శ్రీరామాయణ గ్రంథం.. వాల్మీకి, నారదమహర్షుల ప్రశ్నోత్తరాలతోనే ప్రారంభమవుతుంది. ‘షోడశగుణ పూర్ణుడైన మానవుడు ఈ లోకంలో.. ఈ కాలంలో ఉన్నాడా?’’ అని.. తపోధనుడైన వాల్మీకి.. వేదవేత్తలలో శ్రేష్ఠుడైన దేవర్షి నారదమహర్షిని అడిగాడు. దానికి నారదుడు.. ‘‘ఇక్ష్వాకు వంశంలో రాముడను పేరుతో ప్రసిద్ధి చెందిన, లోకంలోని వారందరిచే ప్రశంసింపబడుతున్న మానవుడు కలడు’’ అని బదులిచ్చాడు. అలా శ్రీ రామాయణావతరణకు నారద వాల్మీకి మహర్షులే మూలకారకులు.
శ్రీ రామాయణ గ్రంథారంభం నుండి శ్రీరామపట్టాభిషేక ఘట్టం వరకు గల అనేక ముఖ్య సందర్భాలలో కీలకపాత్రను పోషించిన వశిష్ఠ మహర్షి ఇక్ష్వాకు వంశానికి కులగురువు. బ్రహర్షియైున వశిష్ఠుని ఆజ్ఞకు రఘు వంశ రాజులు ఏనాడూ ఎదురు చెప్పలేదు. దశరథ మహరాజు నిర్వహించిన అశ్వమేధ, పుత్రకామేష్టి యాగాలు, దశరథ నందనుల నామకరణం, విశ్వామిత్రుని యాగ సంరక్షణ నిమిత్తం రామలక్ష్మణులను పంపించడానికి దశరథుని ఒప్పించడం.. ఇలా ఎన్నో విశిష్ట కార్యాలను నిర్వహించింది వశిష్ఠ మహర్షే.
అలాగే.. విభాండక మహర్షి కుమారుడైన ఋష్య శృంగ మహర్షి.. దశరథుని ఆహ్వానం మేరకు ‘పుత్రకామేష్టి’ అనే బృహద్యాగంలో పాల్గొని ఆశీస్సుల నందించి యాగ సాఫల్యానికి కారకుడయ్యాడు.
శ్రీరాముని శక్తిని, శ్రీరామతత్త్వాన్ని లోకానికి ముందుగా తెలియపరిచినవాడు విశ్వామిత్ర మహర్షి. తన వద్దనున్న బల, అతిబల విద్యలను జృంభక మొదలైన అస్త్రాలను రామలక్షణులకు ఉపదేశించాడు. తన యాగాలకు అడ్డంకులు కల్పిస్తున్న తాటక, సుబాహువుల సంహారం ద్వారా.. దుష్టశిక్షణకు, శిష్ట రక్షణకు అవతరించిన సత్య పరాక్రమవంతుడైన మహాత్ముడే శ్రీరాముడు అని లోకానికి చాటి చెప్పాడు. ఆ తర్వాత రామలక్షణులను జనకుని కొలువుకు తోడ్కొని వెళ్లి, శివధనుర్భంగం చేయించి, సీతాదేవితో వివాహం జరిపించి, రావణవధకు బీజం వేసి లోకక్షేమానికి దోహదపడిన మహనీయుడు విశ్వామిత్ర మహర్షి.
వనవాస దీక్షలోనున్న సీతారామలక్ష్మణులకు ఆతిథ్యాన్ని ఇచ్చింది, చిత్రకూటము ఆశ్రమ నిర్మాణమునకు అనుకూల ప్రదేశమని తెలిపింది.. భరద్వాజ మహర్షి. రావణ వధానంతరం తన ఆశ్రమానికి వచ్చిన శ్రీరామునికి వరాలను ఇచ్చింది కూడా భరద్వాజ మహర్షియే. విరాధుడు చెప్పిన ప్రకారం శ్రీరాముడు శరభంగ మహర్షి ఆశ్రమానికి వెళ్లాడు. ‘నేను చేసిన తపముతో ఎన్నెన్నో పుణ్యలోకాలు, మరెన్నో పుణ్యఫలాలు నాకు వశమయినాయి. చిత్ర విచిత్రములైన సుఖాలను కలిగించే ఆ పుణ్యఫలాలను సమర్పిస్తానని శరభంగ మహర్షి చెప్పినా రాముడు ఒప్పుకోలేదు.
‘ఈ అడవిలో నివాసయోగ్యమైన, ఆహ్లాదకరమైన ప్రదేశాన్ని తెలపండి చాలు’ అని శ్రీరాముడు కోరగా.. సుతీక్ష్ణ మహర్షి దగ్గరకు పంపాడు. ఇక.. శ్రీరామ చంద్రునికి ఆదిత్యహృదయాన్ని ఉపదేశించి, రావణవధకు సహకరించిన తపోసంపన్నుడు.. అగస్త్య మహర్షి. ఇలా ఎందరో మహర్షులు .. ఆ అవతారపురుషుని చరితను జనులకు శాశ్వతంగా అందించి, తరించడానికి కారకులయ్యారు. అట్టి మహర్షులందరినీ నిత్యం తలుచుకుని వందనం చేయాలి.
🙏🙏🙏🙏🙏
*-: శఠగోపాచార్యులు.*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి