22, సెప్టెంబర్ 2021, బుధవారం

సంస్కృత మహాభాగవతం

 *22.09.2021 సాయం కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - ఏడవ అధ్యాయము*


*అవధూతోపాఖ్యానము - పృథివి మొదలుకొని కపోతముల వరకు గల ఎనిమదిమంది గురువుల కథలు*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*7.41 (నలుబది ఒకటవ శ్లోకము)*


*పార్థివేష్విహ దేహేషు ప్రవిష్టస్తద్గుణాశ్రయః|*


*గుణైర్న యుజ్యతే యోగీ గంధైర్వాయురివాత్మదృక్॥12466॥*


వాయువు తనతో సుగంధ-దుర్గంధములను మోసుకొనిపోవునేకాని, వాటితో అలిప్తమై ఉండును. అట్లే ఆత్మజ్ఞాని పార్థివశరీరమునందు ఉండునంతవరకు, శరీరపరమైన వ్యాధులను, బాధలను, ఆకలి-దప్పికలను మున్నగువాటిని వహింపవలసివచ్చును. కాని, తాను శరీరము కాదనియు, ఆత్మరూపుడనై ద్రష్టగా ఉండే తనకు శరీరముతోగానీ, దాని గుణములతోగానీ సంబంధము లేదనియు, నిర్లిప్తుడై ఉండవలయును.


*7.42 (నలుబది రెండవ శ్లోకము)*


*అంతర్హితశ్చ స్థిరజంగమేషు బ్రహ్మాత్మభావేన సమన్వయేన|*


*వ్యాప్త్యావ్యవచ్ఛేదమసంగమాత్మనో మునిర్నభస్త్వం వితతస్య భావయేత్॥12467॥*


స్థావర - జంగమాత్మకములు అన్నియును వేర్వేరు రూపములలో ప్రతీతములగుచున్నను వాస్తవముగా వాటిలో ఒకే ఆకాశము అపరిచ్ఛిన్న రూపములలో వ్యాప్తమై యుండును. బ్రహ్మ సకలవస్తువుల యందును అంతరాత్మగా విలసిల్లియున్నాడని *తత్త్వమసి* మొదలగు వాక్యములు సమన్వయపరచుచున్నవి. ఆకాశమువలె అది అవ్యవచ్చేదము. అనంగము. ఆ బ్రహ్మతత్త్వము చరాచరాత్మకములైన సకలభూతములయందును సంపూర్ణముగా వ్యాపించియున్నది. అది ప్రాణులలోపలను, వెలుపలను వ్యాప్తమైయున్నదని యోగి ఆకాశమునుండి గ్రహింపవలెను.


*7.43 (నలుబది మూడవ శ్లోకము)*


*తేజోఽబన్నమయైర్భావైర్మేఘాద్యైర్వాయునేరితైః|*


*న స్పృశ్యతే నభస్తద్వత్కాలసృష్టైర్గుణైః పుమాన్ ॥12468॥*


వాయువు ప్రేరణతో అగ్ని ప్రజ్వరిల్లును. వర్షము కురియును. అన్నము ఇత్యాది పంటలు పండును, నశించును. వాయువువల్లనే మేఘములు ఆకాశమునందు వచ్చి, పోవుచుండును. ఇవన్నీజరిగినప్పటికినీ ఆకాశము లేనిచో లిప్తము గాకుండును. ఇదేవిధముగా మననశీలుడగు సాధకుడు కాలముచే నిర్మింపబడిన గుణములు, ద్రవ్యములు వచ్చినను, పోయినను ఆకాశమువలె వాటితో ఎట్టి సంబంధము లేకుండా ఉండవలెను.


*7.44 (నలుబది నాలుగవ శ్లోకము)*


*స్వచ్ఛః ప్రకృతితః స్నిగ్ధో మాధుర్యస్తీర్థభూర్నృణామ్|*


*మునిః పునాత్యపాం మిత్రమీక్షోపస్పర్శకీర్తనైః॥12469॥*


జలము సహజముగా స్వచ్ఛమైనది, మధురమైనది, మానవులను పవిత్రమొనర్చు తీర్థరూపమైనది. అట్లే ముని (సాధకుడు) స్వాభావికముగా రాగద్వేషరహితుడు, అందరియెడ స్నేహభావముగలవాడు, తన దృష్టిద్వారా, స్పర్శద్వారా, మధురాలాపములద్వారా మానవులను పవిత్రమొనర్చువాడై ఉండవలెను.


*7.45 (నలుబది ఐదవ శ్లోకము)*


*తేజస్వీ తపసా దీప్తో దుర్ధర్షోదరభాజనః|*


*సర్వభక్షోఽపి యుక్తాత్మా నాదత్తే మలమగ్నివత్॥12470॥*


మననశీలుడగు ముని అగ్నివలె తేజస్వియై, తపశ్శక్తిచే తేజరిల్లుచుండును. ఇతరులచే జయింప శక్యముగానివాడై యుండును. ఎట్టి సంగ్రహమునకు పాల్పడకుండా భిక్షామాత్రము స్వీకరించి తృప్తి చెందుచుండును. జితేంద్రియుడై నిత్యనిరంతరము అధ్యాత్మచింతనలో మునిగియుండును. తనయందు సమర్పింపబడే ఆహుతులను స్వీకరించే అగ్ని, దాని గుణ-దోషములతో అంటకుండునట్లుగా, మునియైనవాడు తనకు లభించిన ఆహారమును స్వీకరించుటవలన, అతనికి ఎట్టి దోషమును అంటదు (అభక్ష్య పదార్థములను అతడు తాకనే తాకడు అనుమాట గమనార్హము).


*7.46 (నలుబది ఆరవ శ్లోకము)*


*క్వచిచ్ఛన్నః క్వచిత్స్పష్ట ఉపాస్యః శ్రేయ ఇచ్ఛతామ్|*


*భుంక్తే సర్వత్ర దాతౄణాం దహన్ ప్రాగుత్తరాశుభమ్॥12471॥*


అగ్ని ఒకచో దాగియుండును. మరియొకచో ప్రకటమగుచుండును. శ్రేయకాములు అగ్నిని ఉపాసించెదరు. వారికొరకు అగ్ని ప్రకటమగును. హోమము చేయువారల హవిస్సును భుజించును. దాతల భూతభవిష్యత్తులలోని పాపములను అగ్ని దహింపజేయును. అట్లే సాధుపురుషుడు అగ్నివంటివాడు. అతడు తన మహత్త్వమును ఒకచో గుప్తముగ నుంచును. వేరొకచో బహిర్గతమొనర్చును. శ్రేయస్సును కోరువారు అతనిని సేవించెదరు. తనను సేవించువారల పూర్వాపర (భూతభవిష్యత్తునందలి) పాపములను నశింపజేసి, వారికి శుభములను చేకూర్చును.


*7.47 (నలుబది ఏడవ శ్లోకము)*


*స్వమాయయా సృష్టమిదం సదసల్లక్షణం విభుః|*


*ప్రవిష్ట ఈయతే తత్తత్స్వరూపోఽగ్నిరివైధసి॥12472॥*


పరమాత్మ తన మాయా ప్రభావముచే చిదచిదాత్మకమైన జగత్తునందు ప్రవేశించి, ఆయా స్వరూపములలో (దేవమనుష్యాది రూపములలో) ప్రతీతమగును. అట్లే అగ్నియు వివిధరూపములలో నున్న ఇంధనములయందు ఆయా రూపములలో ప్రకటితమగుచుండును. దాని సహజరూపములు అవి యెవ్వియును కావు. అగ్ని ఒక్కటే ఉన్నట్లుగా పరమాత్మ అంతటా ఒక్కడే ఉన్నాడు.


*7.48 (నలుబది ఎనిమిదవ శ్లోకము)*


*విసర్గాద్యాః శ్మశానాంతా భావా దేహస్య నాఽఽత్మనః|*


*కలానామివ చంద్రస్య కాలేనాఽవ్యక్తవర్త్మనా॥12473॥*


కాలవేగప్రభావమున చంద్రునియొక్క కళలు పెరుగుచున్నట్లును, తరుగుచున్నట్లును ద్యోతకమగు చుండును. అట్లే పుట్టినది మొదలుకొని, మరణించుట వఱకును దేహమునకు బాల్యయౌవన కౌమార్యాద్యవస్థలు, షడ్వికారములు కాలప్రభావమున ఏర్పడుచుండును. కాని ఆత్మలో ఎట్టి మార్పులును ఉండవు. కావున సకల ప్రాణులకు వృద్ధిక్షయములు సహజములనియు, ధీరుడు వాటికి చలింపడనియు గ్రహింపవలెను.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని ఏడవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

కామెంట్‌లు లేవు: