అగ్నిమహాపురాణం, ఉత్తర హరివంశం గ్రంథాలను ఆవిష్కరించిన టిటిడి చైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి
టిటిడి పురాణ ఇతిహాస ప్రాజెక్టు ఆధ్వర్యంలో ముద్రించిన అగ్నిమహాపురాణం(ప్రథమ భాగం), ఉత్తర హరివంశం (ప్రథమ, ద్వితీయ సంపుటాలు) గ్రంథాలను టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి శుక్రవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ సనాతన హైందవ ధర్మ వ్యాప్తిలో భాగంగా ఇతిహాసాలను, పురాణాలను సరళమైన తెలుగులోకి అనువదించి సామాన్య పాఠకులకు అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. అగ్నిమహాపురాణంలో మొత్తం 383 అధ్యాయాల్లో 11 వేలకు పైగా శ్లోకాలు ఉన్నాయని, ప్రథమ భాగంలో 209 ఆధ్యాయాల్లో 5,780 శ్లోకాలు ఉన్నాయని తెలిపారు. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం సంస్కృత విశ్రాంతాచార్యులు డా. కె.ప్రతాప్ తెలుగులోకి చక్కగా అనువదించారని వివరించారు. అదేవిధంగా శ్రీ నాచన సోమన రచించిన ఉత్తర హరివంశం గ్రంథంలో ఆరు ఆశ్వాసాలు ఉన్నాయని, వీటిని రెండు సంపుటాలుగా శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం తెలుగు విశ్రాంతాచార్యులు డా. తుమ్మపూడి కోటేశ్వరరావు తెలుగులోకి అనువదించారని చెప్పారు. ఈ రెండు గ్రంథాలను జనబాహుళ్యంలోకి తీసుకెళ్లేందుకు విశేషంగా కృషి చేసిన పురాణ ఇతిహాస ప్రాజెక్టు ప్రత్యేకాధికారి డా. ఆకెళ్ల విభీషణశర్మకు, ఇతర పండిత పరిషత్ పెద్దలకు కృతజ్ఞతాభినందనలు తెలియజేశారు.
టిటిడి పురాణ ఇతిహాస ప్రాజెక్టు పూర్వ ప్రత్యేకాధికారి డా. సముద్రాల లక్ష్మణయ్య మాట్లాడుతూ భగవంతుడు వేదాల్లో చెప్పిన విషయాలను అందరికీ అర్థమయ్యేలా విశదీకరించేందుకు 18 పురాణాలను వేదవ్యాసుల వారు రచించారని చెప్పారు. అగ్నిపురాణంలోని అంశాలను అగ్నిదేవుడు వశిష్టుడికి చెప్పారని, మానవజీవితం సార్థకమయ్యేందుకు కావాల్సిన అన్ని విషయాలు ఇందులో ఉన్నాయని వివరించారు. ఈ గ్రంథంలో శ్లోకాలకు తాత్పర్యం, విశేషాంశాలను తెలియజేశామన్నారు. టిటిడిలో పురాణాల అనువాదం ఒక మహాయజ్ఞంలా జరుగుతోందని చెప్పారు. మహాభారతానికి అనుబంధంగా ఉన్న గ్రంథం ఉత్తర హరివంశం అన్నారు.
ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి, అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, జెఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మయ్య, పండిత పరిషత్ సభ్యులు డా. కొంపెల్ల రామసూర్యనారాయణ, డా. శ్రీపాద సత్యనారాయణమూర్తి, డా. శ్రీపాద సుబ్రమణ్యం, డా. ధూళిపాళ ప్రభాకర కృష్ణమూర్తి, డా. తూమాటి సంజీవరావు, డా. సాయిరాం సుబ్రమణ్యం, ప్రచురణల విభాగం ప్రత్యేకాధికారి డా. రేమెళ్ల రామకృష్ణ శాస్త్రి, పురాణ ఇతిహాస ప్రాజెక్టు ప్రత్యేకాధికారి డా. ఆకెళ్ల విభీషణశర్మ, డా. సముద్రాల దశరథ్, డా.ఎన్.నరసింహాచార్యులు తదితరులు పాల్గొన్నారు.
------------------------------------------------------
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి