22, సెప్టెంబర్ 2021, బుధవారం

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*997వ నామ మంత్రము* 22.9.2021


*ఓం శ్రీమత్త్రిపురసుందర్యై నమః*


త్రిపురుడైన పరమేశ్వరుని భర్తగా గలిగిన త్రిపురుసుందరీ స్వరూపిణియైన పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *శ్రీమత్త్రిపురసుందరీ* యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం శ్రీమత్త్రిపురసుందర్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగదాంబికను భక్తిశ్రద్ధలతో ఆరాధించు భక్తులకు ఆ తల్లి కొంగుబంగారమై, సర్వకాల సర్వావ స్థలయందును ఆపదలనునవి కలుగనీయక, జీవించినంతకాలము సిరిసందలకు గాని, శాంతిసౌఖ్యములకు గాని, భోగభాగ్యములకు గాని లోటురానీయక, నిరంతరమూ ఆ పరమేశ్వరీ నామ స్మరణమే జీవనావధిగాజేసి తరింపజేయును.


త్రిపురుడు అనగా పరమశివుడు. త్రిపురాసురులను జయించిన పరమశివుడు త్రిపురుడు అని పిలువబడ్డాడు. సృష్ట్యాది (మూలప్రకృతి) యందు పరమ శివుడు ఒక జ్యోతిస్వరూపుడు. ఆ జ్యోతిస్వరూపంనుండి బ్రహ్మవిష్ణురుద్ర యను మూడుస్వరూపములు ఆయాశక్తులతో ఉద్భవించినవి. మొదటి శక్తి (ఊర్ధ్వ భాగము) ఐదుముఖములు, నాలుగుచేతులు, గౌరవర్ణముగల బ్రహ్మస్వరూపముగాను, రెండవ శక్తి (మధ్యభాగము) నల్లనిదేహము, ఏకముఖము, నాలుగు చేతులయందు శంఖచక్రగదా పద్మములుగల విష్ణు స్వరూపముగాను, మూడవ శక్తి (అధోభాగము) ఐదుముఖములు, నాలుగు చేతులు, స్ఫటికమువలె తెల్లని దేహముగల చంద్రశేఖరుడు. పరమశివుడు ఒక్కడేయైనను ఈ మూడు శక్తులతో బ్రహ్మవిష్ణుశివ పురములు గలవానిగా (అనగా బ్రహ్మవిష్ణుశివుల శరీరములే మూడుపురములై) పరమశివుడు చెప్పబడినాడు. అందుచే ఆయన *త్రిపురుడు* అని యనబడినాడు. అట్టి త్రిపురుని భార్యయైన పరమేశ్వరి త్రిపురసుందరిగాను, సర్వమంగళస్వరూపిణి యగుటచే *శ్రీమత్త్రిపురసుందరీ* యని అనబడినది. ఆ జగదంబిక త్రికాలములకు (భూతభవిష్యద్వర్తమానములకు), మూడు ధామములకు (జాగ్రస్వప్నసుషుప్తులు అను మూడు అవస్థలకు), స్థూల, సూక్ష్మ, కారణదేహములకు ఆ అమ్మయే సాక్షీభూతురాలై యున్నది గనుక ఆ అమ్మ త్రిపురసుందరియనియు, *శ్రీమత్త్రిపురసుందరి* యనియు అనబడినది.


త్రిగుణములకు (సత్త్వరజస్తమోగుణములకు), త్రిలోక (ఊర్థ్వలోకములందలి మొదటి మూడులోకములు : 1. భూలోకము. 2. భువర్లోకము. 3. సువర్లోకము), త్రిస్థాయి (మందరం, మధ్యమం, తార, మందరానికి హృదయం, మధ్యమానికి కంఠం, తారకు మూర్ధము స్థానములు), త్రికాల (భూత, వర్తమాన, భవిష్యత్కాలములు), త్రిశరీర (స్థూల, సూక్ష్మ, కారణ శరీరములు), త్రికూట (వాగ్భవ, కామరాజ, శక్తికూటములు), త్రినాడి (ఇడ, పింగళ, సుషుమ్న), త్రివర్గ (ధర్మము, అర్థము, కామము అను మూడు పురుషార్థములు - నాలుగవదైన మోక్షము ప్రసాదించునది పరమాత్మ), త్రివేద (ఋగ్యజుస్సామ వేదములు).... మొదలైన త్రివర్గముల విషయములకు సమన్వయించు శబ్దమే *త్రిపుర*. అట్టి త్రిపుర అను విశేషణము గలిగిన పరమేశ్వరి *త్రిపురసుందరి* యను శ్రీమాత నామము. గనుక ఆ పరమేశ్వరి *శ్రీమత్త్రిపురసుందరీ* యని అనబడినది. 


జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం శ్రీమత్త్రిపురసుందర్యై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

కామెంట్‌లు లేవు: