20, అక్టోబర్ 2020, మంగళవారం

మొగిలిచెర్ల

 మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి లీలలు..

దంపత్సమేత దీక్ష..


నాలుగైదేళ్ల క్రిందట దత్త దీక్షా కార్యక్రమం జగుతున్న నాటి సంఘటన ఇది..

"అయ్యా..నలభై ఒక్క రోజుల మండలదీక్ష రేపు కూడా తీసుకోవచ్చా..? మా ఇంటాయన చేత దీక్ష చేయిద్దామని అనుకుంటున్నాను.." అని మా దేవస్థానం లో పనిచేసే సిబ్బందిని అడిగిందా ఇల్లాలు..ఆమె పేరు వెంకట సుబ్బమ్మ, ఆమె భర్త పేరు కొండయ్య.."రేపే చివరి రోజు..రేపు వచ్చి దీక్ష తీసుకోండి.."-అని మా వాళ్ళు జవాబు చెప్పారు..తలవూపి వెళ్ళిపోయింది..


వెంకట సుబ్బమ్మ కొండయ్య దంపతులు..ఇద్దరు పిల్లలు..కొన్నాళ్ళు సంసారం బాగానే గడిచింది..కొండయ్య ఏకారణం చేతో తెలీదు కానీ తాగుడికి బానిస అయ్యాడు..ఆనాటి నుంచీ సంసారం లో కలతలు ప్రారంభం అయ్యాయి..అతని సంపాదన మొత్తం తాగుడికి సరిపోతోంది..వెంకట సుబ్బమ్మ కూలి పనులు చేసి, కాపురాన్ని నెట్టుకొస్తోంది..భర్త స్వతహాగా మంచివాడే..కానీ ఈ దురలవాటు అతనిని మార్చివేసింది..త్రాగుడు మానుకోమని ఎన్నోసార్లు భర్తను బ్రతిమలాడి చెప్పుకున్నది..ఆ పూటకు సరే అంటున్నాడు..మళ్లీ ప్రక్కరోజుకు త్రాగుతున్నాడు..సరిగ్గా ఆ సమయం లోనే, మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మండల దీక్ష మొదలవుతున్నదనీ..ఎలాగో ఒకలాగా బ్రతిమలాడి కొండయ్య చేత దీక్ష ఇప్పిస్తే..అతను బాగు పడతాడనీ సుబ్బమ్మకు అనిపించింది...ఆ వివరం కనుక్కోవడానికే ముందుగా మందిరానికి వచ్చింది..


కానీ చుట్టుప్రక్కల వాళ్ళు, "ఈవిడ తాపత్రయ పడుతున్నది గానీ..వాడు తాగుడు మానుతాడా?..అనవసరంగా ఆ స్వామి దీక్ష తీసుకొని కొనసాగించకుండా..మళ్లీ తాగి, పాపం మూటగట్టుకుంటాడు.." అని చాటుమాటుగా కొందరు..ఎదురుగానే మరికొందరు అనేశారు.."అన్నిటికీ ఆ దత్తయ్యే వున్నాడు..ఆయన దీక్ష లో ఉన్నన్నాళ్ళూ నేను కూడా అక్కడే ఉంటాను..మా పిల్లలతో సహా ఆ స్వామి చెంతనే ఉంటాము..స్వామి మీదే భారం వేస్తున్నాను.." అని చెప్పింది వెంకట సుబ్బమ్మ నిశ్చయంగా..


ఆ ప్రక్కరోజు ఉదయాన్నే కొండయ్యను, పిల్లలను వెంటబెట్టుకొని, మొగిలిచెర్ల లోని శ్రీ స్వామివారి మందిరానికి వచ్చి, కొండయ్యకు దీక్ష ఇప్పించింది...స్వామివారి విగ్రహం ముందు నిలబడి మనస్ఫూర్తిగా మొక్కుకుంది..తన భర్త ఆ దురలవాటు ను పూర్తిగా మానుకొని, తన సంసారం చక్క బడాలని కోరుకున్నది సుబ్బమ్మ..దీక్షా మాలలు కొండయ్య మెడలో వేసేముందు.."అయ్యగారూ..మీరు కూడా ఈయనకు..దీక్ష సక్రమంగా చేయమని గట్టిగా చెప్పండి.." అని నన్ను అడిగింది..


ఆ నలభైరోజులూ ఆ దంపతులు పిల్లలతో సహా శ్రీ స్వామివారి మందిరం వద్దే వున్నారు..ప్రతిరోజూ కొండయ్య తో పాటు, వెంకట సుబ్బమ్మ కూడా శ్రీ స్వామివారి మందిరం లో 108 ప్రదక్షిణాలు చేసేది..పది రోజుల కల్లా కొండయ్య మనసులో అంతర్మధనం మొదలైంది..తాను ఇంతకు ముందు గడిపిన జీవన విధానం సరికాదని అతనికే అనిపించసాగింది..అతను మరింత నిష్ఠగా శ్రీ స్వామివారి దీక్ష కొనసాగించ సాగాడు..


వైశాఖ మాసం శుద్ధ సప్తమి నాడు శ్రీ స్వామివారి ఆరాధనామహోత్సవం జరుగుతుంది..(ఈ సంవత్సరం మే 11 వతేదీ నాడు శ్రీ స్వామివారి ఆరాధన)..ఆ ముందురోజు, దత్తదీక్ష స్వీకరించిన స్వాములందరూ మొగిలిచెర్ల గ్రామం లో గల రామాలయం వద్దనుంచి నీరు నింపిన కలశాలతో ఊరేగింపుగా శ్రీ స్వామివారి మందిరానికి వచ్చి, ఆరోజు రాత్రి 12 గంటల తరువాత, శ్రీ స్వామివారి సమాధికి ప్రదక్షిణ చేసి, తాము తెచ్చిన కలశం లోని నీటితో శ్రీ స్వామివారి ఉత్సవ విగ్రహానికి అభిషేకం చేస్తారు..స్వాములందరితో పాటు కొండయ్య కూడా శ్రీ స్వామివారికి అభిషేకం చేసాడు..ఆ ప్రక్కరోజు ఉపవాసం వుండి, ఆరాధన నాటి రాత్రికి అగ్నిగుండం లో నడిచాడు..


దీక్ష విరమణ చేసినా కొండయ్య త్రాగుడు జోలికే వెళ్ళలేదు..పూర్తిగా మానేశాడు..ప్రతి సంవత్సరం శ్రీ స్వామివారి దీక్ష తీసుకుంటాడు..ప్రస్తుతం ఆ దంపతులు హైదరాబాద్ లో వుంటున్నారు..కొండయ్య మేస్త్రీ గా పనిచేయటం మొదలుపెట్టి, ఇప్పుడు స్వంతంగా కాంట్రాక్టులు చేస్తున్నాడు..తమను తమ సంసారాన్ని ఆ దత్తయ్య స్వామే కాపాడాడని పదే పదే చెప్పుకుంటారిద్దరూ..దీక్ష కాలంలో ఏదో ఒకరోజు, శ్రీ స్వామివారి మందిరం వద్ద ఉన్న ఇతర దీక్షాధారులకు, భక్తులకు అన్నదానం చేయడం ఆ దంపతుల నిర్ణయం..గత నాలుగేళ్లుగా అదే పాటిస్తున్నారు..


దత్త దీక్ష స్వీకరించి, ఆచరించే భక్తుల అనుభవాలు కోకొల్లలు..ఒక్కొక్కరిదీ ఒక్కో అనుభవం..అయితే అందరూ చెప్పేది ఒకటే మాట.."ఆ స్వామివారి వద్ద దీక్ష తీసుకుని..నిష్ఠ తో ఆచరిస్తే..మన కష్టాలు తొలిగిపోతాయి..మనలను దత్తాత్రేయుడే కాపాడతాడు.." అని..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగిలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: