*ఆనందరావు - దొండ తీగ* ✍🏻జీడిగుంట నరసింహ మూర్తి
ఆనందరావు వేసవి సెలవుల్లో కాకినాడలో ఉన్న బాబాయి గారింటికి వెళ్ళాడు. అతనక్కడ ఉన్న నాలుగు రోజులూ ఒక రోజు దొండకాయ శనగపప్పు, ఇంకోరోజు ఉల్లికారం, మరో రోజు కొబ్బరితోనూ, చివరి రోజు చక్రాలు చేసి వేపుడు కూర ఇదీ మెనూ.
“ఏరా మొత్తం దొండకాయలతోనే ఈ నాలుగు రోజులూ లాగించేసామని కోపంగా ఉందా ?” అడిగాడు కామేశం.
“అబ్బే అటువంటిదేమీ లేదు బాబాయ్ ! ఒకే కాయలతో చేసినా పిన్ని చాలా వెరైటీ గా వండింది లే “ అన్నాడు ఆనందరావు.
“ఏం లేదురా! వేసవిలో మనకు సరిగ్గా కూరలు దొరకవు.మామూలుగా మనింటికి వచ్చే పోయే వాళ్ళ తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఒక రోజు తాతయ్య గారింట్లో దొండ చెట్టు చూసి ఆరునెలల క్రితం వేరు తెచ్చి పాతాను. చెప్పుకుంటే దిష్టి తగులుతుందో ఏమో కాని, దాని దుంప తెగ చెట్టుకు కాయలేని రోజంటూ లేదనుకో. ఈ దొండకు ఒక ప్రత్యేకత వుందిరా. ఇది నాలుగు కాలాలలో కాస్తుంది. సడన్ గా ఇంటికి ఎవరైనా బంధువులోస్తే కూరగాయల కోసం పరిగెత్తాల్సిన పని లేదు. పది కాయలు తుంచి రెండు ఉల్లిపాయలు తగిలించి వేపుడు చేసేస్తే చూసుకోవాల్సిన పని లేదు. ఈ చెట్టులో ఇంకో గమ్మత్తు కూడా వుందిరోయ్. మర్నాడు బుట్ట తీసుకుని వెళితే కూడా ఆ చెట్ల ఆకుల్లో దాక్కుని ఇంకో పది కాయలు దొరుకుతాయి.ఎవరేమైనా అనుకోనీ. మా ఇంటికొచ్చిన వాళ్లకు దొండకాయ తప్పదు.” అన్నాడు కామేశం నవ్వుతూ.
“బాగానే ఉంది కాని బాబాయ్! అసలు దొండ తింటే బుద్ది మందగిస్తుంది. బెండ తింటే వికసిస్తుంది అంటారు ఎంతవరకు నిజం ?” అడిగాడు ఆనందరావు.
“ఆ నా మొహం. ఇప్పుడేదో మన బుద్ది సరిగ్గా వున్నట్టు. అవన్నీ గిట్టని వాళ్ళంటారు.అసలు ఏ కూరగాయలైనా ఏదో అవుషద గుణం వుండి శరీరాన్ని కాపాడుతుందని ఆయుర్వేద వైద్యులు చెవులు గళ్ళు పడేటట్లు చెప్పడం నువ్వు వినడం లేదూ! అయితే అతి సర్వత్రా వర్జియత్ అన్నట్లు అదేపనిగా మా ఇంట్లో తిన్నట్టుగా తినకూడదు అంతే !” అన్నాడు నవ్వుతూ కామేశం.
ఆనంద రావు తండ్రి గుడివాడలో ఉద్యోగం చేసుకుంటూ ఇంట్లో రకరకాల కూరలను పండిస్తూ ఊళ్ళో వాళ్ళందరిని అక్చర్య పరిచే వాడు. స్తంభాల్లాంటి తోటకూర కాడలు, గుండ్రపు ఆనపకాయలు, పాముల్లా నేలకు దిగిన పొట్ల కాయలు, గుత్తులు, గుత్తులుగా చిక్కుడు కాయలు, నల్ల వంకాయలు, ఒక్కటేమిటి ఆ దొడ్లో ఎన్ని కాసేవో ! ఆయన ఆ ఆనందాన్నికూరగాయలతో పాటు ఊళ్ళో వాళ్ళందరితో పంచుకునే వాడు. ఈ విషయాలను సరదాగా ఆనందరావు అతని బాబాయి చెప్పుకునేవారు.
“నేను పనిచేసే ఊళ్ళో నా క్వార్టర్ లో పెద్ద స్తలం ఉంది.ఏవో పిచ్చి మొక్కలున్నాయి తప్ప పనికొచ్చే మొక్క ఒక్కటి లేదు. నాక్కొంచం దొండ వేరు ప్లాస్టిక్ కాయితంలో కట్టి ఇస్తే వెళ్ళగానే పాతేస్తాను.నీ పేరు చెప్పుకుని నాలుగు కూరలు మేము కూడా చేసుకుంటాం” అన్నాడు ఆనందరావు బాబాయి ముఖంలోకి చూస్తూ.
“నువ్వు ఎప్పుడైతే లొట్టలేసుకుంటూ విసుక్కోకుండా నాలుగు రోజులు దొండకాయ తిన్నావో అప్పుడే నీకోసం నేను ప్లాన్ చేసానులే. రాత్రి వెళ్ళేటప్పుడు మర్చి పోకుండా తీసుకువెళ్ళు” అన్నాడు కామేశం పార్సెల్ చెయ్యడానికి వెళుతూ.
రాత్రంతా ప్రయాణంలో ఆనందరావు మనసంతా దొండ తీగమీదే ఉంది. ఊళ్ళో ఎంతమందిని అడిగినా ఉంచుకుని కూడా దొండ తీగ ఇవ్వలేదు. ఇప్పుడు వాళ్లకు పోటీగా తనూ కాయిస్తాడు. ఎవ్వరికి ఒక్క కాయ ఇచ్చేది లేదు. కస్టపడి మూడొందల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆరొందలు ఖర్చు చేసిక్ తను ఈ మొక్క తెచ్చుకుంటున్నాడు.
ఇంటికి వెళ్తూ వెళ్తూనే గొయ్యి తవ్వి చుట్టూ పెంట మట్టి వేసి మధ్యలో దొండ వేరు పెట్టి నీళ్లు పోసాక హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు ఆనందరావు.
ఆ రోజు నుండి ఉదయాన్నే లేవడం, దొండ చిగురించిందేమో నని చూడటం అలా నెల రోజులు గడిచిపోయింది. ఆనందరావు ఎంతో దూరం నుండి శ్రమకోర్చి దొండ చెట్టు తెచ్చాడన్న వార్త అతని ఆఫీస్ చాలా మందికి తెలియడం, వాళ్ళంతా వేలం వెర్రిగా చూడటానికి రావడం, ఈ నేపద్యంలో దొండ చిలవలు, పలవలు వేసుకుంటూ పందిరెక్కడం జరిగిపోయింది.
ఇక ఆనందరావు ఆనందానికి అంతే లేదు. పిల్లలు పుడితే ఉయ్యాల్లో వేసినంత సంబరపడి పోయాడు. ఈ లోపు అతని బాబాయికి ఐదారు సార్లు ఫోన్ చేసి వేరు పాతినప్పటి నుండి చిగురేసి పందిరి వరకు ఎలా పాకిందో సీరియల్ గా చెప్పుకుంటూ వచ్చే వాడు.
నరుడు దిష్టి తగిలితే నల్ల రాయి కూడా భళ్ళున పగులుతుందన్నట్టు ఒకరోజు ఉదయాన్నే యధాప్రకారంగా ఆనందరావు ఎదుగుతున్న దొండ చెట్టును చూసుకుందామని వెళ్ళగానే పక్కనే తెగిపోయి, వాడిపోయి ఉన్న తీగను చూడగానే నిలువునా నీరశించి పోయాడు. అతనిలో దుఖం ఉవ్వెత్తున పొంగుకొచ్చింది. ఇదంతా చేసింది పెద్ద తొండ అని తెలిసి దాన్నేమి చేయ్యిలేక మట్టి లోంచి వేరు బయటకు లాగి కుండీలోకి మార్చాడు. అతనికో నిరుత్యాహం ఆవరించింది. నిజానికి ఇంకో నెల రోజుల్లో బాబాయి ఇంట్లో కాసినట్టుగా తన దొడ్లో కూడా కాయలోచ్చేవి. కాని అదృష్టం లేదు. ఆ పట్టున నెల రోజులు వరకు దొండ చిగురు తొడగనే లేదు. దాంతో దాన్ని నిర్లక్ష్యంగా వదిలేసాడు ఆనందరావు.
ఈ లోపు అనుకోకుండా ఆనందరావు కు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యింది. ఈ తతంగం అదిగో ఇదిగో అంటూ రెండు నెలలు పట్టింది. ఒకరోజు యధాలాపంగా చెట్ల పొదల్లో పడేసి ఉన్న కుండీ చూస్తే ఆనందరావు తల గిర్రున తిరిగి నట్టయింది. తను ఈ మధ్య అటువైపుగా వెళ్ళనే లేదు. కుండీ లోంచి ఒక పెద్ద దొంగ తీగ రెండు మూడు మీటర్ల విస్తీర్ణం వరకు ఎగబాకి ఉంది. మళ్ళీ ఆనందరావులో ఆశలు చిగురించాయి. అంతలోనే నిరాశకు గురయ్యాడు.
తను హైదరాబాద్లో ఉండబోయే అపార్ట్మెంట్లో అక్కడ తులసి చెట్టు వేసుకోవడానికే చోటు లేదు ఇక ఈ దొండ తీగ ఎక్కడ వేసుకోవడం ? పైగా తీసుకెళ్లడం కూడా కష్టమే.
చేసేది లేక ఊరు నుండి వెళ్తూ వెళ్తూ తన కొలీగ్ సుబ్బారావుకు దొండ తీగ ఉన్న కుండీని అప్పగించి జాగ్రత్తగా చూసుకోమని, రోజూ నీళ్ళు పోస్తూ ఉండమని అప్పుడప్పుడు ఎరువులు వెయ్యమని కాయలు కాయగానే తనకు తెలియ చేస్తే ఆనందిస్తానని అప్పగింతలు అప్పగించి వచ్చాడు. కొన్నాళ్ళ తర్వాత అనుకోకుండా హైదరాబాద్ వచ్చిన సుబ్బారావు చేతిలో దొండకాయల సంచీ ఉండటం చూసిన ఆనందరావుక్ ఆనందానికి అంతులేకుండా పోయింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి