శ్రీరామ ( వాల్మీకి రామాయణం - 21)
🙏 శ్రీరామ జయరామ జయజయరామ 🙏
సర్వే జనాః సుఖినో భవన్తు 🙏
(30-3-'26 పోష్టు తరువాయి భాగము)
శ్రీరాముడు పరశురాముని చేతిలోని వైష్ణవ ధనస్సును గ్రహించి, బాణం సంధించగానే జగత్తంతా కంపించింది.
ధనస్సును ఎక్కుపెట్టి, శరాన్ని సంధించి,
కోపంతో రాముడు ఇలా అన్నాడు.
"ఓ పరశురామా! నీవు బ్రాహ్మణుడవగుట చేతను,
విశ్వామిత్రునకు బంధువు వగుట చేతను,
నాకు పూజ్యుడవు.
అందువలన, నీ ప్రాణములు హరించేందుకు ఈ శరాన్ని, ప్రయోగింపజాలను.
శ్లో//ఇమాం పాదగతిం రామ తపోబల సమార్జితాన్/
లోకా న ప్రతిమాన్వా తే హనిష్యామి యదిచ్ఛసి//
(భార్గవరామా! నీ పాదగమన శక్తిని గాని,
తపోబలముతో నీవు సంపాదించుకున్న,సాటిలేని ఉత్తమ లోకములను గాని,
ఈ బాణముతో కొట్టివేసెదను.
నీకు ఏది ఇష్టమో చెప్పుము).
దివ్యమైన ఈ వైష్ణవ శరము వ్యర్ధమగుటకు వీలు లేదు.
శ్లో//వరాయుధ ధరం రామం ద్రష్టుం సర్షిగణాఃసురాః/
పితామహం పురస్కృత్య సమేతా స్తత్ర సంఘశః//
గంధర్వాప్సరసశ్చైవ సిద్ధ చారణ కిన్నరాః//
యక్ష రాక్షస నాగాశ్చ తద్ద్రష్టుం మహదద్భుతమ్//
అది ఒకఅద్భుత సన్నివేశం.
శ్రీ మహావిష్ణువు తన స్వంత ధనస్సును, మానవుడుగా ధరించడం,అనే దివ్య సన్నివేశం.
విష్ణుధనస్సు ధరించి, తాను స్వయంగా విష్ణువునేనని చెప్పకుండా చెబుతున్న ఆ రాముని చూడడానికి,
అప్పుడు సాక్షాత్తు బ్రహ్మదేవుడు వచ్చాడు.
" పుంసాం మోహన రూపాయ" (పురుషులను కూడా మోహింపజేసే అందమైన రూపం కలవాడు రాముడు).
వైష్ణవ ధనస్సును ధరించిన ఆ రాముని దివ్యమంగళ రూపాన్ని చూడటానికి,
దేవతలు, ఋషులు, గంధర్వులు, అప్సరసలు, సిద్ధులు, చారణులు, కిన్నరులు,యక్షులు, రాక్షసులు, నాగులు, మొదలైనవారు గుంపులు గుంపులుగా అక్కడకు చేరుకున్నారు.
శ్రీరాముడు వైష్ణవ ధనస్సును స్వీకరించగానే, అవతార ప్రయోజనము పూర్తి అయిన పరశురాముడు నిర్వీర్యుడైనాడు
శ్లో// జడీకృతే తదా లోకే రామే వర ధనుర్ధరే/
నిర్వీర్యో జామదగ్న్యో౽సౌ రామో రామ ముదీక్షత//
(రాముడు, శ్రేష్ఠమైన ఆ ధనస్సును ఎక్కుపెట్టగానే, అత్యంత ప్రభావంతో కూడిన ఆ దివ్య వైష్ణవ శరమును చూచి లోకమంతా భయపడి, స్తంభించి పోయింది.
పరశురాముడు నిర్వీర్యుడు అయిపోయినాడు.
ఆయన రామునివంక అత్యాశ్చర్యముతో చూచాడు).
ఆయనకు జ్ఞానోదయం అయింది.
ధర్మరక్షణకు అవతరించిన శ్రీ మహావిష్ణువే రాముడని పరశురాముడు అప్పుడు గ్రహించాడు.
రామునకు నమస్కరించాడు.
శ్లో//అక్షయ్యం మధుహన్తారం జానామి త్వాం సురేశ్వరమ్/
ధనుషో౽స్య పరామర్శాత్ స్వస్తితేస్తు పరంతప//
(ఈ ధనస్సును గ్రహించుటవల్ల, నీవు అక్షయుడవు, మధువు అనే రాక్షసుని సంహరించిన వాడవు, సర్వదేవతలకు ఈశ్వరుడవు అయిన శ్రీమహావిష్ణువు వని తెలుసుకొన్నాను. ఓ పరంతపా! నీకు స్వస్తియగుగాక.)
త్రిలోకనాధుడవైన నీ చేత నిర్జింపబడటం వల్ల నేను సిగ్గుపడటం లేదు.
అదృష్టంగా భావిస్తున్నాను.
ఈ భూమిని కశ్యపునకు దానమిచ్చినందున నేను మహేంద్ర పర్వతముపై నివసిస్తున్నాను.
నేను అక్కడకు వెళ్ళాలి. అందువల్ల నా గమన శక్తిని నశింపజేయవలదు.
నీ బాణం ప్రయోగించి నేను తపశ్శక్తితో సంపాదించిన పుణ్యలోకాలు నశింపజేయుము,అన్నాడు.
బ్రహ్మజ్ఞానికి, పుణ్యము పాపము, రెండూ ఉండకూడదు కాబట్టి, పరశురాముని కోరిక ప్రకారము, రాముడు ఆ పుణ్యలోకాలనన్నింటినీ బాణప్రయోగంతో నశింపజేశాడు.
పరశురాముడు, దశరథ రాముని స్తోత్రం చేసాడు.
ప్రదక్షిణము చేసి మహేంద్రపర్వతానికి వెళ్ళిపోయాడు
చీకటి తొలగి దిక్కులన్నీ ప్రకాశించినవి.
విష్ణుధనస్సును ధరించిన రాముని దేవతలు,ఋషులు స్తుతించారు.
శ్లో// గతే రామే ప్రశాంతాత్మా రామో దాశరథిర్ధనుః/
వరుణాయాప్రమేయాయ దదౌ హస్తే ససాయకం//
(ప్రశాంత మనస్సుతో కూడిన రాముడు, పరశురాముడు వెళ్లిన వెంటనే, ఆ ధనస్సును, బాణమును, అప్రమేయ ప్రభావంగల వరుణునకు ఇచ్చివేసెను).
శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష.
ఓం శాన్తి శ్శాన్తి శ్శాన్తిః
(సశేషం)
శుభమస్తు.
తూములూరి మధుసూదనరావు.
31-3-'26.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి