20, అక్టోబర్ 2020, మంగళవారం

ప్రహ్లాదునికి

 🌺 *ఓం నమో నారాయణాయ* 🌺



*ప్రహ్లాదుని చదువు విచారించుట-2*




*46. "త్రిప్పకు మన్న మా మతము, దీర్ఘములైన త్రివర్గపాఠముల్ దప్పకు మన్న, నేఁడు మన దైత్యవరేణ్యుని మ్రోల నేము మున్ చెప్పినరీతి గాని మఱి చెప్పకు మన్న విరోధిశాస్త్రముల్, విప్పకుమన్న దుష్టమగు విష్ణు చరిత్ర కథార్థ జాలముల్."*



భావము:- “నాయనా! ప్రహ్లాదా! ఇవాళ మీ తండ్రిగారి దగ్గర మేం చెప్పిన చదువులకు వ్యతిరేకంగా చెప్పకు. గొప్పవైన ధర్మశాస్త్రం అర్ధశాస్త్రం కామశాస్త్రం అనే త్రితయాల పాఠాలు అడిగినవి జాగ్రత్తగా మరచిపోకుండా చెప్పు. మేం చెప్పిన నీతిపాఠాలు తప్పించి వేరేవి మాట్లాడకు. మన విరోధి విష్ణుమూర్తి మాటమాత్రం ఎత్తకు. దుష్టమైన ఆ విష్ణుని నడవడికలు, కథలను గురించి అసలు మాట్లాడనే మాట్లాడ వద్దు. మరచిపోకు నాయనా!”




*47.అని బుజ్జగించి దానవేశ్వరుని సన్నిధికిం దోడితెచ్చిన*



*భావము:-* అలా గురువులు ప్రహ్లాదుడిని బుజ్జగించి, హిరణ్యకశిప మహారాజు ఆస్థానానికి తీసుకు వచ్చారు.




*48. అడుగడ్గునకు మాధవానుచింతన సుధా; మాధుర్యమున మేను మఱచువాని; నంభోజగర్భాదు లభ్యసింపఁగ లేని; హరిభక్తిపుంభావ మైనవాని; మాతృగర్భము జొచ్చి మన్నది మొదలుగాఁ; జిత్త మచ్యుతుమీఁదఁ జేర్చువాని; నంకించి తనలోన నఖిల ప్రపంచంబు; శ్రీవిష్ణుమయ మని చెలఁగువాని; వినయ కారుణ్య బుద్ధి వివేక లక్షణాదిగుణముల కాటపట్టయిన వాని; శిష్యు బుధలోక సంభావ్యుఁ జీరి గురుఁడు ముందఱికి ద్రొబ్బి తండ్రికి మ్రొక్కు మనుచు.*



*భావము:-* ప్రహ్లాదుడు ప్రతిక్షణమూ, అడుగడుక్కీ విష్ణువును ధ్యానిస్తూ ఆ ధ్యానామృత మాధుర్యంలో తన్ను తాను మైమఱుస్తూ ఉంటాడు. అతను బ్రహ్మ వంటి వారికైనా కూడా అలవి కాని “హరి భక్తి రూపందాల్చిన బాలకుని”లా ఉంటాడు. తల్లి కడుపులో ప్రవేశించి నప్పటి నుంచీ కూడా అతని మనస్సు అచ్యుతుడు విష్ణువు మీదే లగ్నం చేసి ఉంటోంది. అతడు చక్కగా విచారించి “ఈ లోకములు అన్నీ విష్ణుమయములే” అని తన మనస్సు లో ధృఢంగా నమ్మేవాడు. అతడు అణకువ, దయ మొదలగు సర్వ సుగుణములు నిండుగా ఉన్న వాడు. జ్ఞానులుచే చక్కగా గౌరవంతో తలచబడేవాడు. అంతటి ఉత్తముడైన తన శిష్యుడు ప్రహ్లాదుడిని పిలిచి, తండ్రి ముందుకు నెట్టి, నమస్కారం చెయ్యమని చెప్తూ, హిరణ్యకళిపుడితో ఇలా అన్నారు.

కామెంట్‌లు లేవు: