పూర్వం వ్యాసుడు తన శిష్యగణంతో కాశీలో వుండి తపస్సు చేసుకోసాగాడు. ఒకసారి పార్వతీ పరమేశ్వరులకు ఆయనని పరీక్ష చేయాలనిపించింది. మధ్యాహ్నం భిక్ష కోసం వెళ్ళిన ఆయనకుగానీ ఆయన శిష్యులకుగానీ పార్వతీ పరమేశ్వరుల ప్రభావంవల్ల కాశీలో ఎక్కడా భిక్ష దొరకలేదు. అలా మూడు రోజులయింది. ఈ మూడు రోజులూ వారికి ఏ ఆహారమూ లేదు. అలా ఎందుకు జరుగుతోందో ఆయనకు అర్ధంకాలేదు. సాక్షాత్తూ అన్నపూర్ణ నిలయమైన కాశీలో తమకు ఆహారం దొరకకపోవటమేమిటి ? కాశీవాసులకు ఇహంలో అన్ని సౌఖ్యాలూ వుండి అంత్యకాలంలో మోక్షం లభిస్తుంది. అందుకే వారికి అహంకారం పెరిగి తమకు భిక్ష పెట్టంలేదని కోపం వచ్చింది. ఆ కోపంలో ఆయనకి ఆలోచన రాలేదు. మూడు తరాలవరకు కాశీవాసులకు ఏమీ దొరకకూడదు అని శపించబోయాడు. అతని మనసులో మాట బయటకు రాకుండానే ఒక పెద్ద ముత్తయిదు రూపంలో పార్వతీ దేవి వచ్చి వారిని భిక్షకు పిలిచి తృప్తిగా భోజనం పెట్టింది. తర్వాత నెమ్మదిగా చివాట్లూ పెట్టింది. మూడు రోజులు అన్నం దొరకకపోతే ఆగ్రహంలో ఔచిత్యాన్నే మరచిపోయావే, అష్టాదశ పురాణాలూ ఎలా రాశావయ్యా అని నిలదీసింది. కాశీవాసులకు శాపం ఇస్తే విశ్వేశ్వరుడు వూరుకుంటాడా అని నిలదీసింది. ఇంతలో విశ్వేశ్వరుడూ ప్రత్యక్షమయి కాశీలో కోపిష్టులు వుండకూడదని వ్యాసుణ్ణి ఐదు కోసుల దూరంలో గంగకు ఆవలి ఒడ్డున నివసించమని శాసించాడు. వ్యాసుడు పశ్చాత్తాపంతో ప్రార్ధిస్తే , ‘’వ్యాస నిష్కాసనం ‘’చరిత్ర సృష్టిస్తుందని ఊరడించి, ప్రతి అష్టమి నాడును ,ప్రతి మాస శివరాత్రి నాడును కాశీ ప్రవేశమునకు వ్యాసునికి అనుమతి నిచ్చాడు దయామయుడైన విశ్వేశ్వరుడు
అలాగే
కాశీలో 'గవ్వలమ్మ' అనే గ్రామదేవత ఉంటుంది. ఈమెకు ఐదు గవ్వలు కలిపి అల్లిన మాలను భక్తులు సమర్పిస్తూ ఉంటారు. ఈమె విశ్వనాధుని సోదరి అని ప్రతీతి.
మడి, ఆచారాలు ఎక్కువగా ఉన్న గవ్వలమ్మ, కాశీ నగరంలో అందరినీ 'తప్పుకోండి, మడి, మడి...' అని ఒకటే విసిగించేదట ! రెండు మూడు మార్లు మందలించి, నచ్చజెప్పబోయిన విశ్వేశ్వరుడి ప్రయత్నం ఫలించకపోవడంతో... కోపించిన స్వామి... ఆమెను మాలపేటలో పడి ఉండమని, విసిరేసారట ! అందుకే, కాశీలో మడి, ఆచారాల పేరుతో ఎవరూ, మితిమీరి వ్యవహరించరాదట !
ఇది శివపురం... కాశీ, కేదార క్షేత్రాలు శివునికి అత్యంత ప్రీతిపాత్రం. అనుక్షణం శివభక్తులు, అదృశ్య దేవతలు, సకల జీవరాశులు జపించే పంచాక్షరీ మంత్రం మార్మ్రోగే కాశీలో... అహాన్ని, కోపాన్ని, భేద భావనలను వీడి, అనుక్షణం అత్యంత అప్రమత్తంగా మెలగాలని, గుర్తుంచుకోవాలి ! భక్తితో చేసే ప్రార్ధనే శివానుగ్రహానికి రాచమార్గం !ఓం నమః శివాయ. 🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి