16, ఆగస్టు 2020, ఆదివారం

రామాయణమ్. .33

చివురుటాకులాగ వణికిపోయాడు దశరధుడు .
ఇంద్రుడి వద్ద ఇక శస్త్రము ముట్టనని ప్రమాణము చేసి, సంపాదించిన భూమినంతా కశ్యపుడికి దానంచేసి ,
మహేంద్రగిరి మీద వానప్రస్థం గడుపుతున్న ఈయన (పరశురాముడు) ఇచ్చటికి ఇలాగ ఉన్నపళంగా !,
ఈ రాజకులాంతకుడు ఎందుకు వచ్చాడు !? మదిలో ఈ ప్రశ్న కలకలంరేపుతున్నది దశరధునకు .
.
పరశురాముడు తన ఎదురుగా ఉన్న రామునితో ,
రామా !నీ పరాక్రమము అద్భుతము!
 శివధనుస్సు విరచినావని విన్నంతనే నీవెంతటి వాడివో తెలుసుకోవాలని మరియొక ధనుస్సు తెచ్చినాను ఇదిగో చూడు!
.
 కొన్ని కారణాలవల్ల శివధనుస్సు బలహీనముగా ఉన్నది . ఇది అత్యంత దృఢమైన వైష్ణవధనువు ! మా తండ్రి గారి వద్దనుండి నాకు ప్రాప్తించినది .
.
ఈ వైష్ణవ ధనుస్సు ఎక్కుపెట్టి శరసంధానము చేయవోయ్ ! నీ బలమేమిటో అప్పుడు తెలుస్తుంది .
.
అప్పుడు నీకు నాతో ద్వంద్వయుద్ధాన్ని అనుగ్రహిస్తాను,
.
 అని పరశురాముడు పలికినమాటలు దశరధుడి గుండెలలో ములుకులుగా గుచ్చుకొని ,భార్గవా ! నా రాముడుపసిబాలుడు !
.
 ఇప్పుడిప్పుడే జీవితంలో అడుగుపెడుతున్నాడు ! జీవనమాధుర్యమేదీ ఇంతవరకు రుచిచూసి ఎరుగడు!
ఇంకా కాళ్ళ పారాణి ఆరలేదు ! పసివాడింకా వాడు !
.
నా రామునకు ఏ విధమైన అమంగళము ప్రాప్తించినా మేమెవ్వరమూ జీవించలేము !.
.
ఈ వేడుకోలు మాటలేవీ పరశురాముడు వినటంలేదు! ఇంకా గట్టిగా మాట్లాడుతూ!
.
రామా ! నీవు సుక్షత్రియుడవే అయినట్లయితే ఈ వైష్ణవ ధనుస్సును ఎక్కుపెట్టు! అని హుంకరిస్తూ తనను రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తున్న భార్గవరాముని చూచి దశరధరాముడు చాలా
 " తగ్గిన గొంతుతో " ఇలా అంటున్నాడు.
.
N.B
.
దశరధమహారాజు పరశురాముడి కాళ్ళ వేళ్ళ బడుతున్నాడు ,వేడుకుంటున్నాడు!
.
తన బలమేమిటో తనకు సంపూర్ణంగా తెలుసు ,అయినా ! తండ్రి మాట్లాడుతున్నప్పుడు ,రాముడు
,ఏమిటి ఈయనతో మాట్లేడేది నాన్నా ! ఈయన సంగతి నేను చూస్తాను ! అని పొరపాటున గూడా మాట్లాడలేదు !
అలా మాట్లాడితే తండ్రిని తగ్గించినట్లవుతుంది!
 అది తన అహంకార ప్రదర్శన అవుతుంది!
.
పరశురాముడికి జవాబిచ్చే సందర్భములో తగ్గిన గొంతుతో సంభాషిస్తాడు రాముడు ,ఇక్కడ రాముని గుణగణాలు తెలుస్తాయి.
.
తండ్రి ఎదుట,గురువుఎదుట ,పెద్దలెదుట ఎప్పుడూ పెద్దగొంతేసుకొని మాటలాడరాదు!
.
అందుకే వాల్మీకి మహర్షి ఈ శ్లోకం ఇలా చెపుతారు.
.
శ్రుత్వా త జ్జామదగ్న్యస్య వాక్యం దాశరధి స్తదా
గౌరవాద్యంత్రిత కధః పితూ రామ మథాబ్రవీత్.
.
పితుఃగౌరవాత్ యంత్రితకథః ......తండ్రిమీద గౌరవము వలన తగ్గింపబడిన సంభాషణము కలవాడై ....
.
రామాయణమ్ మనకు జీవన విలువలను నేర్పుతుంది !
.
ప్రతి సన్నివేశంలోనూ జీవన విలువలే! అందుకే రామాయణమ్ జీవనపారాయణమ్ కావాలి!
.

జానకిరామారావు వూటుకూరు గారి
సౌజన్యం తో ....

*ధర్మధ్వజం*
హిందు చైతన్య వేదిక
**************

కామెంట్‌లు లేవు: