*సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*
*688 వ రోజు*
అనుశాసనిక పర్వము పంచమాశ్వాసము
యోగము
పార్వతీ ! ఇక యోగమార్గము గురించి వివరిస్తాను. ఈ దేహము, ఇంద్రియములు, మనసు, బుద్ధీ, ఆత్మ ఇవన్నీ ఒకటే కాని వేరు కాదు అనుకోవడమే యోగము. ప్రతిరోజూ అగ్నిహోత్రము చెయ్యడం, అధికంగా మాట్లాడకుండా ఉండడం, సత్వగుణము కలిగి ఉండడడం, అర్హులైన వారికి దానంచెయ్యడం, వేదాభ్యాసంచెయ్యడం, ఎల్లప్పుడూ శుచిగా ఉండడం, సత్యముపలకడం, వీటిని అనుసరించడం వలన మానవుడిలోని పాపాలునశిస్తాయి . శుచిగాశుభ్రంగా ఉండాలి. ఏకాంత ప్రదేశంలో ఒక ఆసనముమీద కూర్చోవాలి. నడుము దగ్గర నుండి తల వరకు నిటారుగా కూర్చోవాలి. ఇంద్రియములను మనస్సును ఏకం చెయ్యాలి. మనస్సును ఆత్మలో లీనముచెయ్యాలి. ప్రాణ, ఆపాన వాయువులను క్రమబద్ధం చెయ్యాలి. మానవుడు మనసును ఈ దశకు రాగానే ఇష్టం వచ్చినట్లు పోనీయరాదు. ప్రాణవాయువు ఆపానవాయువుతో కూడి ఊర్ధ్వ ముఖంగా పయనించి శిరస్సు దగ్గరకు చేరుతుంది. అప్పుడు జీవాత్మ పరమాత్మగా మారుతుంది. ఈ యోగమును అనుసరించడానికి సోమరితనము, పరధ్యానము, అత్యాశ, ఇతరులపట్ల ఆదరం లేకపోవడం, రోగములు, స్వప్నములు, లోభత్వము, భయము, కామము, క్రోధము, సుఖములు అనుభవించాలన్న కోరిక, చంచలత్వము మొదలైన దుష్టగుణములు అత్యంత విరోధములు. పైన చెప్పిన గుణములు ఉన్నవారు యోగాభ్యాసానికి అర్హులు కారు. ఈ యోగాభ్యాసమును నిష్ఠతో చేసిన అష్టసిద్ధులు సిద్ధిస్తాయి. అలాంటి యోగి స్వేచ్ఛగా ఎక్కడంటే అక్కడ తిరగగలడు. యోగి ఎక్కువగా నిద్ర పోకూడదు. అలాగని అసలు నిద్రపోకుండా ఉండ కూడదు. ఎక్కువగా తిన కూడదు. అలాగని అసలు తినకుండా ఉండ కూడదు. మితభోజనం, మితనిద్ర యోగికి యోగసిద్ధి కలిగిస్తుంది. యోగధర్మము ఇదే " అని మహేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు..
పరమాత్మలో లీనం
పార్వతీదేవి " మీ దయ వలన సాంఖ్యము, యోగము గురించి తెలుసుకున్నాను. భక్తులు పర్మమాత్మలో లీనం కావడానికి ఎటువంటి పరిచర్యలు చేయాలి " అని అడిగింది. పరమశివుడు " పార్వతీ ! దేవతలకు కాని మానవులకు కాని పరమాత్మ గురించి తెలుసుకోవడం అసాధ్యం. ఎందుకంటే సాంఖ్యము, యోగము రెండూ పరమాత్మ స్వరూపాలే. ఆ పరమాత్మను నేనే. నేను సనాతుడను, అవ్యయుడిని, సత్యమే నాస్వరూపము. నా దయలేనిది ఎవరూ నన్ను దర్శించలేరు. నన్ను చేరుకోవడానికి మంత్రము, జపము, నిరంతర పరమాత్మచింతన, స్తోత్రములు, నమస్కారములు ఇవన్నీ నిష్టతో చేసిన పరమాత్మను చేరుకోవచ్చును. పూర్వము నేను నాలుగు ఆశ్రమముల గురించి పాశుపత్రవ్రతము గురించి నలుగురు విప్రులకు బోధించాను. వారు దానిని తమ శిష్యులకు బోధించారు. అలా లోకమంతా వ్యాపించింది. సకల శుభములు కలగడడానికి, శుచిగా ఉండడానికి, నా స్వరూపమైన లింగార్చనకు నేను విభూతిని రూపొందించాను. యోగులు ఆ విభూతిని, శరీరము అంతా అలముకొని, కపాలము చేత బూని, తలగొరిగించుకుని, భిక్షాటన చేస్తూ, మనోనిగ్రహంతో మెలగుతూ, నా మీదనే మనసు నిలిపి, ఇతరకోరికల మీదకు మనసు పోనీయక పరమానందకరమైన అనుభూతిని అనుభవిస్తారు. కేవలం ఈ ప్రకారం సంగమును విడిచిన యోగులు నా సాయుజ్యమును పొందగలరు. నిరాకారంగా నిస్సంగంగా నన్ను పూజించుట కొరకు నేను మూడు లోకములలో ఏ ఆకారము లేని శివలింగాలను స్థాపించాను. ఆ లింగములను నా స్వరూపంగా పూజిస్తే నేను వారికి ప్రసన్నుడను ఔతాను. ఆ లింగములను ఎవరికి ఎలా తోచినట్లు అలా పూజ చేయవచ్చు. వారివారి శక్తిని అనుసరించి పూజించవచ్చు. పాలతో, నేతితో, నీటితో ఆ లింగములను అభిషేకించ వచ్చు. నాకు మారుగా ఆ లింగములను గంధము, పుష్పములు, ధూపము, దీపము, నైవేద్యము శక్తికి తగిన విధంగా ఆరాధించ వచ్చు. ఆ లింగములను పూజించిన నన్ను పూజించినట్లే.
*రేపు *
*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*
*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి