రామాయణమ్ 158
...
సీత మాటలు విన్న రావణుడు ఒక్కసారిగా వికటాట్టహాసం చేశాడు ,ఒక చేతిలో మరొక చేయివేసి చరిచి శరీరాన్ని పెద్దగా చేశాడు .
.
సీతనుద్దేశించి పలుకుతూ " నీవొక పిచ్చిదానివి
నా వీర్యము,బలపరాక్రమాలు ఎంత చెప్పినా నీ తలకు ఎక్కడం లేదు !
.
ఆకాశంలో నిలుచుని భూమిని ఎత్తివేయగలను,సముద్రము మొత్తాన్ని త్రాగివేయగలను ,సాక్షాత్తూ మృత్యువే యుద్ధంలో నాకు ఎదురుగా నిలబడిపోరాడితే మృత్యువునే చంపివేయగల సమర్ధుడను!
.
ఇచ్ఛానుసారము రూపము ధరించగలను ,ఓ ఉన్మత్తురాలా చూడు నీ కోరికలు తీర్చగల నీ భర్తనైన నా రూపము చూడు .
.
కోపముతో మాట్లాడుతున్న రావణుని కన్నుల ఎరుపుజీరలు ప్రస్పుటంగా కనపడుతున్నాయి ,సన్యాసిరూపాన్ని విడిచి యముడిలాంటి తన రూపానికి మారిపోయాడు
.
నల్టటిమేఘము లాగా ఉన్నాడు ,పదితలల ఉగ్రరూపం ధరించాడు .ఇరువది నేత్రములు ఎర్రగా ఉన్నాయి .ఎర్రటి వస్త్రాలు ధరించి ధగధగమెరిసిపోయే స్వర్ణాభరణాలు అలంకరించుకొని ధనుర్బాణాలతో నిలిచి ఉన్నాడు.
.
సీతతో ఇలా అన్నాడు రావణుడు " నీకు భర్తగా తగిన వాడను నేనే ,ఆ రాముడినిక మరచిపో ,నీకు ఇష్టముకాని పని నేను చేయను ,నీ మనస్సు నా పై మరల్చుము.
.
సీతాదేవితో మాట్లాడుతూ మాట్లాడుతూ ఆవిడను సమీపించి, ఎడమచేతితో జుట్టుపట్టుకొని కుడిచేయి నడుముక్రిందభాగములో వేసి గట్డిగా పట్టుకొని ఒక్కసారిగా ఎత్తి లేవదీసుకొని వచ్చి చాలా పరుషముగా మాట్లాడుతూ తన రధములో తన ఒడిలో కూర్చుండ బెట్టుకున్నాడు.
.
మెలికలు తిరుగుతున్న ఆడపాము వలె ఉన్న సీతాదేవిని ఒడిసిపట్టుకొని ఆకాశానికి ఎగిరాడు.
.
సీతాదేవి ఆక్రందనలు ,రోదనలు మిన్నుముట్టాయి .
మత్తెక్కినదాని వలే చిత్ర భ్రమ చెందిన రోగపీడితుడు ఏ విధంగా అరుస్తాడో ఆ విధంగా అరవసాగింది
.రామా రామా రామా రామా అని అరుస్తూ ఏడవసాగింది.
.
రామాయణమ్ 159
...............
రామా రామా అంటూ సీతమ్మ చేసే ఆక్రందనలు వనమంతా ప్రతిధ్వనిస్తున్నాయి .
.
ఓ లక్ష్మణా మహాబాహూ!
నన్ను రావణుడు అపహరించి తీసుకు వెడుతున్నాడు చూడవయ్యా
.
రామా ధర్మము కోసము జీవితాన్నీ సుఖాన్నీ సంపదలనూ విడిచివేసావు కదయ్యా ,అధర్మాత్ముడు వీడు రావణుడు నన్ను అపహరించి తీసుకుపోవటం నీవు చూడటము లేదా ,
.
ఓ రామా ఎక్కడున్నావు .
.
ఓయీ రావణా, నీ పాప ఫలాన్ని నీవు కొంతకాలము తరువాత అయినా అనుభవించక తప్పదు.
.
రావణా ఎవరికైనా దుష్టకర్మ ఫలము వెంటనే అగుపడదు ,పాపము అనే విత్తనాన్ని నీవు ఇప్పుడు నాటావు త్వరలో అది పండగలదు ,
మృత్యువు అనే పంటను నీవు అనుభవిస్తావు .
.
అయ్యో ! ఈ నాటికిగానీ కైకకోరిక ,ఆమె బంధువుల కోరిక తీరినది .
.
ఓ కొండగోగు వృక్షములారా రావణుడు నన్ను అపహరించాడని రామునికి తెలపండి .
.
ఓ ప్రస్రవణ పర్వతమా నీకు నమస్కారము నన్ను రావణుడు ఎత్తుకెళుతున్నాడని రామునికి తెలపండి .
.
తల్లీ గోదావరీ నన్ను రావణుడు అపహరించాడని రామునికి తెలుపమ్మా.
.
ఓ ,మృగములారా,పక్షులారా రామునికి తెలపండి వీడు చేసిన దుష్కార్యము గురించి .
.
ఓ ప్రాణులారా నీ ప్రాణాన్ని రావణుడు దొంగిలించి తీసుకు వెడుతున్నాడని రామునికి తెలపండి .
.
దుఃఖార్తయై ,దీనముగా విలపిస్తున్న సీతకు ఒక చెట్టు మీద ఉన్న జటాయువు కనబడ్డాడు .ఆయనను చూడగానే ప్రాణము లేచివచ్చినట్లై ఒక్క పెట్టున అరిచింది సీతమ్మ .
.
ఓ జటాయూ, పాపాత్ముడైన రావణుడు నన్ను అనాధురాలిని వలే తీసుకు పోతున్నాడు .
.
జటాయూ నీవు వీనిని ఎదిరింపలేవు వీడు క్రూరుడు దుష్టబుద్ది ,నా అపహరణానికి సంబంధించిన విషయములన్నీ రామలక్ష్మణులకు నీవే ఎరిగింపుము అని జాలిగోలిపెటట్లు గా రోదించే రామపత్నిని జటాయువు చూశాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి