23, సెప్టెంబర్ 2021, గురువారం

మొగలిచెర్ల

 *నిష్కల్మష భక్తి..*


"స్వామి వారి ఆరాధానోత్సవాల పోస్టర్లు వేయించారా?..మీరు ఒంగోలు చేరుస్తారా? లేక, నన్ను వచ్చి తీసుకోమంటారా?" అంటూ గత పది, పన్నెండు సంవత్సరాలుగా...శ్రీ స్వామివారి ఆరాధనామహోత్సవం జరిగే వైశాఖ శుద్ధ సప్తమికి నెలరోజులముందునుంచీ అడిగే ఒకే ఒక వ్యక్తి, శ్రీ ఇండ్ల వెంకటేశ్వర్లు గారు..


శ్రీ ఇండ్ల వెంకటేశ్వర్లు, రమణమ్మ దంపతులు, మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిరం వద్ద, గత 18 సంవత్సరాలుగా స్వామి వారి ఆరాధానోత్సవం రోజున తమ భజన బృందంతో సహా వచ్చి, ఉదయం 9గంటల నుంచీ, సాయంత్రం 6గంటల దాకా..నిర్విరామంగా..పారవశ్యంతో భజన చేస్తారు..ఎవ్వరి నుంచీ ఏమీ ఆశించరు..


వీరిద్దరూ నివాసం ఉండేది, ఒంగోలు లోని అగ్రహారం రోడ్డు, బత్తులవారి కుంట వద్ద వుండే, దత్తాత్రేయ కాలనీ లో...


2001 వ సంవత్సరం లో తమ భజన బృందం గురువుగారు, శ్రీ దత్తాత్రేయ స్వామి వారి భక్తుడూ అయిన లక్ష్మయ్య గారి ప్రోద్బలంతో, మొట్ట మొదటిసారి, మొగలిచెర్ల గ్రామంలో సిద్ధి పొందిన శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిరాన్ని దర్శించారు ఆ దంపతులు..


"స్వామి వారి సమాధి చూడగానే, మాకు వింత అనుభూతి కలిగింది, అది మాటల్లో చెప్పలేమయ్యా..ఇదీ అని చెప్పలేని పరిస్థితి, మమ్మల్ని మేము మర్చిపోయాము"అని శ్రీమతి రమణమ్మ గారు చెప్పారు..ఆరోజే స్వామివారి చిత్రపటాన్ని కొనుక్కుని, ఒంగోలు వెళ్లారు..


మరుసటి రోజు తెల్లవారుఝామున, శ్రీ దత్తాత్రేయ స్వామి వారు తనకు స్వప్న దర్శనం ఇచ్చారనీ.. తాము తెచ్చుకున్న చిత్రపటాన్ని పూజగదిలో పెట్టుకోమని చెప్పారని తెలిపారు..


మరి కొద్దిరోజుల్లోనే, దంపతులిద్దరూ భజనలో ఉన్నప్పుడే శ్రీ వెంకటేశ్వర్లు గారి ప్రభుత్వ ఉద్యోగం పర్మినెంట్ అయిందనే వార్త వచ్చిందనీ చెప్పారు..అది మొదలు ఆ దంపతులిద్దరూ శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి భక్తులుగా మారిపోయారు..


వాళ్ళు నివాసముంటున్న, దత్తాత్రేయ కాలనీ కూడా, వీళ్ళ గురువుగారు లక్ష్మయ్య గారి ప్రోద్బలం తోనే రూపుదిద్దుకుంది..దానిని ఈ దంపతులిద్దరూ ఒక్కొక్క సౌకర్యం కోసం పాటుబడి, అన్నీ సాధించగలిగారు..ఇక అక్కడ శ్రీ దత్తాత్రేయ స్వామి వారి గుడి ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారు..


నేటికీ ఆ దంపతులు తమ కష్ట సుఖాలన్నీ స్వామి వారి అనుగ్రహం గానే భావిస్తారు..ఆరాధన ఉత్సవాలకు, ఒంగోలు లో ప్రచారం వాళ్లే చేస్తారు..దర్శనానికి వచ్చేటప్పుడు, అన్నదానానికి తమవంతు సహకారంగా సరుకులు తీసుకొచ్చి ఇచ్చి వెళుతుంటారు.. 


"అన్నీ ఆయనే...అంతా ఆయనదే భారం, మేము నిమిత్తమాత్రులం..ఇదిగో ఇలా ఇన్ని సంవత్సరాలుగా మాకు అంతరాయం లేకుండా భజన చేసుకునే అవకాశం కల్పించాడు" అంటూ ఆ స్వామి వారి పటానికి చేతులుజోడించి నిరహంకారంగా చెప్పుకుంటారు..


ఎంతోమంది దర్శనానికి వస్తూఉంటారు..అందులో నిష్కల్మష భక్తి ఏ కొద్దిమందిలోనో ఉంటుంది..అటువంటి కోవకు చెందినవారే ఈ దంపతులు.. 


సర్వం..

శ్రీదత్తకృప.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం.. మొగలిచెర్ల గ్రామం.. లింగసముద్రం మండలం...ప్రకాశం జిల్లా...పిన్:523114...సెల్..94402 66380 & 99089 73699)

కామెంట్‌లు లేవు: