దేవీనవరాత్రులు - అన్నపూర్ణాతత్వము
ఈ రోజు ఆ తల్లి మనలను అందరిని అన్నపూర్ణాదేవిగా కాశి క్షేత్రాన్ని ఆధారంగా చేసుకుని మనలను అందరిని అనుగ్రహిస్తూ ఉంటుంది. ప్రత్యేకంగా అన్నపూర్ణోపాసన చేసేవారు కూడా మనకు కనిపిస్తూ ఉంటారు. శ్రీవిద్యోపాసనలో అన్నపూర్ణాదేవిని అమృత శక్తిగా, అమృతేశ్వరీదేవిగా పూజిస్తారు. అన్నపూర్ణ అనగానే మనకి గుర్తుకు వచ్చేటటువంటి మూర్తి ఎడమచేతిలో మణిమాణిక్యాలతో పొదగపడిన బంగారు గిన్నెను పట్టుకుని, కుడిచేతిలో బంగారు తెడ్డును మణిమకుటాలతో అలంకరింపబడింది పట్టుకుని ఆ తల్లి మొదట పరమశివునికి అన్నం వడ్డిస్తున్నట్లుగా ఉంటుంది. అన్నపూర్ణ అనేటటువంటి నామము మహా మంత్రం. "అన్న" శబ్దానికి ఐశ్వర్యం అని కూడా అర్ధం. ఏ ఇంట అన్నపూర్ణ ఆరాధన జరుగుతూ ఉంటుందో ఆ ఇంట దరిద్రం ఉండదు.
పూర్వకాలంలో దుర్గమాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. ఈ రాక్షసుల ఆలోచన ఎల్లవేళలా కూడా మనలను హింసించడం, ఎదో ఒక రకంగా ఎదుటివారిని బాధపెడుతూ ఆనందించడం. నిజానికి ఇలాంటి పృవృత్తి ఉన్న అందరినీ రాక్షసులుగానే పరిగణించవచ్చు. ఈ దుర్గమాసురుడు బ్రహ్మగారి గురించి గొప్ప తపస్సు చేశాడు. ఈ దుర్గముడి యొక్క తపస్సుకు మెచ్చిన బ్రహ్మగారు ఏమి వరం కావాలో కోరుకొమ్మన్నాడు. మరి రాక్షసుడు కాబట్టి వాడి ఆలోచనలు కూడా అలాగునే ఉంటాయి. వెంటనే వాడు వేదాలన్నీ నాలోకి వచ్చెయ్యాలి అని, ఇప్పటి వరకు వేదం చదువుకున్నవారు కూడా దానిని మర్చిపోవాలి అని కోరుకున్నాడు. వెంటనే బ్రహ్మగారు తధాస్తు అన్నారు. ఎప్పుడైతే వేదాలన్నీ వాడిలోనికి వెళ్లిపోయాయో అందరూ కూడా వేదమంత్రాలు మర్చిపోయారు. వేదమంత్రాలను మర్చిపోయేసరికి మరి భగవంతునికి హవిస్సు ఇవ్వడం లేదు. భగవంతునికి హవిస్సు లేదు కాబట్టి వర్షాలు లేవు. వీటన్నింటికి కూడా అవినాభావ సంబంధం. వర్షాలు లేక దేశంలో కరువుకాటకాలు ఏర్పడ్డాయి. ఎవరో కొంతమంది పెద్దలు వారికి తెలిసిన రీతిలో అమ్మవారి ఆరాధన చేశారు. కొంతమంది కీర్తన ద్వారా, కొంతమంది ధ్యానం ద్వారా, కొంతమంది నృత్యం ద్వారా తమ తమ భక్తిని ఆవిష్కరించారు.
దీనిని బట్టి మనకు ఏమి అర్ధం అవుతుంది. ఆ తల్లిని ఏ రకంగానైనా ఆరాధన చేయవచ్చు. ఆ తల్లి అనుగ్రహించి తీరుతుంది. కావలసిందల్లా భక్తి, శ్రద్ధ. అలా భక్తులందరూ పిలిచేసరికి ఆ కరుణామయి అయిన ఆమె తన యొక్క చూపులతోనే అందరిని పోషించింది. అందుకే ఆ తల్లిని శతాక్షి అన్నారు. ఆ తల్లి తన శరీరం అంతా కళ్ళు చేసుకుని మనలను పోషించింది కాబట్టి శతాక్షి అయింది. మరి అందరికీ ఆకలిగా ఉంది. ఆ తల్లి తన శరీరం నుండే అనేక రకాలైన కాయగూరలను, పండ్లని సృష్టించి మీ ఆకలి తీర్చుకోండి అంటూ అనుగ్రహించింది. శాకంభరీ రూపంలో ఈ తల్లి ఆ దుర్గమాసురుని సంహరించి 'దుర్గ' అనే నామాన్ని పొందింది. వేదాలన్నింటిని తనలో నుంచి ప్రకాశింపచేసింది. వేదారణ్యం అనే ప్రాంతంలో తిరుపతికి దగ్గిరలో ఉంటుంది. శతాక్షి, విశాలాక్షి, శాకంబరీ, అన్నపూర్ణ అందరూ ఒక్కటే. మనం మొదట్లో చెప్పుకున్న ఆ అన్నపూర్ణాదేవి మొదటి వడ్డన తన భర్తకు చేస్తుంది.
దీనినిబట్టి మనకు అర్ధం అయ్యేది ఏంటి? ఇంట ఒండిన పదార్ధాలు ముందుగా భర్తకు పెట్టాలని. ఇంకొక రకంగా ఒండిన పదార్ధాలను మొదటిగా భగవంతునికి చూపించాలి.
"అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ వల్లభే
జ్ఞాన వైరాగ్య సిధ్యర్ధం భిక్షామ్ దేహీచ పార్వతీ"
ఈ శ్లోకం ప్రతిరోజు భోజనం చేసేటప్పుడు చదువుకొని ఆ తల్లి నుండి జ్ఞాన సంపద కోరుకుందాం.
"అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే"
సర్వేజనా సుఖినోభవంతు.
శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి
+91 8886240088
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి