16, ఆగస్టు 2020, ఆదివారం

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*అష్టమ స్కంధము - పండ్రెండవ అధ్యాయము*

*శ్రీమహావిష్ణువు యొక్క మోహినీరూపమును జూచి, పరమశివుడు మోహితుడగుట*

*ఓం నమో భగవతే వాసుదేవాయ*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


*12.9 (తొమ్మిదవ శ్లోకము)*

*త్వాం బ్రహ్మ కేచిదవయంత్యుత ధర్మమేకే ఏకే పరం సదసతోః పురుషం పరేశమ్|*

*అన్యేఽవయంతి నవశక్తియుతం పరం త్వాం  కేచిన్మహాపురుషమవ్యయమాత్మతంత్రమ్॥6774॥*

ప్రభూ! నీవు పరబ్రహ్మవనియు, కొందరు ధర్మమనియు వర్ణింతురు. ఈ విధముగా కొందరు నిన్ను ప్రకృతి  పురుషులకు అతీతుడవైన పరమేశ్వరుడవనియు తెలుపుచుందురు. విమల, ఉత్కర్షిణి, జ్ఞాన, క్రియ, యోగ, ప్రహ్వి, సత్య ఈశాన-అనుగ్రహ-అను తొమ్మిది శక్తులను కలిగిన పరమపురుషుడవని కొందరు భావింతురు. మరి కొందరు క్లేశములు, కర్మలు మొదలగు బంధములు లేనివాడవని, పూర్వజులకంటె పూర్వుడవని, శాశ్వతమైన పరమపురుషుడవని భావింతురు.

*12.10 (పదియవ శ్లోకము)*

*నాహం పరాయురృషయో న మరీచిముఖ్యా జానంతి యద్విరచితం ఖలు సత్త్వసర్గాః|*

*యన్మాయయా ముషితచేతస ఈశ దైత్యమర్త్యాదయః కిముత శశ్వదభద్రవృత్తాః॥6775॥*

ప్రభూ! నీ సత్త్వగుణములచే సృష్టింపబడిన నేను, బ్రహ్మదేవుడు, మరీచి మున్నగు ఋషులు నీచే నిర్మితమైన సృష్టియొక్క రహస్యమును తెలియజాలము. ఇంక నిన్ను ఎట్లు తెలిసికొనగలము? మాయావశులై రజస్తమోగుణ కర్మలయందు నిమగ్నమైన అసురులు, మానవులు మొదలగువారు నిన్ను ఎట్లు తెలిసికొనగలరు?

*12.11 (పదకొండవ శ్లోకము)*

*స త్వం సమీహితమదః స్థితిజన్మనాశం భూతేహితం చ జగతో భవబంధమోక్షౌ|*

*వాయుర్యథా విశతి ఖం చ చరాచరాఖ్యం సర్వం తదాత్మకతయావగమోఽవరుంత్సే॥6776॥*

ప్రభూ! సర్వాత్మకుడవుక జ్ఞానస్వరూపుడవు. వాయువువలె ఆకాశమున అదృశ్యుడవై ఉండియు సకల చరాచర జగత్తులో సర్వదా విరాజిల్లుచుందువు. వారి చేష్టలు, స్థితులు, జన్మకర్మలు, బంధమోక్షములు, నాశనము మొదలగునవి అన్నియును నీకు తెలియును.

*12.12 (పండ్రెండవ శ్లోకము)*

*అవతారా మయా దృష్టా రమమాణస్య తే గుణైః|*

*సోఽహం తద్ద్రష్టుమిచ్ఛామి యత్తే యోషిద్వపుర్ధృతమ్॥6777॥*

ప్రభూ! నీవు గుణములను స్వీకరించి, నీలీలను ప్రదర్శించుటకై పెక్కు అవతారములను దాల్చితివి. వాటిని అన్నింటిని నేను దర్శించితిని. ఇప్పుడు నీవు మోహినీ రూపమును ధరించితివని విన్నాను. ఆ రూపముసు గూడ నేను చూడగోరుచున్నాను.

*12.13 (పదమూడవ శ్లోకము)*

*యేన సమ్మోహితా దైత్యాః పాయితాశ్చామృతం సురాః|*

*తద్దిదృక్షవ ఆయాతాః పరం కౌతూహలం హి నః॥6778॥*

స్వామీ! ఆ రూపములో నీవు దైత్యులను మోహితులను గావించి, అమృతమును దేవతలకు పంచి ఇచ్చితివి. ఆ మోహినీ రూపమును దర్శింపవలెనని మా మనస్సులు ఉబలాటపడుచున్నవి. దానిని చూచుటకై మేము అందరము ఇచ్చటికి వచ్చితిమి.

*శ్రీశుక ఉవాచ*

*12.14 (పదునాలుగవ శ్లోకము)*

*ఏవమభ్యర్థితో విష్ణుర్భగవాన్ శూలపాణినా|*

*ప్రహస్య భావగంభీరం గిరిశం ప్రత్యభాషత॥6779॥*

*శ్రీశుకుడు వచించెను* శూలపాణియైన పరమశివుడు ఇట్లు ప్రార్థింపగా శ్రీమహావిష్ణువు దరహాసమొనర్చుచు భావగంభీర్యముతో శంకరునకు ఇట్లు ప్రత్యుత్తరము ఇచ్చెను.

*శ్రీభగవానువాచ*

*12.15 (పదునైదవ శ్లోకము)*

*కౌతూహలాయ దైత్యానాం యోషిద్వేషో మయా కృతః|*

*పశ్యతా సురకార్యాణి గతే పీయూషభాజనే॥6780॥*

*శ్రీమహావిష్ణువు ఇట్లనెను* మహాదేవా! ఆ సమయమున దైత్యులు అమృత కలశమును తీసికొనిపోవుచుండిరి. అప్ఫుడు దేవతల కార్యమును సాధించుటకు దైత్యులలో కౌతూహలమును కలిగించుటకు నేను స్త్రీ రూపమును   ధరించితిని.

*12.16 (పదహారవ శ్లోకము)*

*తత్తేఽహం దర్శయిష్యామి దిదృక్షోః సురసత్తమ|*

*కామినాం బహు మంతవ్యం సంకల్పప్రభవోదయమ్॥6781॥*

దైవశిరోమణీ! నీవు ఆ రూపమును చూడగోరుచున్నావు. గనుక, దానిని  మీకు చూపెదను. కాని, ఆ రూపము  కాముకులకే ఆదరణీయము. ఎందులకనగా, అది కామభావమును ఉత్తేజితమొనర్చునట్టిది సుమా!

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి అష్టమస్కంధములోని పండ్రెండవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319
*******************

కామెంట్‌లు లేవు: