2, అక్టోబర్ 2020, శుక్రవారం

పోత‌న త‌ల‌పులో....70

 


ధృత‌రాష్టుడు, గాంఢారి ఎప్పుడు దేహ‌త్యాగం చేయ‌బోతున్నారో ధ‌ర్మ‌రాజు నార‌దుడికి చెబుతాడు. వారి దేహ‌త్యాగం గురించి తెలుసుకుని విదురుడు విచారానికి గురై ‌తీర్త‌యాత్ర‌ల‌కు వెళ్ళిపోతాడ‌ని జ‌ర‌గ‌బోయే ప‌రిణామాల‌ను చెప్పి నార‌దుడు స్వ‌ర్గ‌లోకానికి వెళ్లిపోయాడు.

అప్పుడు అక్క‌డే ఉన్న భీముడిని చూసి ధ‌ర్మ‌రాజు అంటున్నాడు....


ఒక కాలమునఁ బండు నోషధిచయము వే-

  ఱొక కాలమునఁ బండకుండు నండ్రు;

క్రోధంబు లోభంబుఁ గ్రూరత బొంకును-

  దీపింప నరులు వర్తింతు రండ్రు;

వ్యవహారములు మహావ్యాజయుక్తము లండ్రు-

  సఖ్యంబు వంచనా సహిత మండ్రు;

మగలతో నిల్లాండ్రు మచ్చరించెద రండ్రు-

  సుతులు దండ్రులఁ దెగఁ జూతు రండ్రు;

                          **

గురుల శిష్యులు దూషించి కూడ రండ్రు;

శాస్త్రమార్గము లెవ్వియుఁ జరుగ వండ్రు;

న్యాయపద్ధతి బుధులైన నడవ రండ్రు;

కాలగతి నింతయై వచ్చెఁ గంటె నేఁడు.

                           **

తమ్ముడూ చూశావు కదా ,కాలగమనంలో ఎంత మార్పు వచ్చిందో. పంటలు సకాలానికి పండటం లేదు. క్రోధం, లోభం క్రౌర్యం, అసత్యం మితిమీరి ప్రజలు ప్రవర్తిస్తున్నారు. వ్యాపారాలలో మోసం చోటు చేసుకొంటున్నాయి. స్నేహంలో ద్రోహం కనిపిస్తూ ఉంది. భార్య- భర్తలల మ‌ధ్య‌స్ప‌ర్థ‌లు క‌నిపిస్తున్నాయి. కొడుకులు కన్నతండ్రులపై కాలుదువ్వుతున్నారు. శిష్యులు గురువులను దూషిస్తున్నారు. శాస్త్రవిధులు కుంటుబడ్డాయి. విజ్ఞులు సైతం న్యాయ మార్గాన్ని విడిచిపెట్టారు. కాలగమనం ఎంతగా వింతగా మారిపోయిందో క‌దా....


హరిఁ జూడన్ నరుఁ డేగినాడు నెల లే డయ్యెం గదా రారు కా

లరు లెవ్వారును; యాదవుల్ సమద లోలస్వాంతు లీవేళ సు

స్థిరులై యుండుదురా? మురారి సుఖియై సేమంబుతో నుండునా?

యెరవై యున్నది చిత్త మీశ్వరకృతం బెట్లో కదే! మారుతీ!

      **

భీమా , ! మాధవుని చూసిరావ‌డానికి మన అర్జునుడు కొద్ది నెల‌ల క్రితం ద్వారకానగరానికి వెళ్ళాడు గదా. ఇప్పటికి ఏడు మాసాలు గడిచి పోయాయి. ఇంతవరకూ తిరిగిరాలేదు. ఇంత‌వ‌ర‌కూ మనకు వారిక్షేమం తెలియలేదు. చారులు కూడా ఎవరూ రాలేదు. వారు ప్రశాంతచిత్తులై ఉండి ఉంటారు గదా? వాసుదేవుడు కుశలంగానే ఉంటాడు కదా? ఎందుకో మనస్సంతా చికాకుగా ఉంది. ఈశ్వర సంకల్పం ఎలా ఉందో ఏమో?


అంటూ అర్జునుడి రాక కోసంఎదురు చూస్తూ, ఎందుకో తెలియ‌ని క‌ల‌తతో ఉన్నాడు ధ‌ర్మ‌రాజు....


🏵️పోత‌న ప‌దం🏵️

🏵️ధ‌ర్మ‌ప‌థం🏵️

కామెంట్‌లు లేవు: