23, అక్టోబర్ 2021, శనివారం

శ్రీమద్వాల్మీకి రామాయణం



ॐ శ్రీమద్వాల్మీకి రామాయణం - ప్రస్తుత విద్యావిషయాలకి ఆదర్శం 


(ప్రభుత్వ డిగ్రీ కళాశాల భద్రాచలం - 2007లో "రామాయణం"పై నిర్వహించిన సదస్సులో సమర్పించిన, 

   "శ్రీమద్వాల్మీకి రామాయణం - ప్రస్తుత విద్యావిషయాలకి ఆదర్శం" 

    అనే పత్రంలోని ఒక అంశం)

                --------------------


    2. సార్వభౌమత్వము - సామ్రాజ్య విధానము 


ప్రస్తుత సామ్రాజ్యవాదం 


    ప్రస్తుత ప్రపంచంలో, స్వార్థంతో ఒక ప్రభుత్వం 

  - ఇతర దేశాలపై దాడిచేసి, 

  - వలస రాజ్యాలనేర్పరచి, 

  - తమ జాతిలో అల్పులైనవారిని కూడా ఉన్నతాధికారులను చేసి, 

  - వారి పరిపాలన ద్వారా అనేక విధాలుగా ఆ దేశాల ప్రజల ధన మాన ప్రాణాలను కొల్లగొట్టటం నేటి సామ్రాజ్యవాదం.  

    బ్రిటిష్ పాలకులు మన దేశాన్ని పాలించడం వీటికి ఒక గొప్ప ఉదాహరణ. 


    వ్యాపార విస్తరణ పేరుతోనూ, మానవ వనరులు సంపదలు ఉపయోగించుకుంటూనూ, ఇతర దేశాల సంపద దోచుకొనడం మరొక విధమైనది. దీనిని మనం ప్రస్తుతం చూస్తున్నాం. 


రామాయణం - ఇక్ష్వాకు వంశ సార్వభౌమత్వం 


    వాల్మీకి రామాయణంలో, ఈ భూమండలమంతా ఇక్ష్వాకు వంశీయులది అని పేర్కొనబడింది. 

    అయోధ్య కేంద్రంగా ప్రత్యక్ష పరిపాలన అందిస్తూ సార్వభౌమత్వాన్ని వారు కలిగియున్నారు. 

     కానీ వారంతటవారు ఇతర రాజ్యాలపై ఆధిపత్యానికి ఎప్పుడూ సంకల్పించలేదు. 


శ్రీరాముని పరిపాలన. 

     

    శ్రీరాముడు - 

* తనంతట తాను ఏ దేశము మీదా దండయాత్ర చేయలేదు. 

   ఆయా దేశాల రాజ కుటుంబీకుల సభ్యులుగానీ, మహర్షులుగానీ కలసినమీదటనే, ఆయా దేశ వ్యవహారాలలో జోక్యం చేసుకున్నాడు. 

* కిష్కింధను గానీ, లంకను గానీ, ఏ ఇతర రాజ్యాలనుగానీ కొల్లగొట్టలేదు. 

* వారి భూములను ఆక్రమింపలేదు. 

* ఆ రాజ్యములలో తనవారిని ఉద్యోగాలలో నియమింపలేదు. 

* కప్పములు కోరలేదు. 

* పరిపాలనాధికారములందు జోక్యము కలిగించుకోలేదు. 

* ఒక్కసారియైన వారి రాజధానీ నగరములలో ప్రవేశింపలేదు. 

* ఆ రాజ వంశములకు చెందినవారినే ప్రభువులను గావించాడు. 


భారతీయత 


    సర్వ శక్తిమంతులుగా ఉంటూ, 

    దురాక్రమణలు చేయక - చేయబడక, 

    ఇతర దేశాలపై నియంత్రణ - పరిపాలనాధిపత్యాలు లేకుండా, 

    సర్వస్వతంత్ర దేశంగా, 

    ప్రపంచదేశాలకు మార్గదర్శిగా, 

    సార్వభౌమత్వాన్ని కలిగి ఉండడమే "భారతీయత" అనేది శ్రీమద్రామాయణం ద్వారా తెలుస్తుంది కదా! 


                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

              భద్రాచలం

కామెంట్‌లు లేవు: