17, ఫిబ్రవరి 2026, మంగళవారం

మంచి మనుష్యులుగా మెలుగుదాము*

 *మంచి మనుష్యులుగా మెలుగుదాము*




మనిషి స్వభావం 

అతని చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది. కొంత మందిని చూస్తే ఎప్పుడూ కోపంగా, గంభీరంగా, మొహం ముడిచేసి ఉంటారు. 


అలాంటి వారి దగ్గరకు వెళ్లాలంటే చాలామందికి భయం మరియు చిరాకు వేస్తుంది. తమ బాధను చెప్పుకోవాలనిపించినా, సమస్యను పంచుకోవాలనిపించినా, వారి దగ్గరకు వెళ్లడానికి మనసు ఒప్పుకోదు. ఎందుకంటే వారు కఠినంగా కనిపిస్తారు. 


అలాంటి స్వభావం వల్ల ఇతరులు *వారి* నుండి దూరంగా వెళ్లిపోతారు. *వారితో* ప్రేమ, అనుబంధం, స్నేహం ఇవన్నీ తగ్గిపోతాయి.


మనిషి జీవితం ఒంటరిగా గడవడానికి కాదు. మనం అందరం ఇతరులతో కలిసిమెలిసి, ఒకరికి ఒకరం తోడుగా ఉండడానికే పుట్టాం. 


ఒక మంచి వ్యక్తి అంటే తన దగ్గరకు వచ్చినవారు సంతోషంగా తిరిగి వెళ్లేలా ఉండాలి. తన వద్దకు వెళ్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అని అనిపించాలి. తనతో మాట్లాడితే మనసుకు తేలిక అవుతుంది అనిపించాలి. అలాంటి వ్యక్తి సమాజంలో అందరికీ అవసరమవుతాడు.


ఎవరైనా తమ బాధను చెప్పుకోవడానికి ఒక చోటు కావాలి. మనిషి జీవితంలో ఎన్నో కష్టాలు, బాధలు, సందేహాలు ఉంటాయి. ఆ సమయంలో ఒకరు సహాయం చేస్తే, ఓదార్పు మాట చెప్పితే, ఆ మనిషి మనసు ఎంతో తేలిక అవుతుంది. 


అందుకే మనం ఎప్పుడూ చిరునవ్వుతో, ప్రశాంతంగా, ఓపికగా ఉండాలి. మన మాటలు మృదువుగా ఉండాలి. అప్పుడు మన దగ్గరకు వచ్చినవారు భయపడకుండా తమ సమస్యలను చెప్పుకుంటారు.


 సమాజంలో ఎవరైనా ఈ వ్యక్తి దగ్గరకు వెళ్తే నాకు ఏదో ఒక మంచి సలహా దొరుకుతుంది అని అనుకునేలా ఉండాలి. 


*అంతేగాని ఈ సమాజంతో నాకేమి పని. నాకున్నది చాలు, నా వాళ్ళు నాకున్నారు* అని అనుకోరాదు.


మంచి మనుషుల చుట్టూ ఎప్పుడూ మనుషులు ఉంటారు. వారి దగ్గర ప్రేమ, నమ్మకం, గౌరవం పెరుగుతాయి.

ఎప్పుడూ కోపంగా, కఠినంగా కనిపించడం వల్ల వారికి ఇతరులకు దూరం ఏర్పడుతుంది. మనిషి ముఖంలో చిరునవ్వు ఉంటేనే దగ్గరకు రావాలనిపిస్తుంది. 


ఒక మంచి మాట, ఓదార్పు చూపు, ఓపికగా వినే స్వభావం ఇవే మనిషిని గొప్పవాడిగా చేస్తాయి. ఎవరి సమస్య అయినా శ్రద్ధగా విని, తాను తెలిసినంతలో మార్గం చూపితే, అతను అందరికీ ఆప్తుడవుతాడు.


మన దగ్గరకు వచ్చినవారికి సాంత్వన ఇవ్వాలి. కొన్నిసార్లు పరిష్కారం ఇవ్వలేకపోయినా, వారి మాటలు ఓపికగా వినడం కూడా ఒక పెద్ద సహాయమే. 


మనతో కాసేపు కూర్చుంటే వారికి కొత్త విషయాలు తెలుస్తే, మంచి ఆలోచనలు వస్తే, అది మన జీవితానికి గొప్ప అర్థం ఇస్తుంది. 


మన సాంగత్యం వల్ల ఎవరికైనా మంచి మార్గం కనిపిస్తే, అంతకంటే గొప్ప సంతోషం మరొకటి లేదు.


అలాగే మన ప్రవర్తన ప్రేమతో, కరుణతో నిండివుండాలి. కోపం వచ్చినా అదుపులో పెట్టుకోవాలి. ఇతరులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అప్పుడు మనం కేవలం ఒక మనిషిగా కాకుండా, అందరికీ అవసరమైన వ్యక్తిగా మారాలి.


ఒక మనిషి జీవితంలో గొప్పదనం అతని సంపదలో కాదు, అతని హృదయంలో ఉంటుంది. తన దగ్గరకు వచ్చినవారికి ధైర్యం ఇవ్వగలగడం, సమస్యలకు మార్గం చూపగలగడం ఇవే నిజమైన గొప్పతనం. 


అలాంటి వ్యక్తిగా తయారవ్వడం ప్రతి మనిషి లక్ష్యంగా ఉండాలి. అప్పుడు మన చుట్టూ ఉన్నవారు మన దగ్గరకు రావడానికి ఇష్టపడతారు, మన మీద నమ్మకం పెంచుకుంటారు, 

మనతో ఉండడం ద్వారా సంతోషాన్ని పొందుతారు.


*కొందరు పని గట్టుకుని తమ స్థాయిలను మర్చి ఇతరులను అదేపనిగా విమర్శిస్తుంటారు* ఇది ఆత్మహత్య సదృశ్యము.


అందుకే ప్రతి ఒక్కరు హృదయం తెరిచిన మహర్షిలా ఉండాలి, విచ్చుకున్న గులాబి (పువ్వు) సుగంధ హృదయలా ఉండాలి. ప్రతి ఒక్కరు అందరిని (తోటి వారిని) ఆహ్వానించాలి హృదయంలోకి. 


మన మంచితనాన్ని విస్తృత స్థాయిలో సమాజానికి అందించాలన్నా, పంచాలన్నా సంస్థలలో చేరుదాము. అవుతే, సంస్థలలో చేరి నిమిత్తమాతృలుగా ఉండరాదు, క్రియాశీలంగా ఉండాలి. సంస్థల కార్యక్రమాలను అభిమానిద్దాము, సంస్థల అభివృద్ధికి సహకరిద్దాము.


ధన్యవాదములు

*(సేకరణ)*

.

కామెంట్‌లు లేవు: