19, ఫిబ్రవరి 2023, ఆదివారం

శివుడు

 ॐ          మహా శివరాత్రి శుభాకాంక్షలు 


               ఓమ్ నమశ్శివాయ 


శివ శబ్దం - వ్యుత్తత్తి 


1. పరమానందస్వరూపుడై, ఏ విధమైన పరిణామాన్ని పొందక ఉండేవాడు కాబట్టి శివుడు. 

    "శామ్యతి పరమానందరూపత్వాత్ నిర్వికారో భవతి ఇతి శివః" 

2. ఇతనియందు సత్పురుషుల మనస్సులు ఉంటాయి కాబట్టి శివుడు అని అర్థం. 

    "శేరతే సజ్జనమనాంసి అస్మిన్ ఇతి శివః" 

3. సాధుపురుషుల మనస్సులందు శయనించి యుండేవాడు కాబట్టి శివుడు అని పేరు. 

    "శేతే సజ్జనమనస్సు ఇతి శివః" 

4. శివం అంటే శుభం. శుభంతో కూడినవాడు శివుడు. 

    "శివం కల్యాణం తద్యోగాత్ శివః" 

5. శుభాలు ఇచ్చేవాడు కాబట్టి శివుడు. 

    "శివప్రదత్వాత్ శివః" 


శంకరుని - పంచముఖాలూ - పంచాక్షరి - పంచభూతాలు 


1. పృథ్వి (భూమి): 

    భూమి ఉదకముల నుండి ఉత్పన్నమైంది. 

    కటకట శబ్దాన్ని, కఠిన స్పర్శనీ, లవణాది రసములనూ, గంధ గుణాన్నీ కలిగి, 

    ఇచ్ఛాశక్తిని, సృష్టికృత్యాన్నీ, 

  "సద్యోజాత" ముఖాన్నీ, నివృత్తి కళనూ, చతురస్రాకారాన్నీ, 

   "న" కారబీజమున నొప్పుచు, 

    బ్రహ్మమును అధిష్ఠానంగా కలిగియున్నది. 


ఓం   సద్యో జాతం ప్రపద్యామి

        సద్యో జాతాయ వై నమో     

        నమః 

        భవే భవే నాతి భవే

        భవస్వమాం భవోద్భవాయ

        నమః 


2. జలం (ఆపః) 

    జలావిర్భావం అగ్ని నుండి జరిగింది. 

    ఆది బుడబుడ అనే ధ్వనిని, శీతస్పర్శనీ, శ్వేతవర్ణాన్నీ, మధుర రసాన్నీ, జ్ఞానశక్తినీ, స్థితకృత్యాన్నీ, 

   "వామదేవ" ముఖాన్నీ, ప్రతిష్ఠాకళనూ, 

   "మ"కార బీజాన్ని, అర్థచంద్రాకృతిని కలిగి, 

    విష్ణువును అధిదేవతగా భాసిస్తుంది. 


ఓం  వామదేవాయ నమో

        జ్యేష్ఠాయ నమః 

        శ్రేష్ఠాయ నమో

        రుద్రాయ నమః

        కాలాయ నమః 

        కలవికరణాయ నమో

        బలవికరణాయ నమో 

        బలాయ నమో 

        బలప్రమధనాయ నమ

        స్సర్వ భూతదమనాయ నమో

        మనోన్మనాయ నమః 


3. అగ్ని: 

    అగ్ని వాయువు నుండి పుట్టింది. 

    బుగబుగమనే శబ్దాన్నీ, ఉష్ణగుణాన్నీ, క్రియాశక్తినీ, సంహారకృత్యాన్నీ, విద్యాకళనూ, 

   "అఘోర" ముఖాన్నీ కలిగి, 

   "శి"కార బీజాన్నీ, ఎరుపు రంగునీ, త్రికోణాన్నీ కలిగి. 

    రుద్రుని అధిష్ఠాతగానొంది ఒప్పారుతోంది. 


ఓం. అఘోరేభ్యోఽథఘోరేభ్యో

       ఘోర ఘోరతరేభ్యః 

       సర్వేభ్యః సర్వశర్వేభ్యో

       నమస్తే అస్తు రుద్రరూపేభ్యః 


4. వాయువు: 

    వాయువు ఆకాశంనుండి గలగల శబ్దాన్నీ అనుష్ణశీత స్పర్శలను రెండు గుణాలతో ఆవిర్భవించింది. 

    వాయువు (గాలి) ఆదిశక్తిని, తిరోధానకృత్యాన్నీ, 

   "తత్పురుష" ముఖాన్నీ, 

    షట్కోణాకృతినీ, రూపంలేని స్పర్శగుణాన్నీ, శాంతికళనీ, ఆకుపచ్చని రంగునీ, 

   "వ"కార బీజాన్ని కలిగి 

    ఈశ్వరుని అధిష్ఠాతగా ఒప్పుచున్నది. 


ఓం తత్పురుషాయ విద్మహే

       మహాదేవాయ ధీమహి 

       తన్నో రుద్రః ప్రచోదయాత్ 


5. ఆకాశం: 

    ఈ ఆకాశం పరాశక్తియును, అనుగ్రహకృత్యమును, 

   "ఈశాన" ముఖాన్నీ, శాంత్యతీత కళనూ, గుండ్రని రూపాన్నీ, పసుపు వర్ణాన్నీ కలిగి 

   "య"కార బీజముతో ఒప్పుచూ సదాశివుని అధిదేవతగా కలిగి ఉంటుంది. 


ఓం. ఈశాన స్సర్వ 

       విద్యానామీశ్వర

       సర్వభూతానాం

       బ్రహ్మాధిపతి 

       ర్బ్రహ్మణోధిపతిర్

       బ్రహ్మ శివోమే అస్తు

       సదాశివోం 


                          =x=x=x= 


  — రామాయణం శర్మ 

           భద్రాచలం

కామెంట్‌లు లేవు: