అష్టాదశ పురాణాలు - శ్రీ మత్స్య మహాపురాణం - కౌశిక పుత్రుల కథ - బ్రహ్మదత్తుడి చరిత్ర - ముప్పై రెండవ భాగం
__________________________________________________
తీవ్రమైన అనావృష్టిలో ఆకలితో అలమిటిస్తున్న కౌశికుని పుత్రులు ఏడుగురు "మేపడానికి తీసుకువచ్చిన గురువు గర్గ మహర్షి ఆవు దూడలలో ఆవుని చంపి ఆకలి తీర్చుకుందామని, గురువు గారికి ఆవును అడవిలో పులి చంపి తినేసిందని చెప్పి దూడను ఇచ్చేదామని" నిర్ణయించుకున్నారు.
కడపటి వాడైన పితృవర్తి "గోహత్య మహాపాతకం, వద్దని చెప్పినా అన్నలు ఆరుగురు వినకపోవడంతో అలోచించి "అన్నల్లారా! గోవుని చంపక తప్పని పరిస్థితిలో పితృశ్రాద్ధము చేద్దాం. పితరుల శ్రాద్ధంలో గోవధ పాపం మనకంటదు" అని చెప్పడంతో సరేనని అన్నలు ఆరుగురుఅంగీకరించారు.
పితృవర్తి పితృశ్రాద్ధ కార్యం ఆరంభించి విశ్వదేవతల స్థానంలో ఇద్దరిని, పితరుల స్థానంలో ముగ్గురిని, అతిథిగా ఒకరిని చేశాడు. తను శ్రాద్ధకర్త అయ్యి మంత్రపూర్వకంగా భక్తితో శ్రాద్ధం నిర్వహించాడు. ఆవుని చంపి ఆవుమాంసం పితరులకు అర్పించి, తాము ప్రసాదంగా స్వీకరించి ఏడుగురు అన్నదమ్ములు క్షుద్బాధను తీర్చుకున్నారు.
ఆశ్రమానికి తిరిగి వెళ్లి దూడను గురువుగారికి అప్పగించి "అడవిలో పులి దాడి చేసి ఆవుని చంపివేసింది. దూడను రక్షించి తీసుకువచ్చాము" అని అసత్యం పలికారు. గురువు గారైన గర్గాచార్యుడు వారిని చెప్పినది విశ్వవించాడు.
సమయం గడచి పోయింది. ఏడుగురు కౌశికుని కుమారులు కాలధర్మం ననుసరించి మరణించారు. మరుసటి జన్మలో దాశపురంలో బోయలుగా జన్మించారు. పితృశ్రాద్ధం భక్తి శ్రద్థలతో జరపడం వలన వారికి పూర్వజన్మ జ్ఞానము మరచిపోకుండా గుర్తుంది. వారు "శ్రాద్ధకర్మ చేసినా క్రూరకర్మ కావడంతో ఈజన్మలో జంతువులను వేటాడే బోయలుగా జన్మించాము" అని తెలుసుకున్నారు.
పూర్వజన్మలో చేసిన క్రూరకర్మకు పశ్చాత్తాపం చెంది విరక్తులై నిరాహార దీక్ష చేసి బోయ శరీరాలను పరిత్యాగం చేశారు. మరుసటి జన్మలో ఏడుగురు కాలంజర పర్వత అడవులలో జాతిస్మృతి అనగా పూర్వజన్మల జ్ఞానము గల మృగాలుగా జన్మించారు. ఈ జన్మలో కూడా జ్ఞాన వైరాగ్యాలతో శివుని కొలుస్తూ ధర్మబద్దంగా జీవించి మరణించారు.
తరువాత జన్మలో యోగనిష్ట గల చక్రవాక పక్షులుగా మానస సరస్సులో జన్మించారు. వారిలో ముగ్గురు విహరిస్తూ పాంచాలదేశంలోని ఉద్యానవనం చేరారు. అదే సమయంలో పాంచాల రాజు విభ్రాజుడు తన రాణులతో విహరిస్తూ సరోవరంలో జలక్రీడలు ఆడుతున్నాడు. చక్రవాక పక్షిగా ఉన్న పితృవర్తి ఆ రాజుని, అనుభవిస్తున్న రాజవైభోగాలను చూసి వచ్చే జన్మలో తను రాజుగా పుట్టాలని కోరుకున్నాడు.
మిగిలిన ఇద్దరు మహాబలం వాహనాదులు గల మంత్రులను చూసి మరుసటి జన్మలో మంత్రులుగా పుట్టాలి అనుకున్నారు. మానస సరోవరం వద్ద ఉన్న మిగిలిన నలుగురు ఏ కోరికలు లేకుండా భక్తితో భగవంతుని సేవించారు. కాల పరిభ్రమణంలో ఏడుగురు చక్రవాక పక్షి జన్మలు ముగించి మరణించారు.
రాజుగా జన్మించాలని కోరుకున్న పితృవర్తి పాంచాల రాజు విభ్రాజునికి కుమారుడిగా జన్మించాడు. బ్రహ్మదత్తుడు అనే నామంతో ప్రసిద్ధి చెందాడు. మంత్రులుగా పుట్టాలనుకున్న ఇద్దరు విభ్రాజుని మంత్రికి కండరీక, సుబాహులు అనే పేర్లతో పుత్రులుగా జన్మించారు. ఏ కోరికలు లేకుండా మరణించిన మిగిలిన నలుగురు బ్రాహ్మణులుగా జన్మించి ద్విజోత్తములు అయ్యారు.
విభ్రాజుని తరువాత బ్రహ్మదత్తుడు రాజుగా పట్టాభిషిక్తుడు అయ్యాడు. కండరీక సుబాహులు బ్రహ్మదత్తుడికి మంత్రులు అయ్యారు. బ్రహ్మదత్తుడు సకల శాస్త్రాలలో నిష్ణాతుడు, పరాక్రమశాలి, బలవంతుడు, యోగవేత్త కావడమే కాకుండా విష్ణుమూర్తి అనుగ్రహంతో సమస్త ప్రాణుల (మృగ జంతు పశు పక్ష్యాదుల) బాషలు తెలిసిన నిపుణుడు అయ్యాడు.
శ్రాద్దకార్యంలో చంపబడిన కపిల గోవు (ఆవు) దేవలుడనే రాజుకు 'సన్నతి' అని కుమార్తెగా జన్మించి బ్రహ్మదత్తునికి భార్య అయ్యింది. బ్రహ్మదత్తుడు భార్యతో చక్కని దాంపత్యం చేస్తూ ధర్మబద్దంగా రాజ్య పాలన చేస్తున్నాడు. ఒకనాడు రాజదంపతులు ఇద్దరు ఉద్యానవనంలో విహరిస్తున్నారు. పక్షులు క్రిమి కీటకాదుల భాష తెలిసిన బ్రహ్మదత్తునికి వనంలో పోట్లాడుకుంటున్న చీమల దంపతుల సంభాషణ వినిపించింది.
కోపంతో ఉన్న భార్య చీమను భర్త కోపం వదలమని అనేక విధాలుగా పొగడుతూ బ్రతిమాలుతున్నాడు. భార్య చీమ కోపంగా చూస్తూ "నిజంగా నామీద ప్రేమ ఉన్నవాడివే అయితే నిన్న నీవు సంపాదించిన లడ్డుపొడిని వేరే ఆడ చీమకు ఎందుకు ఇచ్చావు!" అని అడిగింది. దానికి భర్త చీమ "నన్ను క్షమించు! ఆ చీమ అచ్చం నీలాగే ఉంది. నీవే అనుకుని ఇచ్చాను. వేరే ఉద్దేశం ఏమి లేదు. ఇంకెప్పుడూ చేయను" అని కాళ్లు పట్టుకుని బ్రతిమాలాడు. భార్య చీమ కోపం వదలి ప్రసన్నురాలైంది. ఇద్దరు కలసి ఆనందంగా చీమల పుట్టలోకి వెళ్లి పోయారు.
విష్ణువు అనుగ్రహం వలన సమస్త ప్రాణుల సంభాషణలు తెలిసిన బ్రహ్మదత్తుడు ఆ చీమల సంభాషణలు విని ఆశ్చర్యం చెందాడు.
శౌనకాది మునులు సూత మహర్షి భాషణం ఆపి "మహర్షీ! సకల జీవుల సంభాషణలు వినే విద్య బ్రహ్మదత్తుడు ఎలా పొందగలిగాడు. బ్రాహ్మణులుగా పుట్టిన నలుగురు కౌశిక పుత్రులు ఏం చేశారు? ఏమయ్యారు?" అని అడిగారు.
రేపటి భాగంలో ఆ కధ చదువుదాం.
మీ అమూల్యమైన స్పందన కోరుతూ.
మీ
శ్రీకాంత్ గంజికుంట కరణం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి