*22.09.2021 ప్రాతః కాల సందేశము*
*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*
*ఏకాదశస్కంధము - ఏడవ అధ్యాయము*
*అవధూతోపాఖ్యానము - పృథివి మొదలుకొని కపోతముల వరకు గల ఎనిమదిమంది గురువుల కథలు*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*7.33 (ముప్పది మూడవ శ్లోకము)*
*పృథివీ వాయురాకాశమాపోఽగ్నిశ్చంద్రమా రవిః|*
*కపోతోఽజగరః సింధుః పతంగో మధుకృద్గజః॥12458॥*
*7.34 (ముప్పది నాలుగవ శ్లోకము)*
*మధుహా హరిణో మీనః పింగలా కురరోఽర్భకః|*
*కుమారీ శరకృత్సర్ప ఊర్ణనాభిః సుపేశకృత్॥12459॥*
*7.35 (ముప్పది ఐదవ శ్లోకము)*
*ఏతే మే గురవో రాజన్ చతుర్వింశతిరాశ్రితాః|*
*శిక్షా వృత్తిభిరేతేషామన్వశిక్షమిహాత్మనః॥12460॥*
*7.36 (ముప్పది ఆరవ శ్లోకము)*
*యతో యదనుశిక్షామి యథా వా నాహుషాత్మజ|*
*తత్తథా పురుషవ్యాఘ్ర నిబోధ కథయామి తే॥12461॥*
మహారాజా! భూమి, వాయువు, ఆకాశము, జలము, అగ్ని, చంద్రుడు, సూర్యుడు, కపోతము, కొండచిలువ, సముద్రము, మిడుత, తేనెటీగ (తుమ్మెద), ఏనుగు, తేనెను పట్టేవాడు, హరిణము, మీనము, *పింగళ* అను పేరుగల వేశ్య, *కురరము* అను పక్షి, బాలుడు, కన్య, బాణములను సిద్ధపరచువాడు, సర్పము, సాలెపురుగు, *భృంగి* అను కీటకము ఈ ఇరువది నాలుగు ప్రాణులను నేను గురువులనుగా ఆశ్రయించితిని. వీటి ఆచరణలను అనుసరించి నేను జ్ఞానమును పొందితిని. నహుషుని మనుమడవైన యదుమహారాజా! మహాపురుషా! వీటినుండి నేను పొందిన స్ఫూర్తిని విపులముగా తెలిపెదను ఆకర్ణింపుము.
*7.37 (ముప్పది ఏడవ శ్లోకము)*
*భూతైరాక్రమ్యమాణోఽపి ధీరో దైవవశానుగైః|*
*తద్విద్వాన్న చలేన్మార్గాదన్వశిక్షం క్షితేర్వ్రతమ్॥12462॥*
విధివశమున ఇతర ప్రాణులు తనను ఆక్రమించి బాధించినను ధీరుడు దానిని (ఆబాధను) విధివిలాసముగా భావించి, సహిష్ణువై తన మార్గమునుండి ఏమాత్రమూ చలింపడు. ఈ క్షమాగుణమును నేను భూమినుండి గ్రహించితిని.
*7.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)*
*శశ్వత్పరార్థసర్వేహః పరార్థైకాంతసంభవః|*
*సాధుః శిక్షేత భూభృత్తో నగశిష్యః పరాత్మతామ్॥12463॥*
పర్వతము నిరంతరము ఇతరులకు ఉపకారమిచ్చెడి లక్షణము గలది, వృక్షములను, తృణములను, సెలయేళ్ళను భరించుచు వాటిద్వారా అది పరహితమునకే పాటుపడుచుండును. అట్లే సాధుపురుషుడు పర్వతమునుండి పరోపకార లక్షణమును అలవరచుకొనవలెను.
*7.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)*
*ప్రాణవృత్త్యైవ సంతుష్యేన్మునిర్నైవేంద్రియప్రియైః|*
*జ్ఞానం యథా న నశ్యేత నావకీర్యేత వాఙ్మనః॥12464॥*
మననశీలుడగు సాధకుడు తన జీవనయాత్రకు తగిన ఆహారమును మాత్రమే తీసుకొని, సంతుష్టిని పొందవలెను. కాని, ఇంద్రియప్రీతికొరకు ఆరాటపడవద్దు. ప్రాణములు నిలుచుటకే ఆహారము అవసరము. అట్టి ఆహారమువలన జ్ఞానశక్తి నశింపదు. వాగింద్రియము, మనస్సు, చంచలము గాకుండును.
*7.40 (నలుబదియవ శ్లోకము)*
*విషయేష్వావిశన్ యోగీ నానాధర్మేషు సర్వతః|*
*గుణదోషవ్యపేతాత్మా న విషజ్జేత వాయువత్॥12465॥*
వాయువు పెక్కు స్థానములయందు ప్రసరించుచుండును. కాని వేటిపైనను ఆసక్తి కలిగియుండదు. వాటి గుణదోషముల యందు ఆసక్తముగాదు. అట్లే సాధకుడు ఇంద్రియములద్వారా వేర్వేరు విషయములను అనుభవించుచున్నను వాటి గుణదోషములయందు అనగా ప్రియ అప్రియములయందు ఆసక్తిని కలిగియుండరాదు.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని ఏడవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319, 9505813235
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి