22, సెప్టెంబర్ 2021, బుధవారం

మొగలిచెర్ల

 *భక్తి తో కూడిన విశ్వాసం..*


"అన్నదానానికి మా అల్లుడు కూతురు విరాళం ఇద్దామనుముంటున్నారు.. ఇప్పుడే ఇవ్వమంటారా?..లేక రేపుదయం ఇవ్వొచ్చా?" అని నల్గొండ నుంచి వచ్చిన శ్రీ మాల్యాద్రి గారు ఒక శనివారం సాయంత్రం పల్లకీ సేవకు ముందు నన్ను అడిగారు..


"మీ ఇష్టం..రేపుదయమే ఇవ్వండి.." అన్నాను..


శ్రీ మదమంచి మాల్యాద్రి గారు, ఎన్నో ఏళ్లనుంచి..ఖచ్చితంగా చెప్పాలంటే..1981 నుంచీ మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి పరమ భక్తులు..శ్రీ స్వామివారిని అత్యంత భక్తి విశ్వాసాలతో కొలిచే కుటుంబాలలో వీరిది కూడా ఒకటి..


మాల్యాద్రి గారి తల్లిగారు కీర్తి శేషురాలు శ్రీమతి లక్షమ్మ గారికి ఆరోజుల్లో కడుపులో విపరీతంగా నొప్పి వచ్చేది..ఆరోజుల్లో అందుబాటులో ఉన్న పరీక్షలన్నీ చేయించారు.. చివరకు వైద్యులు, కడుపులో గడ్డ ఉందని తేల్చారు!.. మందులెన్నో వాడారు..ఫలితం కనబడలేదు..ఆపరేషన్ చేయాలని తీర్మానించారు!..లేకపోతే ప్రాణానికే ముప్పు ఉందని కూడా చెప్పారు..ఆవిడకు ఎటూ పాలుపోలేదు..


ఆ సమయంలోనే శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఆశ్రమం నిర్మించిన శ్రీ బొగ్గవరపు మీరాశెట్టిగారి బావమరిది రాములుసెట్టి గారు, లక్షమ్మ గారితో, "ఒకసారి, మొగలిచెర్ల వచ్చి, శ్రీ దత్తాత్రేయ స్వామి వారి సమాధి వద్ద మొక్కుకో..నీకు ఆరోగ్యం కుదుటబడుతుంది!.." అని చెప్పారట!..లక్షమ్మ గారు, ఆ మాట పట్టుకుని, శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిరానికి వరుసగా మూడు వారాలు పాటు వచ్చారు..ఆవిడ భక్తి విశ్వాసాలు ఆ దత్తాత్రేయుడికి తాకాయి..ఆయన అనుగ్రహమూ లక్షమ్మ గారి మీద ప్రసరించింది..మరో వారానికల్లా, ఆవిడ నొప్పి నయమైంది..ఆ తరువాత మళ్లీ పరీక్షల కోసం డాక్టర్ గారి దగ్గరకు వెళ్లారు..ఎటువంటి అనారోగ్యమూ లేదని డాక్టర్ గారు తేల్చి చెప్పేసారు..


తల్లి ఆరోగ్యంగా ఉండటానికి కారణమైన శ్రీ దత్తాత్రేయుడిని, మాల్యాద్రి గారు పరిపూర్ణంగా నమ్మారు!..నల్గొండ లో ఇటుకబట్టీల వ్యాపారం చేస్తూ, తనకే కష్టం వచ్చినా, మొగలిచెర్ల దత్తుడిదే భారం అనుకున్నారు..ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా శ్రీ స్వామివారిని దర్శించుకోవడం ఒక నియమంగా పెట్టుకున్నారు..


"ఆ స్వామి చల్లగా చూడబట్టే..నా సంసారం బాగుంది..పిల్లలూ ఎదిగొచ్చారు..నిలదొక్కుకున్నారు..ఇదిగో ఈ అమ్మాయి డెంటల్ డాక్టర్, అల్లుడు బ్యాంక్ లో ఉన్నాడు..హైదరాబాద్ లో కూకట్పల్లి లో ఉంటారు..వీడు మనుమడు"!.అంటూ హాయిగా నవ్వారు..


మాల్యాద్రి గారి అల్లుడు గుర్రం వెంకట నారాయణ, ధనలక్ష్మి అనబడే ఆ దంపతులిద్దరూ..భక్తిగా శ్రీ స్వామి వారి వద్ద ఆరోజు అన్నదానం చేయించారు..అత్యంత నిరాడంబరంగా, అన్నదాన సత్రం వద్ద, అన్ని పనుల్లో పాలుపంచుకుని, మరోసారి దత్తాత్రేయుడికి నమస్కారాలర్పించి..మొగలిచెర్ల నుంచి కొండంత తృప్తితో తిరిగి వెళ్లారు..మాల్యాద్రి గారు మళ్లీ మొగలిచెర్ల త్వరగా వస్తానని చెప్పి వెళ్లారు!..


మొగలిచెర్ల దత్తాత్రేయుడి వద్దకు వచ్చే ఒక్కో భక్తుడిది ఒక్కో అనుభవం..ఎవరికి వారికే అది అనుభవం లోకి వచ్చే అనుభూతి!..ఎందరి అనుభవాలో మేము వింటూ ఉంటాము..కానీ..ప్రతిసారీ మాకు ఒకటి అనిపిస్తూ ఉంటుంది..మేము నిత్యమూ కొలిచే దత్తాత్రేయుడు, ఇంతమందికి ఇన్నిరకాలుగా అనుభూతులు పంచుతున్నాడా..అని..నిజానికి ఆ ఊహే అజ్ఞానం కదూ..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం.. లింగసముద్రం మండలం.. ప్రకాశం జిల్లా.. పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: