.
చత్రకూటానికి ప్రయాణమయ్యారు సీతారామలక్ష్మణులు వారివెంట భరద్వాజమహర్షికూడా దారిచూపడానికి వెంట కొంతదూరము ప్రయాణించాడు.
.
రామా ! ఈ మార్గములో నేను చాలా సార్లు చిత్రకూటమునకు వెళ్ళాను. ఇది ఏ విధమైన ఇబ్బందులు కలుగని మార్గము.
ఇక్కడ నుండి గంగాయమునల సంగమప్రదేశానికి వెళ్ళండి అక్కడనుండి పడమటిదిక్కుగా యముననే అనుసరిస్తూ వెళ్ళండి.
.
అలా ప్రయాణించిన తరువాత కాళిందిని తెప్పనిర్మించుకొని దాటండి .దాటినపిమ్మట మీకు శ్యామము అనే అతివిశాలమైన మర్రిచెట్టు కనపడుతుంది.ఆ వృక్షాన్ని ఆశ్రయించి అనేకమంది సిద్ధులుంటారు.అక్కడ సీత ఆ వృక్షానికి నమస్కరించి కావలసిన కోరికలు కోరవచ్చును .
.
ఆ పెద్ద మర్రిచెట్టు దాటి ముందుకు ఒక క్రోసు దూరము వెళ్ళండి అక్కడ చక్కటి నీలపురంగులో ఉండే అడవి కనపడుతుంది .
అది మోదుగుచెట్లతోనూ,రేగుచెట్లతోనూ,వెదురుడొంకలతోటి కూడి రమణీయంగా ఉంటుంది .
ఆ మార్గమే చిత్రకూటమునకు వెళ్ళే మార్గము.ఈ విధముగా మహర్షి మార్గనిర్దేశము చేసి తాను రామునికోరికమీద వెనుకకు మరలి నాడు.
.
మువ్వురూ యమునాతీరంచేరారు.యమున ప్రవాహం వేగం మంచి ఉధృతంగా ఉంది.దానిని ఎలా దాటాలా అని కాసేపు ఆలోచించి ,చకచకా కొన్ని ఎండిన కర్రలు,వెదురుకర్రలు సేకరించి వాటన్నిటినీ దగ్గరగా చేర్చి కట్టిఒకతెప్పతయారుచేసుకొన్నారు .
.
లక్ష్మణుడు రకరకాలచెట్ల కొమ్మలు తీసుకొని వచ్చి సీత సుఖంగా కూర్చోవడానికి వీలుగా ఒక ఉన్నతమైన ఆసనం సిద్ధం చేశాడు.
.
ఆ తెప్పమీదికి ఎక్కడానికి కాస్తసిగ్గుపడుతున్న సీతమ్మకు చేయూతనిచ్చి ఎక్కించాడు రామచంద్రుడు.
.
మూటకట్టినసీతఆభరణములు,గునపము,
మేకతోలుతోచేసినచిన్నపెట్టెను,
ఆయుధాలను సీతప్రక్కనే ఉంచాడు రాఘవుడు.
.
ఇరువురు అన్నదమ్ములూ తెడ్లేసుకుంటూ దానిని నడుపసాగారు సూర్యపుత్రిక అయిన ఆ నది మధ్యభాగంలోకి వెళ్ళగనే సీతమ్మ మరల మొక్కులు మొక్కుకుంది .
.
అమ్మా రాముడు క్షేమంగా తిరిగి అయోధ్యకు రాగానే నీకు వందకుండల కల్లు వేయి గోవులు సమర్పించుకుంటానమ్మా అని నదీమతల్లికి మొక్కులు మ్రొక్కింది.
.
ప్రయాణించి వచ్చిన తెప్పను అచటనే వదిలివేసి మరల నడకసాగించారు .వనములగుండా ప్రయాణం చేస్తూ శ్యామము అనే మర్రిచెట్టు వద్దకు వచ్చి చేరారు.
.
ఆ మర్రిచెట్టు చుట్టూ సీతమ్మ మరల ప్రదక్షిణం చేసి తన భర్త నిర్విఘ్నముగా వనవాస వ్రతము పూర్తిచేయాలని కోరికలు కోరింది.
.
మరల నడక మొదలు పెట్టారు . లక్ష్మణుడు ముందు తరువాత సీతమ్మ ఆవెనుక ధనుర్ధారియై రామయ్య.
దారిలో ఏదైనా అందమైన పొదగానీ ,పువ్వుగానీ కనపడినప్పుడు రామచంద్రుని దాని విశేషమడుగుతూ ఆయన చెపుతూ ఉంటే ఈవిడ చిన్నపిల్లలాగా ఆనందిస్తూ ముందుకు సాగుతున్నది.
వదినగారు ఏ పూవును పండును అయితే చూసి విశేషమడిగారో వాటిని సేకరించి మరిది లక్ష్మణుడు తీసుకొని వచ్చి ఆవిడకివ్వటం... ఇలా సాగుతున్నది వారి ప్రయాణం.
.
వూటుకూరుజానకిరామారావు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి