రామాయణమ్.98
...
ఇందీవరశ్యాముడు!సార్వభౌమకులసంజాతుడు,సర్వలోకప్రియుడు,ప్రియదర్శనుడు,అసలు దుఃఖమునకు అర్హుడేకాని రాఘవుడు అన్నిసుఖాలు పరిత్యజించి నేలపైపడుకొన్నాడు కదా !లక్ష్మణుడు ధన్యుడు ఈ సమయంలో ఆయన వెంట ఉన్నాడు.
.
రాముడు అరణ్యములో ఉన్నా ఆయన బాహుబలమే అయోధ్యకు రక్ష! అందుచేతనే ఎవ్వరికీ దీనిని ఆక్రమించాలనే ఆలోచన రాదు .ఈనాడు అయోధ్య ప్రాకారమునకు రక్షణలేదు,చంతురంగబలాలలో యుద్ధసన్నద్ధతలేదు ,పట్టణద్వారాలన్నీ తెరచి ఉన్నాయి అయినా ఒక్కడికి అయోధ్యను కన్నెత్తి చూసే ధైర్యం లేదు అంటే అది రాముడి శౌర్యప్రతాపాలవల్లకాక మరిదేనివల్లనూ కాదు.
.
రాముడు నారచీరలు ధరించి అరణ్యములో ఉంటే నాకు ఈ పట్టువస్త్రములెందుకు నేను కూడా జటలు,నార చీరలు ధరించి ,కందమూలములు తింటూ ,నేలపై నేటినుండి శయనింతును గాక అని తీర్మానించుకొన్నాడు భరతుడు.
.
ఆ రాత్రి గంగా తీరమందే నివసించి మరునాడు తెలవారుతుండగనే శత్రుఘ్నుని లేపి ఇంకా నిదురపోతున్నావేమి త్వరగా గుహుని పిలుచుకొని రా అని తొందరచేశాడు.
.
అప్పుడు శత్రుఘ్నుడు భరతునితో అన్నా ,అన్న రామన్న అడవులలో ఉంటే నాకు నిదుర ఎలా పడుతుంది? నా మనస్సునిండా రామన్న ఆలోచనలే నేను మేల్కొనే ఉన్నాను ! నీ ఆజ్ఞకోసమే ఎదురు చూస్తున్నాను ..అని అన్నాడు
.
అదే సమయానికి గుహుడు వచ్చి భరతుడి ఎదురుగా నిలుచొని వారిని కుశలప్రశ్నలు వేశాడు.
.
భరతుడికి సమయం గడుస్తున్నకొద్దీ తొందరహెచ్చవుతున్నది ,గుహుడిని త్వరగా నది దాటించమని కోరాడు.
.
భరతుడి తొందర గమనించాడు గుహుడు.వెంటనే తన నగరులోకి వెళ్ళి వందలకొద్దీ పడవలను నౌకలను సన్నద్ధం చేశాడు.
.
బయలు దేరటానికి భరతుని ఆజ్ఞ అయ్యిందని తెలుసుకొన్న కొందరు నదిలో దూకి ఈత కొడుతూ బయలుదేరారు,కొందరు అప్పటికే తయారుచేసుకొన్న తెప్పలు నదిలో దించారు.కొందరు కడవల సహాయంతో నీటిలో తేలుకుంటూ వెళ్ళారు.
.
గుహుడు తెప్పించిన నావలన్నీ శ్రేష్టమైనవి.వాటిపేర్లు స్వస్తికములు! అత్యంత దృఢమైన నావలవి.
.
అందరూ నావలెక్కారు,కొన్నింటి యందు రధ,గజ,తురగాలు ఎక్కించారు ,కొన్ని నావలలో జనమంతా ఎక్కి నిల్చున్నారు ,కొన్నిటి యందు దశరధాంతఃపురవాసులు ఎక్కారు.
.
హైలెస్సా హైలో హైలెస్సా అంటూ గంగలో ప్రయాణము చేస్తున్నాయి ఆ నావలన్నీ .కొంతమంది నావలను నడిపే వారు వాటిని చిత్రవిచిత్రరీతులో నడుపుతున్నారు .
నది అంతా నావలు ఆక్రమించి జలముమీద ఒక మహానగరము నిర్మింపబడెనా అన్నట్లున్నది.
.
భరతుడి నావ మైత్రీముహూర్తమందు ఆవలిఒడ్డును చేరుకుంది.గుహుడుకూడా వారి వెంట ఉన్నాడు.
..
(మైత్రీ ముహూర్తమంటే ఉదయం 7.04 ని నుండి 8.36 ని
రోజును పదిహేను భాగాలు చేయగా అందులో మొదటి మూడవ భాగము మైత్రీ ముహూర్తము అనబడుతుంది.అనగా రెండు గడియలు).
.
అల్లంత దూరాన భరద్వాజ మహర్షి ఆశ్రమము కనపడుతున్నది.
సైన్యాన్ని అక్కడే ఉంచి మహర్షివశిష్ఠుల వారితో కలిసి భరతుడు ఆశ్రమము వైపుగా అడుగులు వేశాడు.
.
వూటుకూరు జానకిరామారావు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి