ॐ శ్రీమద్వాల్మీకి రామాయణం - ప్రస్తుత విద్యావిషయాలకి ఆదర్శం
-----------------------
యావత్ స్థాస్యన్తి గిరయః
సరితశ్చ మహీతలే I
తావత్ రామాయణకథా
లోకేషు ప్రచరిష్యతి ॥
- అని బ్రహ్మదేవుని మాట!
అంటే, పర్వతాలూ నదులూ భూతలమందు ఉన్నంతకాలమూ రామాయణ కథ లోకాలలో వ్యాపించియుంటుంది అని అర్థం.
మానవుని జీవన విధానాన్ని వైదికశాస్త్రపరంగా వివరించేది శ్రీమద్వాల్మీకీ రామాయణం.
వేదార్థానికి పరిపుష్టి కూర్చడానికై రచింపబడిన రామాయణం ఏ విషయాన్నైనా ఆయా సందర్భాలలో చక్కని కథాభాగంగా వివరిస్తూ,
మనకి కావలసిన కార్యాలకు సంబంధించి సందేశాల రూపంలో మార్గాన్ని సూచిస్తుంది.
సమస్యలకి పరిష్కారంగా మాత్రమే కాక, అసలు సమస్యనే నివారించే విధంగా వ్యక్తికీ, సమాజానికీ అన్ని కాలాలలోనూ పూర్తిగా అవుసరమైనది.
గణితం, భౌతిక, జీవశాస్త్రాలూ, అర్థ, భౌగోళిక, చరిత్ర, పరిపాలన, విజ్ఞాన, వైద్యశాస్త్రాలనేవి - ఒక్కొక్కరూ ఒక్కొక్క విషయంలో మాత్రమే నిష్ణాతులయ్యే అవకాశం ప్రస్తుత విద్యావ్యవస్థలో మనకి కనిపిస్తుంది.
అదీకూడా, అనేక పరిశోధనలు చేస్తూ, వచ్చే ఫలితాలు పాతపరిశోధనల ఫలితాలతో విభేదిస్తూ ముందుకువెళ్ళే వ్యవస్థే మనకి తెలుసు.
పరమాణు నమూనా - ఎలక్ట్రాన్ విషయాలకి సంబంధించి రూథర్ ఫర్డ్, థామ్సన్, నీల్స్ బోర్, సోమర్ ఫీల్డ్ వంటి శాస్త్రవేత్తలు ఒకరి తరువాత ఒకరు భిన్న నిర్వచనాలనివ్వడమే దీనికి గొప్ప ఉదాహరణ.
కానీ శ్రీమద్వాల్మీకి రామాయణం ఏ విషయమైనాసరే, దానిపై ప్రత్యేకంగా పరిశోధనతో ముందుకు వెళ్ళవలసిన అవుసరంలేక, ఆ విషయంమీద ఆదర్శంగా కనిపించే విధానంతో, విషయాన్ని లోతుగా సమగ్రంగా వివరిస్తూ, అన్ని విద్యావిషయాలనీ అందిస్తుంది.
మానవుని జీవితంలో, పుట్టిన దగ్గరనుంచీ జీవితకాలమంతా దైనందిక జీవితంలో,
వ్యక్తిగా - సమాజపరంగానూ, ప్రకృతికి చెందిన భౌతిక విషయాలకీ, మానసిక ఆలోచనకి సంబంధించి సమగ్రంగా సమాచారాన్ని విశ్లేషించే ఆదికావ్యం శ్రీమద్వాల్మీకి రామాయణం.
ప్రభుత్వ డిగ్రీ కళాశాల భద్రాచలం - 2007లో "రామాయణం"పై నిర్వహించిన సదస్సులో సమర్పించిన,
"శ్రీమద్వాల్మీకి రామాయణం - ప్రస్తుత విద్యావిషయాలకి ఆదర్శం"
అనే అంశంలోని
ప్రస్తుత విద్యావిషయాలలో గణితం, చరిత్ర, సాంకేతికవిద్య, వైద్యంవంటివాటికి సంబంధించి ఒక్కొక్క విషయానికి ఆ గ్రంథం ఏ విధమైన సందేశం ఇస్తుందో ఒక్కోరోజు ఒక్కొక్క విషయమై పరిశీలిద్దాం.
=x=x=x=
— రామాయణం శర్మ
భద్రాచలం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి