శ్రీరామ (16 )
( వాల్మీకి రామాయణం - 9 )
🙏 శ్రీరామ జయరామ జయజయరామ 🙏 సర్వే జనాః సుఖినో భవన్తు 🙏
(22-3-'26 ' సాయంత్రం ' పోష్టు తరువాయి భాగము)
శ్రీమహావిష్ణువు రామ ,లక్ష్మణ, భరత, శత్రుఘ్నులనే నాలుగు రూపములు ధరించి దశరథ మహారాజుకు పుత్రులుగా అవతరించాడు.
జగత్తంతా ఆనందంలో మునిగిపోయింది.
అయోథ్యా ప్రజలు ఉత్సవాలు చేసుకుంటున్నారు.
పదకొండు రోజులు గడిచినవి.
శ్లో// అతీత్యైకాదశాహం తు నామకర్మ తథాకరోత్/
జ్యేష్ఠం 'రామం' మహాత్మానం, "భరతం" కైకయీ సుతమ్/
సౌమిత్రిం "లక్ష్మణ" మితి "శత్రుఘ్న" మపరం తథా/
వసిష్ఠః పరమ ప్రీతో నామాని కురుతే తదా//
( పదకొండు దినముల తరువాత ఎంతో వేడుకతో దశరథ రాకుమారులకు నామకరణం జరిగింది.
పరమ ప్రీతితో రాజపురోహితుడైన వసిష్ఠుడు,
అందరిలోకి జ్యేష్ఠుడైన కౌసల్యా తనయునకు "రాముడు"
అని,
కైకేయి పుత్రునికి "భరతుడు" అని,
సుమిత్రా పుత్రులకు "లక్ష్మణుడు" "శత్రుఘ్నుడు"
అని నామకరణం చేశాడు.
ఆ తరువాత వారందరికీ దశరథమహారాజు,యథా కాలంలో "అన్నప్రాసన" "చౌలము" విద్యాభ్యాసము, "ఉపనయనము" మొదలైన సంస్కారములన్నీ యథావిధిగా జరిపించాడు.
బ్రహ్మచర్య దీక్షతో, వారందరూ అచిరకాలంలోనే సకల విద్యలు అభ్యసించారు.
శ్లో//సర్వే వేదవిదః శూరా స్సర్వే లోకహితే రతాః/
సర్వే జ్ఞానోప సంపన్నాః సర్వే సముదితా గుణైః//
(ఆ దశరథ పుత్రులందరూ వేదవేత్తలయ్యారు.
అందరూ గొప్ప శూరులు,యుద్ధనిపుణులూ అయినారు.
అందరూ జ్ఞాన సంపన్నులైనారు.
అందరూ సద్గుణములతో కూడిన వారయ్యారు.
అందరూ ప్రజల క్షేమమందు ఆసక్తులుగా ఉన్నారు)
వారికి దాదాపు పదహారు సంవత్సరాల వయస్సు వచ్చింది.
తండ్రి అయిన దశరధమహారాజు, పుత్రుల వివాహం జరిపిస్తే బాగుంటుందనుకున్నాడు.
ఒక రోజు, మంత్రులతోను, పురోహితులతోను, బంధువులతోను, ఆ విషయం చర్చిస్తున్నాడు.
సరిగ్గా అదే సమయంలో బ్రహ్మర్షి అయిన విశ్వామిత్రుడు అక్కడికి వచ్చాడు.
విశ్వామిత్రుని రాకకు ఆనందభరితుడైన దశరథుడు ఆ మహర్షిని అర్ఘ్య, పాద్య, ఆచమన, ఆసనాదులు సమర్పించి పూజించాడు.
"మీ రాకతో నా జన్మ ధన్యమైనది.
రాజర్షి అయిన మీరు సాటిలేని తపస్సు చేసి
"బ్రహ్మర్షి " అయ్యారు.
మీరు అన్నివిధాలా నాకు పూజ్యులు.
"మీరు వచ్చిన కార్యం ఎటువంటిదైనా నేను
నెరవేరుస్తాను " అని మాట ఇస్తున్నాను,
అన్నాడు దశరథుడు.
ఆ మాటలకు విశ్వామిత్ర మహర్షి చాలా సంతోషించాడు.
తాను కొన్ని నియమములు పాటిస్తూ చేస్తున్న ఒక యజ్ఞానికి, మారీచ,సుబాహువులనే ఇద్దరు రాక్షసులు విఘ్నం కలిగిస్తున్నారనీ,
యాగ నియమానుసారం తాను వారిపై కోపగించి శపించకూడదని,
అందువల్ల ఆ రాక్షసులను సంహరించడానికి. "రాముని" తనతో పంపమని కోరాడు.
అంతకుముందు విశ్వామిత్రుడు ఏమి అడిగినా ఇస్తానన్న దశరథ మహారాజు,
పుత్ర ప్రేమతోనూ, బాల్యంలో ఉన్న రాముడు రాక్షసులతో యుద్ధం చేయలేడనే ఉద్దేశంతోనూ, విశ్వామిత్రునితో రాముని పంపటానికి అంగీకరించ లేదు.
అప్పుడు విశ్వామిత్ర మహర్షి ,
"నీవనుకుంటున్నట్లు రాముడు సామాన్య మానవుడు కాదు" అన్నాడు.
శ్లో//అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమమ్/
వశిష్ఠశ్చ మహాతేజా యేచేమే తపసి స్థితాః//
(మహాత్ముడు, సత్యపరాక్రముడు అయిన రాముని గురించి నాకు తెలుసు. మహాతేజశ్శాలి అయిన వశిష్ఠ మహాఋషికి తెలుసు.ఈ సభలోనున్న ఇతర మహాఋషులకు తెలుసు).
రాముని తత్త్వం తల్లిదండ్రులయిన కౌసల్య, దశరధులతో సహా సామాన్యులెవరికి తెలియదు.
దుష్ట శిక్షణ, శిష్ట రక్షణలకు భూమి మీద అవతరించిన శ్రీ మహావిష్ణువే రాముడు అని,
యజ్ఞ యాగాదులు చేయడం, సంరక్షించడం, ఆ ధర్మరక్షణలోని భాగం అన్న విషయం కేవలము మహాఋషులకు మాత్రమే తెలుసు.
దండకారణ్యములో రావణాసురుడు సీతాదేవిని,అపహరించినప్పుడు కూడా,
శ్లో//ప్రహృష్టా వ్యధితాశ్చాసన్ సర్వే తే పరమర్షయః/
దృష్ట్వా సీతాం పరామృష్టాం దండకారణ్య వాసిన:/
రావణస్య వినాశం చ ప్రాప్తం బుద్ధ్వా యదృచ్ఛయా//
(దండకారణ్యములో ఉన్న మహర్షులు సీతాపహరణం చూచి బాధ పడ్డారు.అయితే అందువలన రావణుడి వినాశం సమీపించిందని సంతోషించారు)
ఈ విధంగా కేవలం ఋషులకు మాత్రమే రాముడి అవతార రహస్యం తెలుసు.
అందువల్ల వసిష్ఠ మహర్షి, ప్రతిజ్ఞా భంగం చేయరాదని దశరథుని హెచ్చరించి, విశ్వామిత్రుని ప్రభావం మహారాజుకు తెలియజేశాడు.
రామలక్ష్మణులను విశ్వామిత్రుని వెంట పంపమన్నాడు.
ఆ విధంగా వసిష్ఠమహర్షి నచ్చచెప్పిన తరువాత రామ,లక్ష్మణులను, దశరథుడు విశ్వామిత్రునితో పంపాడు.
ఒకటిన్నర యోజనముల దూరం నడచి సరయూనది దక్షిణ తీరం చేరుకున్న పిమ్మట, విశ్వామిత్ర మహర్షి పరమప్రీతితో రామునకు, "బల" ," అతిబల" అనే రెండు మంత్రాలను ఉపదేశించారు.
ఆ మంత్ర ప్రభావంతో, ఆకలిదప్పులు, శ్రమ, వ్యాధి మొదలైన వాటిని అధిగమించవచ్చు.
ఆరోజు రాత్రి తృణశయ్యలపై ఆ సరయూతీరంలో వారు శయనించారు.
రాత్రి గడచి తెల్లవారుచున్నది.
రామాయణం, ఉత్తమ గురు, శిష్య, సంప్రదాయం ఎలా ఉండాలో మనకు తెలియజేస్తుంది.
శిష్యుడు గురువు ఆజ్ఞానుసారం ప్రవర్తిస్తూ,గురుసేవ చేస్తూ, వినయంగా సందేహాలను విన్నవిస్తూ, గురువునుండి విద్యను గ్రహించాలి.
గురువు శిష్యులను కంటికి రెప్పలా కాపాడుతూ, క్షణ,క్షణము వారికి కర్తవ్యబోధ చేస్తూ, తాను నేర్చిన విద్యలన్నీ వారికి ఉపదేశించి ఉత్తములుగా తీర్చిదిద్దాలి.
తండ్రి ఆజ్ఞానుసారం రామ లక్ష్మణులు రాజకుమారులైనా పాదచారులై, కటిక నేలమీద శయనిస్తూ, గురువైన విశ్వామిత్రునికి శుశ్రూష చేశారు.
విశ్వామిత్రుడు శిష్యులను కంటికి రెప్పలా కాపాడుతూ, క్షణ,క్షణము వారికి కర్తవ్యబోధ చేస్తూ, తాను నేర్చిన విద్యలన్నీ వారికి ఉపదేశించి ఉత్తములుగా తీర్చిదిద్దాడు.
శిష్యులయెడ గురువుయొక్క కర్తవ్యాన్ని తెలియజేసే ఈ క్రింది శ్లోకం రామాయణ కావ్యానికి తలమానికం లాంటిది.
శ్లో// కౌసల్యా సుప్రజా రామా పూర్వా సంధ్యా ప్రవర్తతే/
ఉత్థిష్ఠ నర శార్దూల కర్తవ్యం దైవ మాహ్నికమ్//
( కౌసల్యాదేవి సుపుత్రుడవైన ఓ రామా ! ప్రాతస్సంధ్యాకాలం ప్రారంభమైనది.
ఓ నరశార్దూలా ! నిద్రనుండి మేల్కొనుము.
ఈ సంధ్యాసమయంలో చేయవలసిన దైవకార్యాలు నిర్వర్తించడం ఇప్పుడు నీ కర్తవ్యం)
ఈ విధమైన గురు, శిష్య, సంప్రదాయం సర్వ శ్రేయస్సులను మనకు ప్రసాదిస్తుంది.
(సశేషం)
శుభమస్తు,
తూములూరి మధుసూదనరావు,
23-3-'26.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి