22, సెప్టెంబర్ 2021, బుధవారం

రుచిదప్పి పోతోంది

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

*జీవితం రుచిదప్పి పోతోంది ఎందుకని* 

(రచయిత/రచయిత్రి తెలియదు)

--------------------------------------------

రానురాను జీవితం లో మనసు, నాలుక రెండూ రుచి తప్పిపోతున్నాయి, టెక్నాలజీ అనూహ్యంగా పెరిగి ఎన్నో పరికరాలు అందుబాటులోకి వచ్చాయి, మనిషి కాలాన్ని దూరాన్ని జయించకపోయిన అదుపులోకి తెచ్చుకున్నాడు. అయినా ఎదో ఖాళీ అసంతృప్తి, ఏదో మిస్ అవుతోంది. ఏమిటది? స్కైప్ లో, వాట్సాప్ లో ఖండాంతరాలదూరంలో ఉన్నవారితో కూడా చూసి మాటాడుతున్నాం. కానీ ఒకప్పుడు నేనుక్షేమం. నువుకుశలమా? అంటూ అడిగే పదిహేను పైసల పోస్ట్ కార్డు ఇచ్చిన ఆనందం ఇప్పుడులేదు. రేడియోలో ఆదివారం వచ్చే నాటికల కోసం పనిముగుంచుకుని కూచునే రోజుల్లో ఉన్న ఉల్లాసం నలభయి వేల హోమ్ ధియేటర్ లో మూవీ చూసినప్పుడు లేదు.  

చింతగింజలు, వామనగుంటలు వైకుంఠపాళీలు ఆడి ఓడిపోయి తన్నుకునే సంరంభం ఈనాటి వీడియోగేమ్స్ లో ఉందా పిల్లలకు. వేపచెట్టుకింద నులకమంచం, తలకిందో దిండు వేసుకుపడుకుని దోస్తోవస్కీ నేరము శిక్ష చదువుతూ, రాస్కోల్నికోవ్ గురించి ఆలోచిస్తూ నిద్రలోకి జారుకునే రోజుల్లోని సంతృప్తి ఫేసుబుక్ లో పోస్టింగ్స్ చదువుతుంటే ఉండదెందుకనో?

మనసెందుకనో స్పందించడం మానేస్తోందా? నిజానికి గతంలో కంటే ఇప్పుడే మనిషి జీవితం సుఖంగా, రిలాక్స్ గా ఉండాలి. కానీ ఉందా? ఇక రుచుల మాటకొస్తే అప్పటికి ఇప్పటికి ఎంతోతేడా, అభివృద్ధి, కొత్తరుచులు, పిజ్జా బర్గెర్, మంచూరియా, కట్లెట్స్, పూర్వంవారు పేరుకూడా వినని కొత్తరుచులు. అయినా నాలుక రుచితప్పింది. కట్టెలపొగలో పొయ్యిముందుకూచుని ఒకే కూర, చెట్టునకాసిన ములక్కాడల చారు ఊరగాయ, గడ్డపెరుగు, వెన్నకరిగించిన నెయ్యి, అంతే చిన్నప్పటిమెనూ. ఎడ్లబండిలో వడ్లు మిల్లుకు వెళ్తుంటే గట్టిగ చెప్పేది అమ్మమ్మ, ఒక్కపట్టే పట్టించండి తెల్లగా ఉంటాయని రెండోపట్టు వేయొద్దు అని. పిచ్చుకలు వడ్లగింజ పొట్టు వలిచినట్టు గోధుమరంగులో ఉండేవి బియ్యం. అన్నంకూడా కొంచెం ఎర్రగాఉండేది. ఏకాలమూ ఇంట్లోనే కాసేవి కూరగాయలు. పిడకల గూడుమీదకు పాకిన సొరకాయలు పొడవుగా చేతిబారున ఉండేవి. లేలేత సొరకాయ ఉప్పులో పిండి తిరగమూతేసి, దింపేటప్పుడు గ్లాసుడుపాలు పోసిన కూర వేడిఅన్నంలో కలిపి నెయ్యి గుమ్మరించుకుని తింటే ఆరుచి అద్భుతం. చిక్కుడు, కాకర, బీర ఆకు కూరలు అందరి దొడ్లలో విరివిగా ఉండేవి. బటాణిగింజల్లాటి తెల్ల చిక్కుడుకాయలకూర ఎంతరుచో. ఒక్క కొమ్మకు కేజీ వంకాయలు వచ్చేవి. అల్లం పచ్చిమిర్చితో వంకాయకూర రుచి ఇప్పుడుందా? ఎందుకని ఇంతతేడా వచ్చేసింది. నేను ఇప్పుడుకూడా ఇంట్లోనే కొన్ని కూరలు కాయిస్తాను. అయినాసరే ఆ రుచిరాదు. అమ్మచేసే వంటల్లో నాకిష్టమైన చామదుంపల ఫ్రై, కందిపచ్చడి, పప్పుచారు మాత్రం చచ్చినా అలాకుదరవు. గుర్తు తెచ్చుకుని అచ్చం అమ్మలాగే చేస్తాను. అయినాసరే, ఆవకాయ, మాగాయ, పులిహోర, గోంగూర, వంకాయ, పండుమిరపకాయ ఇలా వేళ్ళ మీద లెక్కపెడితే పదిహేను రోజులు రోజుకోటి సరిపోయే పచ్చళ్ళు జాడి దగ్గరకు వెళ్తేనే కమ్మని వాసనలు చిన్నప్పుడు. ఇప్పుడు అన్ని వెరయిటీస్ వేయకపోయినా ఆవకాయ, మాగాయ అసలు ఆరుచి, ఘాటు ఉండట్లేదు. ఎక్కడ తేడా వస్తోందో తెలీదు. పుల్లమజ్జిగలో తిరగట్లో విసిరిన బరక బియ్యప్పిండి, పచ్చిశెనగపప్పు నానపెట్టి పచ్చిమిరప ముక్కలతో వేసిన చల్లట్లు, డబ్బాల్లో నిలవున్న అటుకుల తో ఉప్మా, చేలో పండిన పెసలు మినుములతో అట్లు, ఇడ్లి, గారెలు ఇవే అప్పటి ఫలహారాలు. అవిగాక పుస్తకం చదువుతూ పచ్చి వేరుశెనక్కాయలు, కాల్చిన మొక్కజొన్నకండెలు, వేసవిలో తాటిముంజెలు, తేగలు, కాల్చిన తాటికాయలు తెగ తినేవాళ్ళం చిన్నపుడు.

ఇవి ఇప్పుడు దొరకడమూ లేదు దొరికినా, ఆరుచి లేదు. మాయాబజారులో చిన్నమయ్య తల్పం, గిల్పం, కంబళి, గింబళి అన్నట్లు ఇవి తిండ్లుకాదు. గిండ్లు అనిపిస్తోంది. అసలు ఇలాంటి ఫీలింగ్స్ నాకేనా? అందరికి ఇలాగే ఉందా అని ఒక సందేహానుమాన సంశయం...

కామెంట్‌లు లేవు: