*దేవాలయాలు - పూజలు 10*
*ఉషోదయ కాలంలోనే అర్చక స్వాముల వారు ప్రాతః సంధ్య పూజకై దేవాలయ ప్రవేశం చేసి గణేశ ప్రార్థన శుక్లాంబరధరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే*
పఠన అనంతరము ,
మూల మూర్తి *శుద్ధికై* స్వామి వారిపై జలము చిలకరిస్తూ
*ఓం అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపివా, యఃస్మరేత్ పుండరీకాక్షం, సబాహ్యఅభ్యంతర శుచిః, పుండరీకాక్ష నమః, పుండరీకాక్ష నమః, పుండరీ కాక్షాయ నమః*.
ఆ తదుపరి గర్భాలయ శుద్ధిలో భాగంగా దిగువ మంత్రం చదువుతూ..
*ఉత్తిష్టంతు భూత పిశాచాః, ఏతే భూమి భారకా:, ఏతేషా మవిరోధేన బ్రహ్మకర్మ సమారభే*.
అర్చక స్వాముల వారు కొన్ని అక్షతలు వాసన చూస్తూ వెనుకవైపు వేసుకుంటారు.
పై మంత్రాన్ని జపిస్తూ అర్చక స్వాముల వారు ఈ భూమికి భారమైన భూత, పిశాచ గణాలను ఈ స్థలము వదిలి వెళ్ళండి అని కోరుతూ భగవంతుడికి జయము పలుకుతాడు.
ఆ తదనంతరము ఏక హారతి వెలిగించి సంకల్పం చెబుతారు. *మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం* అంటూ ఆ దేవాలయపు మూల మూర్తిని స్మరిస్తారు/ సంబోధిస్తారు. ఈ ప్రక్రియ కొనసాగిస్తూ యుగ,కాల సమయములను సంకల్పిస్తారు / స్మరిస్తారు.
*శుభే శోభన ముహూర్తే,*
శ్రీ మహా విష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య, అద్య బ్రహ్మణః, ద్వితీయ పరార్థే,
శ్రీ శ్వేతవరాహకల్పే, వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రథమపాదే, జంబూ ద్వీపే, భారత వర్షే, భరత ఖండే (పూజాదికాలు నిర్వహించే వారు ఏప్రదేశంలో/ఎక్కడుంటే ఆ ఖండము పేరు ఉచ్చరిస్తారు), మేరో దక్షిణ దిగ్బాగే (ఏ నది దగ్గర ఉంటే ఆ నది పేరు పలకుతారు),
శ్రీ శైలస్య ఈశాన్య ప్రదేశే
(శ్రీ శైలానికి ఏ వైపు ఉంటే ఆ దిక్కు పేరు చెప్పాలి, ప్రదేశాన్ని బట్టి దిక్కులు మారుతూ ఉంటాయి).
భగవత్ భాగవతాచార్య సన్నిధౌ....
అస్మిన్ వర్తమానేన ప్రభవాది షష్ఠీ సంవత్సరాణాం మధ్యే స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరే ధక్షిణాయనే, .......ఋతౌ, ......మాసే, ......పక్షే, ........ తథౌ, ...వాసరా వాసరస్తు .....వాసరే,..... నక్షత్రే ...శుభయోగే...శుభకరణే...ఏవంగుణ విశేషణ విశిష్ఠాయం....... తిథౌ.
*ఆ రోజును పురస్కరించుకుని తిథి, వార, నక్షత్రాల వివరాలు చెప్పాలి*.
భగవత్ ఆజ్జయా భగవత్ కైంకర్యార్థం భగవత్ ప్రీత్యర్థం , ఆధ్యాత్మిక ఆధిదైవిక ఆధిభౌతిక తాపత్రయ నివారణార్థం, లోకకళ్యాణార్థం. .... శ్రీ....స్వామి ప్రాతఃకాల/ సాయంకాల ఆరాధనం కరిష్యే...అని సంకల్పించి...
ఆ తదుపరి అర్చక స్వాముల వారు మిగతా పూజాదికాలను యధాతతంగా జరుపుతారు.
*ఒక ముఖ్య గమనిక*
అర్చక స్వాముల వారు ప్రాతః కాలంలో ఆ దేవాలయపు అధి దేవతకు *సుప్రభాత సేవల లగాయతు*, ఆ దినపు సేవల ముగింపు సమయాన భగవంతుడు సెద దీరుటకు *స్వస్తి వచనములు పల్కు వరకు* అర్చక స్వాములు ఆ దేవాలయంలో *బ్రహ్మ స్థానంలో* ఉంటారు. కావున దర్శకులు, భక్తులు, యాజమాన్య సిబ్బంది, ఇతరులు ఎవరైనా అర్చక స్వాముల పట్ల అనుచితంగా, దురుసుగా, అసహనంగా, విమర్శలు మరియు వేళా కోళాలు చేయరాదు. ఇది సనాతన ధర్మ నియమము.
ఏవైనా సూచనలు, సలహాలు మరియు అభ్యర్థనలు ఉంటే సవినయంగా మనవి చేయవలసి ఉంటుంది.
*సర్వులకు విదితమే నిత్యాగ్ని హోత్రులు, నిరంతర పూజా దురంధురులను మినహాయిస్తే, సాధారణ ప్రజలకు అర్చక స్వాముల వారు భక్తులకు మరియు భగవంతునకు అనుసంధాన కర్త అని*.
ధన్యవాదములు.
*(సశేషం)*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి