాంక్స్ చెప్పేసి బయల్దేరాడు. పాపం, ముందునుంచీ అంటూనేవున్నాడుగా మీకు నప్పదని!


భోజనం కానిచ్చి మళ్ళీ సాయంత్రం బయల్దేరి మరో పాష్ ఏరియాలో అడుగుపెట్టారిద్దరూ. ఒకటేదో ‘ఫ్లాట్స్ ఫర్ సేల్’ అని బోర్డు చూసి వెళ్లారు. సెల్లార్‌లో వైటండ్ వైట్ వేసుకుని ఏవో రాసుకుంటున్న ఒకతన్ని పేరూ, ఉద్యోగ వివరాలు చెప్పి పలకరించారు ఇద్దరూ. 


‘ముందు పైకెళ్లి చూసొచ్చి అప్పుడు రేటదీ మాటాడదాం!’ అంది సావిత్రి. సరేనన్నాడు సత్యవంతుడు. ఇద్దరికీ ఆ అపార్ట్‌మెంట్ చాలా నచ్చేసింది. పైగా దేనికదే సెపరేటుగా విశాలంగా కూడా ఉన్నాయి. 


కిందకొచ్చి ఆఫీసు రూములో కూర్చున్న తరవాత అడిగాడు ప్రసాద్


‘ఉన్నాయాండీ? లేక అయిపోయాయా?’


‘చెప్పండ్సార్! మీకే ఫ్లోర్లో కావాలి?’


‘ఫస్టయితే దోమలెక్కువగా వుంటాయిట. థర్డ్, ఫోర్త్ కరెంటు లేకపోతే ఎక్కడం కష్టం. అంచేత సెకండే బెటరనిపిస్తోంది!’ 


ఇది అనేకానేక చర్చల తరవాత దంపతులిద్దరూ తీసుకున్న నిర్ణయం. 


‘సెకండా? ఉండండి చూస్తాను. మూర్తీ, ఆ డైరీ పట్రా ఓసారి!’ అంటూ ఎల్ఐసీ వాళ్ల డైరీ ఒకటి తెరిచి అన్నీ పరికించి బుర్ర అడ్డంగా ఊపాడు.


‘ఏంటి? లేవా?’ అన్నాడు నిస్పృహతో!


‘అసలెప్పుడో అయిపోయాయి సార్! మీరు చాలా లేటుగా వచ్చారు. మేవిఁక్కడ అపార్ట్‌మెంట్ కట్టాలని మనసులో అనుకున్నప్పుడే సగం ఫ్లాట్స్ బుక్కైపోయాయి. అలాంటిది మీరింత ఆలస్యంగా వచ్చి అడిగితే ఎలా?’ అంటూ మందలించాడు. 


ఎంసెట్‌కి ఆలస్యంగా వచ్చినా క్షమిస్తారేమోగాని ఇతనసలు క్షమించేలా లేడు.


కాసేపు నిశ్శబ్దం. ప్రసాద్ మొహంలో కొంతైనా పశ్చాత్తాపం కనబడుతుందేమో, ఇంకొంచెం బెట్టు చేద్దామనుకున్నాడు. 


కానీ వాళ్లిద్దరూ ‘ఆఁ! ఇది కాకపోతే వందున్నాయి. లోకం గొడ్డుపోయిందా?’ అన్నట్టు నిలబడ్డారు.


అప్పుడు అతనిలో చలనం వచ్చింది. 


‘పోనీ ఓపని చేద్దాం ప్రసాద్‌గారూ! మా బావమరిది అడిగాడని సెకండ్లో ఒకటుంచాను. అతనికి నేనేదో చెప్పుకుంటాన్లెండి. మీరు మా శ్యాంబాబుకి కావలసినవాళ్లు కాబట్టి అది మీకిచ్చేస్తాను. కాకపోతే ఎస్సెఫ్టీకి మరో యాభై ఎక్కువవుతుంది!’


ఇట్టాంటి స్ట్రాటజీలు చాలా విన్నాడు ప్రసాద్. అయినాసరే, ఆ ప్రాంతంలో ఉండాలన్న బలమైన కోరికతో ఒప్పేసుకున్నాడు. 


అది మొదలు సావిత్రికి రోజూ అందమైన కలలు రావడం మొదలయ్యాయి. ఆ విశాలమైన రోడ్లమీద చుట్టూ తురాయి చెట్ల నీడలో బొచ్చుకుక్కనొకదాన్ని తీసుకుని వాకింగులవీ చేస్తున్నట్టు, వర్షం పడుతోందని ఏ చెట్టునీడనో ఆగితే ఒక్కసారిగా గాలేసి ఆ చెట్టుపూలన్నీ తనమీద పూలవాన కురిసినట్టూ... 


‘పాలూ...!’ అని అరిస్తే అప్పుడు మెలకువొచ్చేది. 


పూలవాన నుంచి బయటపడి పాలక్యాన్ పట్టుకుని తలుపు తీసేది.


ప్రసాదుకి ఇటువంటి కలలవీ అలవాటులేదు. అతను చాలా మెటీరియలిస్టిక్. ఇల్లంటే ఇటుకలూ సిమ్మెంటనే అతని దృష్టి. అంచేత అతనెప్పుడూ ఇంటిచుట్టూ లాన్ల గురించి కాకుండా ఇంటికి కట్టాల్సిన లోన్ల గురించే ఆలోచించేవాడు.


పని చురుగ్గా సాగుతోంది. సావిత్రి ఎప్పటికప్పుడు వెళ్లి తనకెలా కావాలో మార్పులవీ చెబుతూ చేయించుకుంటోంది. పనివాళ్ళు చాలా చురుకైనవాళ్లు. చెప్పింది చెప్పినట్టు భలే మార్చేసేవారు. 


ఒకరోజు ప్రసాద్, సావిత్రి కలిసి వెళ్లారు. కింద సెల్లార్‌లో బిల్డర్ లేడు. పనివాళ్లని అడిగితే హరిద్వార్ వెళ్లాడని చెప్పారు. అతగాడి మేనమామగారు కూర్చున్నారు ఆఫీసులో. చూడ్డానికి వయసైపోయిన అరవింద్‌స్వామిలా ఉన్నాడాయన. అద్భుతమైన వర్ఛస్సు. నమస్కారాలు తెలిపి పైకి వెళ్లారు.


అక్కడ దృశ్యం చూసి మరోసారి కొయ్యబారిపోయారు.


కిచెన్‌నుంచి బయటికి వెళ్లే దారిలో పెద్ద ఫ్లోర్ విండో ఒకటి కనబడుతోంది. అది వీళ్లు చెప్పనేలేదసలు. ఒక్కసారిగా కంగారైపోయారు. బయటికొచ్చి అది సెకండ్ ఫ్లోరా కాదా అని రూఢీ చేసుకున్నారు. మళ్లీ లోపలికొచ్చి మేస్త్రీనడిగితే అతను మళ్ళీ కొయ్యబారిపోయే మాటొకటి అన్నాడు.


‘ఆచారిగారు ఆల్మోస్ట్ రోజూ వస్తన్నార్సార్! ఆయనే పెట్డమన్నారిది. మీకు చెప్పలేదా?’


‘ఆచారిగారెవరు?’ ఇద్దరూ ఒకేసారి అన్నారు. వాళ్లకి కొంకణ్ సినిమా సబ్‌టైటిల్స్ లేకుండా చూస్తున్నట్టుంది.


అప్పుడు మేస్త్రీ కొయ్యబారిపోయాడు. మేనేజర్ని పిలిచాడు. అతను టెర్రస్ మీద వరసగా ఆరేడు సిగరెట్లు కాల్చి ఎనిమిదోది అంటించబోతోంటే కుర్రాడొచ్చి కేకేశాడు.


చిరాగ్గా కిందకొచ్చి మేస్త్రీ మీద కోప్పడ్డాడు.


‘ఇప్పుడేకదా పైకెళ్లాను? ఇంతలో ఏమైంది?’ అన్నాడు అక్కడే సిగరెట్ బయటికి తీసి. సావిత్రికి సిగరెట్ వాసన పడదని అతణ్ణి వారించాడు ప్రసాద్.


‘ఈ సార్ ఏంటడుగుతున్నారో ఆలకించండొకసారి!’ అన్నాడు మేస్త్రీ.


‘ఏంట్సార్?’ అంటూ రాష్‌గా అడిగాడు.


‘ఆచారిగారెవరు?’ అన్నాడు ప్రసాద్.


‘ఆయన షిప్‌యార్డ్‌లో పనిచేస్తారు. ఆయన్దేగా ఈ ఫ్లాటు?’ 


‘ఏం తమాషాగా ఉందా? మేస్త్రీగారూ, మేం మొదట్నుంచీ ఎన్నిసార్లు మార్పులవీ చెప్పాం? గుర్తులేదూ?’


‘అదే ఆశ్చర్యంగా ఉంద్సార్ నాక్కూడా! మీరు వెంటిలేటర్లవీ తీసీమని చెప్పారని అన్నీ మూసీసాం. ఆచారిగారొచ్చి దెబ్బలాడి మళ్లీ అన్నీ తెరిపించారు. నాకదే బోదపళ్లేదు!’ అంటూ తాపీ పడేసి తాపీగా కింద కూర్చుండిపోయాడు.


అప్పుడు మేనేజర్‌కి కంగారొచ్చింది. నాతో రండంటూ ఆఫీసురూముకి తీసుకెళ్లాడు. రాత్రింబవళ్ళు కుక్కచాకిరీ చేసి సంపాయించిన డబ్బంతా వీళ్ల మొహాన పోశాం. ఇప్పుడేమంటాడో? అన్న కంగారు ఇద్దరి మనసులోనూ.


ఆ పెద్దాయన డైరీ ఒకటి తీసి అందులో చూపుడువేలుతో సూచిస్తూ వివరాలన్నీ మూడునాలుగు సార్లు చూశాడు. అతనికి చెమటలు పట్టేశాయి.


ఆ ఫ్లాట్ ప్రసాద్ పేరునా, ఆచారి పేరునా కూడా రిజిస్ట్రేషన్ అయివున్నట్టుగా ఉందందులో! వేరే వేరే పేజీల్లో రాసుకున్నాడు బిల్డర్.


ఇక ఏడుపు మొదలెట్టింది సావిత్రి. ఆయనతో వాదనకి దిగారు. ఆయనేమో కంగారుపడొద్దని, మేనల్లుడు రాగానే సత్వరన్యాయం చేస్తామని హామీ ఇచ్చి పంపేశాడు.


ఆ బిల్డర్ చాలారోజులవరకూ రాలేదు. ఏ గంగలోనో దూకేశాడేమో అనుకున్నాడు ప్రసాద్. ఆఖరికి ఒకరోజు సిరిపురం జంక్షన్‌లో కరాచీవాలాలో ఏదో కొంటూ కనబడ్డాడు. అప్పుడు పరుగుపరుగున వెళ్లి వాణ్ణి నిలదీశాడు.


‘ఏదో పొరపాటు జరిగింది. ఆ ఆచారిగారు ఊరుకోవట్లేదు. కోర్టుకి వెళతానంటున్నాడు. మీరే ఏదో ఒక సొల్యూషన్ చెప్పండి!’ అని తిరిగి ప్రసాదునే సలహా అడిగాడు.


ఉద్యోగం చేసుకుంటూ ఏరాత్రికో ఇల్లుచేరే ప్రసాదుకి కోర్టుకి తిరిగే ఓపికా తీరికా లేవు. అంచేత ఇచ్చిన డబ్బంతా తిరిగిచ్చేస్తే చాలంటూ వేడుకున్నాడు.


తనదగ్గర అంత సొమ్ము ఎప్పుడూ ఉండదుట. అందువల్ల దఫదఫాలుగా ఇస్తానని చెప్పాడు.


ఆ తరవాత అతని వెనకాల తిరిగితిరిగి జీవితంలో అతిముఖ్యమైన ఆనందాలన్నిటినీ కోల్పోయారు ప్రసాద్ దంపతులు. లాండ్ లైన్ ఫోన్ ఎత్తడు. మొబైల్‌కి చేస్తే కట్ చేస్తాడు. బిల్డింగ్ దగ్గరకెడితే ఎప్పుడూ మేస్త్రీయే కనబడతాడు.


దాదాపు రెండేళ్లపాటు బాగా ఏడిపించి అప్పుడు మూడోవంతు సొమ్ము వాళ్లమొహాన పడేశాడు. అదే చాలనుకుని ఆరోజు స్వీట్స్ తెచ్చుకు తిన్నారు ప్రసాదు, సావిత్రి.


‘ఇక ఈ అపార్ట్‌మెంట్‌ల విషయంలో మనం ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో మంచి అనుభవం వచ్చేసింది. ఇకనైనా జాగ్రత్తగా ఉందాం!’ అనుకుని ఒట్టేసుకున్నారు ఇద్దరూ!


యదార్ధగాథే! మాదే! పేర్లూ, ఉద్యోగసద్యోగాలూ మార్చానంతే!


......... *కొచ్చెర్లకోట జగదీశ్*

ఇల్లు కొనేవారు జాగ్రత్తలు తీసుకోవడానికి పనికి వస్తుంది.

కామెంట్‌లు లేవు: