17, ఫిబ్రవరి 2026, మంగళవారం

సమాజ అధోగమనము*

 *సమాజ అధోగమనము


మన దేశానికి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు, స్వపరిపాలన వచ్చి 77 సంవత్సరాలు అయినది. విద్య, వైద్య, ఆర్థిక, సాంకేతిక మరియు రక్షణ రంగాలలో అభివృద్ధి పరంగా ఎంతో ఎదిగాము. *కాని, నైతికంగా ఎదగవలసినంతగా మనము ఎదగలేదు.* ప్రలోభాల ప్రభావాలను అధిగమించే తత్వాన్ని అలవరచుకొలేకపోతున్నాము, ఇంకా చెప్పుకుంటాము ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం భారత దేశమని. కాని *స్వార్థ పరంగా, దోషులను సమర్థించడంలో మరియు నేరస్తులను ఉపేక్షించడంలో నియమిత ఎల్లలు, హద్దులు దాటి ఎదిగాము*. 


రాజకీయ నాయకులు, ఇతర రంగాలలో ఉన్న ప్రముఖులు, పార్టీలు గాని అవకతవకలకు పాల్పడినప్పుడు వారి ప్రధమ మరియు ప్రధాన ఆయుధము *మతము, కులము, లింగ బేధం, ఉత్తరాది, దక్షిణాది వాదనలు*. గత వింశతి (20) సంవత్సరాలుగా దేశ చరిత్రను పరిశీలించిన వారికి, దోషభూయిష్టులైన ఏ ఏ నాయకులు, ఇతర రంగాలలోని ప్రముఖులు దేశ స్వతంత్రతను, ప్రజాస్వామ్యాన్ని కవచంగా వాడుకున్నారో అన్ని కరతలామలకములే, అభిజ్జానములే. 


సావకాశంగా సంఘటనలు పరిశీలిస్తే ఒక నాయకుడంటాడు నేను మైనారిటీ మతం వాడిని నన్ను బలి పశువును చేస్తున్నారు అని. ఇంకొక ప్రముఖుడంటాడు నేను వెనుకబడిన తరగతుల వాడిని కాబట్టి నాపై కక్ష్య కట్టారు అని. ఇంకొక ప్రముఖురాలంటుంది నేను మహిళను కాబట్టి నేరం ఆపాదిస్తున్నారు అని. రాజకీయ నాయకుల దుర్మార్గాలు, దుష్చేష్టలు, దురలవాట్లు బైటపడ్డప్పుడు, ఆ పార్టీ వాళ్ళు వందలకొద్దీ ధర్నాలు, సమ్మెలు. రక్షక భట శాఖ *నిందితులను* న్యాయస్థానాల వైపు తరలిస్తున్నప్పుడు, ఏ మాత్రం *న్యూనత* లేకుండా త్వరలో జనంలోకి వస్తామని చేతులూపుతూ నిర్బంధశాలలకు వెళ్తుంటారు. *తప్పులు చేసినా దోష భావన ఎక్కడా ప్రతిబింబించదు* ప్రతి రాజకీయ పార్టీకి అండ దండగా వారి సమాచార (పత్రిక, Tv) మాధ్యమాలు ఉంటాయి. అందులో పని గట్టుకుని ప్రభుత్వాన్ని విమర్శించడం మరియు ప్రత్యర్థులను నిందించడం మామూలైపోయింది. పార్టీల బేధం ఉన్నప్పుడు దక్షిణాది వారు ఉత్తరాది వారిని, ఉత్తరాది వారు దక్షిణాది వారిని విమర్శించడం సర్వ సాధారణమైనది. తమ తప్పులను సమర్థించుకోవడానికి మతాన్ని, కులాన్ని, వర్గాన్ని లింగాన్ని సమర్థవంతంగా వాడుకుంటూ రాజకీయ వ్యక్తిగత లాభాలను పొందడానికి నిస్సిగ్గుగా వాడుకుంటున్నారు. *మనమందరము భారతీయులము అను జాతీయ భావం నాస్తి*. ఇన్ని రకాల స్వభావాల మధ్య జాతి ఐక్యత వర్ధిల్లాలి అంటే హిమాలయాల అధిరోహణా సామర్థ్యము కావాలేమో. *అధిక శాతం* పౌరులు *నైతికతను మరుగు పర్చుకుంటున్నారే తప్ప, మెరుగు పరుచుకోవడానికి ప్రయత్నించడం లేదు. నైతికత, సత్య సంధ్యత*

*అలవర్చుకునే ప్రయత్నం చేయాలి*, ఎందుకంటే అధికులలో *అది లోపించింది కాబట్టి*.


దేశాభివృద్ధిని సాధిస్తూ అధిక శాతం ప్రజల చేత *స్వదేశంలోనే గాకుండా విశ్వ వ్యాప్తంగా మన్నన* పొందుతూ ఉన్న నాయకులు కొందరైతే, *భారత దేశానికి ఆయువు పట్టైన హైందవాన్ని ద్వేషిస్తూ, సరిహద్దులు దాటి దేశంలో ప్రవేశించే విదేశస్తులను ప్రోత్సహిస్తూ, విదేశాలలో దేశ పరువు తీస్తూ నాయకులనిపించుకునే వారు ఇంకొందరు.* 


ఒక్కొక్కసారి భారత ప్రజలకు (సామాన్యులు మరియు మాన్యులు) అనుమానం వస్తుంది నిజమైన ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక నైతిక అంధకారంలో ఉన్నామా అని. నేరస్తులైన నాయకులు, ప్రముఖుల విషయంలో ప్రజా స్పందన ఎలా ఉండాలంటే *పరువు తక్కువ వెధవా నేరం నుండి నిర్దోషిగా విడుదల అయ్యేవరకు మా వైపు రావద్దు*. ఎవరైనా చూస్తే మా పరువు పోతుందని భయం కాదు, *మా మనః సాక్షి ఒప్పుకోదు నీలాంటి నిదితులతో బంధం అని కరాఖండిగా చెప్పాలి. చెప్పగలిగే ధైర్యమే నిజాయితీ*. ఇంకా చెప్పాలంటే ఈలాంటి నిందితులకు శిక్ష పడిన తర్వాత సమాజం దూరం ఉంచాలి, ప్రముఖ స్థానాలకు అనర్హులను చేయాలి. *నిజాయితీగా జీవిద్దాము, దోషులను చట్టానికి అప్పగిద్దాం*


.

కామెంట్‌లు లేవు: