🌹ఈరోజు కధ 🌹
చాలా కాలం క్రితం, కాశీ నగరంలో సదానందయోగి అనే మునీశ్వరుడు ఉండేవారు. ఆయన అన్ని క్షేత్రాలు తిరిగారు. ఆయనకు ఎటువంటి తాపత్రయాలు, చీకూచింతలూ లేవు. ఆయన జ్ఞాని, ఆయనలో ఎప్పుడూ ఏదో ఆనందం, నిండుదనం కనిపిస్తాయి. అందుకే ఆయనను సదానంద యోగి అనేవారు.
ఒకరోజు ఆయన తన శిష్యుడయిన చిదానందయోగిని పిలిచి, 'నాయనా! నాకు కాశీరామేశ్వర యాత్ర చెయ్యాలన్న సంకల్పం కలిగింది. నీవు, నీ తోటి విద్యార్ధులు నాతొ రండి. నేను మీకు కాశీ నుండీ రామేశ్వరం వరకూ కల నదులు, తీర్దాలు, వనాలు, పుణ్య క్షేత్రాలు మొదలయిన వాటి విశేషాలను చెప్తాను,' అన్నారు.
అదే మహాభాగ్యమని, నమస్కరించి, చిదానందుడు తోటి శిష్యులను పిలిచి కూర్చోపెట్టాడు. అప్పుడు సదానంద యోగి ఇలా చెప్పసాగారు....
సదానందయోగి, తన చుట్టూ ఉన్న శిష్యులను ప్రసన్నంగా చూసి, "నాయనలారా! ముందు మీరు మనం ఉన్న ఈ కాశీనగర వైశిష్ట్యాన్ని గురించి తెలుసుకోవాలి. ఈ వారణాసి లోని ప్రతీ క్షేత్రమూ, ప్రతీ దైవము గురించి పూర్తిగా చెప్పాలంటే, బ్రహ్మకయినా సాధ్యం కాదు. ఇక నేనెంత? అలాగని మనిషి నిరుత్సాహపడరాదు, అందుకే నేను పెద్దలవల్ల విన్నది సమగ్రంగా చెబుతాను, వినండి," అంటూ ఇలా చెప్పసాగారు.
కాశీ నగరానికి మరొక పేరు శివ రాజధాని. ఇది గంగా నదికి పడమరగా, వక్రము కలిగి, ఐదు క్రోసుల దూరాన విస్తరించి ఉన్న మహా పట్టణము. ఈ నదీ తీరము పొడవునా, అరవై నాలుగు పెద్ద తీర్ధములు ఉన్నాయి.
పూర్వం దక్షప్రజాపతి తన కుమార్తె అయిన సతీదేవిని శివుడికి ఇచ్చి వివాహం చేసాడు. ఒకసారి దక్షయజ్ఞం సమయంలో దక్షుడు శివుడి మీద అక్కసుతో, సతీదేవిని పరాభవించాడు. ఆమె యోగాగ్నిలో పడి, ప్రాణాలు విడిచింది. ఆమె ప్రేతాన్ని భుజాన వేసుకుని తిరుగుతున్న శివుడిని, తిరిగి మామూలు స్థితికి తెచ్చేందుకు, విష్ణువు తన యోగమాయతో ఆ దేహాన్ని పద్దేనిమిది ముక్కలు చేసాడు. అప్పుడు ఆ దేవి ముఖం ఈ కాశీలో పడినందువల్ల, ఈ ప్రదేశానికి " గౌరిముఖ " అనే పేరు వచ్చింది. ఇక్కడి దేవత పేరు, కాశీ విశాలాక్షి.
ఈ మహాకాశీ క్షేత్రానికి రాజు విశ్వనాధుడు . మంత్రి బిందుమాధవ స్వామి. క్షేత్రపాలకుడు భైరవుడు. గణనాయకుడు లేఖాదారుడు. ఇక్కడ లేని దేవతలు, తీర్ధములు, మహిమలు మరి వేరెందునూ లేవని పురాణాలు చాటి చెబుతున్నాయి. ప్రళయంలో కూడా నశించని, శివుడి త్రిశూలాగ్రంపై స్థితమై ఉన్న ఈ పట్టణమే కాశీ.
ఇక ఈ క్షేత్ర యాత్రా విధానం చెబుతాను, వినండి....
కాశీ యాత్రా విధానం గురించి చెప్పసాగారు సదానందయోగి.
ఈ కాశీ యాత్రకు వెళ్ళినవారు ఉదయాన్నే మేల్కొని, స్నానాదులు ముగించుకుని, ముందుగా అన్నపూర్ణా విశ్వేస్వరులను దర్శించుకోవాలి.
తరువాత బిందుమాధవ స్వామిని సేవించి, విశ్వేశ్వర మందిరం వద్ద ఉన్న డుండిం రాజ గణపతిని ఆరాధించి, తరువాత ఉత్తరంగా ఉన్న దండపాణి స్వామిని పూజించి, కాలభైరవుడిని దర్శించి, పడమరన ఉన్న కాశీ మూర్తిని సేవించి, వాయువ్యంగా ఉన్న గుహను చూచి, గంగా పుష్కరిణిని కొలిచి, విశ్వేశ్వరం లోని అన్నపూర్నాదేవిని పూజించి, మణికర్నికకు పోయి, మణికర్ణికా మూర్తిని ఆరాధించి, అక్కడే స్నానం చేసి, తిరిగి విశ్వేశ్వర సన్నిధికి వచ్చి నమస్కరించి, వసతికి వెళ్ళాలి . దీనినే నిత్య యాత్రా విధానం అంటారు. ఇక మనం బయలుదేరి, గయా గదాధరకు వెళ్దాము , అంటూ శిష్యులతో యాత్రకు బయలుదేరారు సదానంద యోగి. 🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి