🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹
*మంగళవారం 19 మే 2026*
*శ్రీ మహావిష్ణు పురాణం*
*93 వ భాగం*
*జగన్నాథ క్షేత్రం*```
పూర్వం శ్రీమన్నారాయణుడు మూర్తి (విగ్రహ) స్వరూపంలో లవణ సముద్రానికి ఉత్తరాన గల నీలాద్రి పర్వతం పై స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. ఇక్కడ మహావిష్ణువుకి దేవాలయాన్ని విశ్వకర్మ స్వయంగా నిర్మించాడు. పురుషులందరిలోను ఉత్తమ పురుషుడైన మహావిష్ణువు నివాసం కనుక ఈ క్షేత్రానికి పురుషోత్తమ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. శ్రీహరి యొక్క నివాసము కనుక రెండవ వైకుంఠం అని, భూలోక
వైకుంఠం అని పిలుస్తారు.
ఈ క్షేత్ర మహిమ వర్ణించడం బ్రహ్మకు కూడా సాధ్యం కాదు. ఇక్కడ శ్రీమహావిష్ణువుకి లక్ష్మీదేవి స్వయంగా వండి భోజనం పెడుతుంది అంటారు. స్వామి ఆరంగించగా మిగిలిన శేషాన్ని ప్రసాదంగా పెట్ఠేవారు.
ఆ ప్రసాదం వర్ణ కుల భేదం లేకుండా జనులందరు ఆరగించే వారు. ప్రజలందరు తిని పాపాలు పోయి పుణ్యాత్ములు అయి స్వర్గానికి పోతుండటంతో స్వర్గం నిండి పోయింది. దేవతలందరు విష్ణుమూర్తి వద్దకు వెళ్లి సమస్య చెప్పి పరిష్కారం చూపమని ప్రార్ధించారు.
మహావిష్ణువు దేవతల ప్రార్ధన పై తన స్వయంభువ విగ్రహాన్ని క్షేత్రం నుండి లవణ సముద్ర తీరం అడుగున దాచాడు. ఉత్కళ దేశాన్ని పాలించే ఇంద్రద్యుమ్న మహారాజు శ్రీమహావిష్ణువు మూర్తిని పునఃప్రతిష్టించాలని సంకల్పించి స్వామి మూర్తి కోసం తపోదీక్ష చేశాడు. శ్రీమహావిష్ణువు కలలో కనిపించి సముద్ర తీరాన వనాలలో ఉండే వృక్షములతో బలభద్ర, జగన్నాథ, సుభద్ర మూర్తులను తయారు చేసి ప్రతిష్టించమని చెప్పాడు. సముద్ర తీరానికి వెళ్లి వెతుకు తున్న మహారాజుకి బ్రాహ్మణ రూపంలో విశ్వకర్మ వచ్చి తాను తగిన వృక్షాలతో మూర్తులను తయారు చేసి ఇస్తాను అని చెప్పి బలభద్ర జగన్నాథ సుభద్ర మూర్తు లను తయారు చేసి ఇచ్చాడు.
ఇంద్రద్యుమ్న మహారాజు దేవాలయం పై శ్రీహరి సుదర్శన చక్రం కూడా ప్రతిష్టించాలని సంకల్పించి నిరాహారుడై కటిక నేలపై ధ్యాన దీక్షలో కూర్చు న్నాడు. నారాయణుడు రాత్రి కలలో బ్రాహ్మణ రూపంలో కనిపించి "రాజా! నీలగిరిలో దేవాలయం నిర్మించినపుడు అక్కడ నివసించే ఒక సర్పము సముద్రతీరానికి పారిపోయి అక్కడే చనిపోయింది. దాని తలపై ఉన్న మణి అక్కడే తీరంలో పడి ఉంది. ఆ మణి తెస్తే చక్రం తయారవుతుంది.
ఆ చక్రం దేవాలయం పై స్థాపిస్తే ఆలయం నిర్మాణం పూర్తి అవుతుంది" అని చెప్పి అదృశ్యమయ్యాడు.
మరుసటి రోజు ఉదయం ఇంద్రద్యుమ్న మహారాజు సముద్ర తీరానికి వెళ్లి వెతకగా మణి కనిపించింది. నీలవర్ణములో ప్రకాశిస్తున్న మణిని భూమి నుండి తీసుకుని వెళ్ళదామని ప్రయత్నిస్తే ఎవరూ దానిని ఎత్తలేక పోయారు. మహారాజు మహావిష్ణువుని ధ్యానించాడు.
ఒక బ్రాహ్మణ బ్రహ్మచారి అక్కడికి వచ్చి "మహారాజా! నేను ఆ మణి పై కూర్చుంటే,
ఆ మణి తనంతతానే లేచి ఆలయం వద్దకు వస్తుంది" అని చెప్పాడు. మహారాజు అది భగవంతుని సందేశం అని అంగీకరించాడు. మణిపై పట్టువస్త్రము పరచి బ్రహ్మచారి కూర్చోగానే ఆ మణి లేచి కదిలి దేవాలయం వరకు వచ్చింది. కానీ దేవాలయం దగ్గరకు రాగానే మణి, దానిపై కూర్చున్న బ్రాహ్మణ బ్రహ్మచారి ఇద్దరు అదృశ్యమయ్యారు.
ఇంద్రద్యుమ్నుడు నిరాశ చెంది నిరాహారియై అక్కడే దర్భశయ్య పై నిదురించాడు. నారాయణుడు నిద్రలో కనిపించి "రాజా! బ్రాహ్మణ బ్రహచారి మణితో చక్రం తయారుచేసి ఉదయాన్నే పంపుతాడు. చింతించకు. చక్ర ప్రతిష్టాపనకు ఏర్పాట్లు చేయుము" అని అదృశ్య మయ్యాడు.
మరుసటి రోజు ఉదయం మహారాజు మంత్రి పరివారంతో దేవాలయం వద్దకు వెళ్లగా ముఖ ద్వారం వద్ద చక్రముతో ఒక వ్యక్తి వేచివున్నాడు.మంగళవాయి
ద్యాలు, శంఖనాదాల మధ్య దేవాలయంపై నీలమణి చక్రం ప్రతిష్టించబడింది. పెద్ద ఉత్సవం ఇంద్రద్యుమ్న మహారాజు జరిపాడు. దేవాలయం పై గల చక్ర మహిమ నారద పురాణంలో చెప్పబడింది.
జగన్నాథ క్షేత్రంలో మార్కండేయం, ఇంద్రద్యుమ్నం, రోహిణి కుండం, శ్వేతకుండం, సముద్ర తీరం మొదలైన పుణ్య తీర్థాలు ఉన్నాయి. ఈ తీర్థాలలో స్నానం చేసి త్రిమూర్తులను పూజించి వటవృక్షాన్ని, మార్కండేయుని, యముని, హనుమంతుని, పాతాళేశ్వరుని, లక్ష్మీదేవిని, విమలాదేవిని దర్శించాలి. సముద్రతీరంలో తీర్థ శ్రాద్ధం చేయాలి.
ఈ విధంగా చేసినవారు పునర్జన్మ పొందకుండా వైకుంఠం చేరి మోక్షము పొందుతారు. జగన్నాథ క్షేతంలో పన్నెండు నెలలలో పదమూడు యాత్రలతో సందడిగా ఉంటుంది. వీటిలో చైత్ర మాసంలో జరిగే వారుణి యాత్ర, వైశాఖంలో జరిగే చందన యాత్ర, జేష్ఠ మాసంలో జరిగే అభిషేక యాత్ర, ఆషాఢంలో జరిగే రథయాత్ర, కార్తీకంలో జరిగే దామోదర యాత్ర, మాఘమాసంలో జరిగే మకర యాత్ర ముఖ్యమైనవి. ఫాల్గుణ మాసంలో డోలోత్సవము జరుగుతుంది.
రథయాత్రలో ఉన్న బలభద్ర స్వామిని దర్శించిన సంతానం లేనివారికి సంతానం కలుగుతుంది. ఈ క్షేత్రంలో చేసిన దానధర్మాలు కోటి రెట్ల ఫలం ఇస్తుంది.
*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*
*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*
*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది
*సేకరించి*
*భాగస్వామ్యం చేయడమైనది*
*న్యాయపతి నరసింహారావు*
🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి