15, ఆగస్టు 2024, గురువారం

దేవాలయాలు - పూజలు 11*

 *దేవాలయాలు - పూజలు 11*




హైందవ ధర్మం దేవుడిని మూర్తులకు, ప్రతిమలకు మరియు చిత్రాలకు మాత్రమే పరిమితం చేయదు. 

కాని, ఆరాధనకు ఒక మాధ్యమాన్ని అందించే పవిత్ర చిహ్నాలు మూర్తులు, *అర్చామూర్తులు* ప్రతిమలు, విగ్రహాలు, చిత్రాలు. ఈ చిహ్నాలు మన *భౌతిక నేత్రాలతో దైవ స్వభావాన్ని గూర్చి ఆలోచించడానికి మరియు అర్థం చేసుకోవడానికి శక్తివంతమైన సాధనాలుగా ఉపకరిస్తాయి*.


 *దేవాలయాలలో స్వయంభూ కొన్ని, మరికొన్ని  మహానుభావులచే ప్రాణ ప్రతిష్ట చేయబడినవి*.  కొన్ని సార్లు పూజా సమయాలలో నిశ్శబ్ధ బీజాక్షరాలను, మన్త్రాలను, స్తుతులను, శ్లోకాలను గూడా అనుసంధానించడం అవసరమవుతుంది. అది ఆ అక్షర,శబ్ద,ధ్వని తరంగ  సాంకేతిక నిర్మాణ శక్తి రహస్యం.


దేవాలయాలలో గాని గృహంలో గాని ఏ దేవతకు/దేవీకి ఉపచారము (పూజ)చేస్తారో , ఆ దైవం స్తుతి (శక్తి రహస్యాల్ని కీర్తన)గావించడం సర్వ సాధారణం. కొంత మంది అర్చక స్వాములు పురుష సూక్తం నుండి ఒక ఒక  ఋక్కు  చదివి, వెంటనే 

ఆ మూల మూర్తి శ్లోకం అందుకుంటారు... 

ఈ ఆచారాన్ని *పురుష సూక్త విధానేన* షోడశోపచారపూజ అని వ్యవహరిస్తూ ఉంటారు.


దేవీ, దేవతా పూజలలో తీర్థ ప్రసాదాలకు గణనీయమైన ప్రాముఖ్యత ఉన్నది. తీర్థాలలో నాలుగు రకాలు. 1) పంచామృత అభిషేక తీర్థం. 

2) పానక నివేదిత తీర్థం 

3) జల తీర్థం

4) కషాయ తీర్థం. 


వివరాలు.

1) *పంచామృత అభిషేక తీర్థం* వలన అన్ని పనులు సునాయాసంగా, సంపూర్తిగా నెరవేరుతాయి. మరియు బ్రహ్మ (పుణ్య) లోక ప్రాప్తి.

2) *పానక తీర్థం*  గుడ ( బెల్లము) యుక్త జల తీర్థమే  పానక తీర్థము. ఈ తీర్థము ముఖ్యంగా శ్రీ నరసింహ స్వామి దేవాలయాలలో ఆనవాయితీగా ఉంటుంది. ఈ తీర్థము వలన జ్ఞాపక శక్తి వృద్ది, నీరస శమనము, నూతన ఉత్సాహం మరియు మధు మేహ నివారిణి ఫలితాలను అందజేస్తుంది.

3) *జల తీర్థం* సుగంధ ద్రవ్యాలు మరియు తులసి దళ యుక్త తీర్థమే జల తీర్థం. సర్వ రోగ నివారిణి, కష్ట మరియు దుఃఖోప శాంతి, అప మృత్యు హరణం.

4) *కషాయ తీర్థం* ఈ తీర్థ వివరాలు సాధారణంగా అందుబాటులో ఉండవు. అర్చక స్వాములు మాత్రమే ఎరుగుదురు. ఈ తీర్థము రాత్రిపూట జరుగు పూజలలో సేవించబడుతుంది. ప్రత్యేకంగా అస్సాం రాష్ట్రంలోని 

*కామాఖ్య దేవాలయం*, కొల్లాపురం (మహారాష్ర్ట) లోని

 *శ్రీ మహా లక్ష్మీ దేవాలయము* 

హిమాచల్ ప్రదేశ్ లోని *జ్వాలా మాలిని* దేవాలయము మరియు కొల్లూరు (ఆంధ్ర ప్రదేశ్) లోని *మూకాంబికా దేవాలయము* ల లోనూ తప్పనిసరిగా ఈ తీర్థము తప్పనిసరిగా భక్తులకు ఇస్తారు.  ఈ తీర్థము సర్వ ఆరోగ్యం, శుభాలను ప్రసాదిస్తుంది.


ధన్యవాదములు.

*(సశేషము)*

కామెంట్‌లు లేవు: