2, అక్టోబర్ 2020, శుక్రవారం

రామాయణమ్.112

 

...

ఎవరి మాట వారిదే ఎవరి పట్టుదల వారిదే ! 

ఈ రాజ్యము నాది కాదు నీవే ఏలుకో అని భరతుడు ! తండ్రి కిచ్చిన మాట మీద నుండి రవ్వంతైనా జరగను అని రాముడు ! ఎవరి పట్టు వారిదే ! ఈ ధర్మమూర్తులను చూసి అక్కడ చేరిన ఋషిగణమంతా ప్రశంసించింది.

.

కానీ ! వారికి తెలుసు రావణ సంహారం జరగాలంటే రాముడు అడవిలో ఉండాల్సిందే ! లోక కళ్యాణం కోసం వనవాసిగా రాముడు జీవించాల్సిందే .

.

అందుకే వారంతా ముక్తకంఠంతో భరతా నీవు ఉత్తమకులసంజాతుడవు,గొప్ప బుద్ధిమంతుడవు ,మంచి ఆచారము తెలిసిన వాడవు ,గొప్ప కీర్తికలవాడవు ,నీకు నీ తండ్రిపై గౌరవ భావమున్నచో రాముడు చెప్పినట్లుగా చేయి.

.

దశరధుడు కైక ఋణము తీర్చుకున్నందువలననే స్వర్గమునకు వెళ్ళగలిగినాడు.ఇప్పుడు రాముడు వెనుకకు మరలెనా !దశరధునకు అనృతదోషం కలిగి ,

స్వర్గంనుండి నెట్టివేయబడతాడు.

.

భరతుడు గజగజవణికిపోతూ మాటలు తొట్రుపడుతుండగా రామా ! రాజ్యము పాలించే సమర్ధత నాకు లేదయ్యా! అని అన్నాడు.

.

అందరూ నీ కోసమే ఎదురు చూస్తున్నారు.నీవు రావలసినదే అని ప్రార్ధిస్తూ రాముడి కాళ్ళమీద పడ్డాడు.

.

భరతుడిని దగ్గరకు తీసుకొని ! భరతా నీవు సమర్ధుడవు కావని ఎవరన్నారు? నీకు గురు శిక్షణ ,ఉత్తమమైన బుద్ధి వున్నాయి ,బుద్ధిమంతులైన అమాత్యులతో కలిసి ఎంత గొప్ప కార్యాన్నైనా చేయగల సమర్ధుడవు నీవు.

.

నీ తల్లి కైక కోరిక వల్లనో ,ఆశవల్లనో ,నీ కొరకు ఇంత చేసినది. నీవు దానిని మనసులో ఉంచుకొనక ఆవిడను గౌరవించు.

.

రాముడి దృఢసంకల్పానికి భరతుడు తలవొగ్గక తప్పలేదు .

.

బంగరు పాదుకలు రెండు రామునికిచ్చి ఇవి నీవు నీ కాళ్ళతో తాకి నాకు ఇవ్వు! ఈ పాదుకలే ఇక నుండీ రాజ్యమేలుతాయి.

.

అంత రాముడు ఆ పాదుకలను ఒకసారి తొడుగుకొని విడిచి భరతునకు ఇచ్చాడు.


రామాయణమ్..113

..

చిత్రకూటపర్వతము మీద జరిగిన సమావేశము బహుచిత్రమైనది.ఎవరికివారు వారి ప్రాణాలను అక్కడ వదలి కేవలం శరీరాలతో మాత్రమే అయోధ్యకు పయనమయ్యారు.

శ్రీ రాముడు అనే అయస్కాంతము వారి ప్రాణాలను తనతోనే ఉంచుకుంది.

.

అయోధ్యలో మునుపటి అందములేదు

జనుల ముఖాలలో ఆనందము లేదు

ఎంతో ఉత్సాహంగా వుండే వారు వారంతా

జీవితపు ప్రతిక్షణము ఉత్సవమే వారికి రాముడున్న రోజులలో.ఇప్పుడు అవేవీ లేవు .బ్రతుకు ఈడుస్తున్నారు, అంతే!

.

శ్మశాన నిశ్శబ్దాన్ని సంతరించుకొని బావురుమంటున్న అయోధ్యలో ఉండబుద్ధికాలేదు భరతుడికి.వచ్చీరావడంతోనే అన్నపాదుకలు నెత్తిన పెట్టుకొని నందీగ్రామం బయలు దేరాడు.

మంత్రిగణమంతా ఆయన వెంట బయలుదేరింది.

ప్రతి చిన్నవిషయాన్ని భక్తితో పాదుకలకు నివేదించి మాత్రమే రాచకార్యాలు చక్కబెడుతున్నాడు మహానుభావుడు భరతుడు.

.

అక్కడ చిత్రకూటం మీద మునులందరూ రాముడిని చిత్రంగా చూడటం మొదలు పెట్టారు. వారి చూపులు అదోరకంగా ఉంటున్నాయి.రాముడికి అనుమానం కలిగింది .విషయం ఎమై ఉంటుందా ! అని .

కులపతి అయిన ఒక వృద్ధతాపసిని అడిగాడు.ఆయన రామా ! మేమంతా వలస వెడుతున్నాము.నీవు వచ్చిన దగ్గర నుండీ నీ మీద కక్షకట్టిన రాక్షసమూక మమ్ములను ప్రశాంతంగా ఉండనీయటంలేదు.తాపసులను చంపుతున్నారు,యజ్ఞవిధ్వంసం కావిస్తున్నారు.బ్రతుకు భారమయ్యింది రామా! ఇక్కడ అని వాపోయాడు.

.

అందుకు రాముడు మీకేమీ భయం లేదు నేనున్నాను అని చెపుతున్నా వినిపించుకోకుండా అందరూ బయలు దేరి వెళ్ళిపోయారు.

.

రాక్షస మాయ నుండి సీతకు భయం కలుగకుండా ఆవిడను అంటిపెట్టుకొని రాముడు కొన్ని రోజులు ఆశ్రమంలోనే ఉండిపోయాడు.

.

ఆయనకు ఇంకా ఎక్కవరోజులు అక్కడే ఉండటానికి మనస్కరించలేదు.పైగా ఆ ప్రాంతమంతా సైన్యము విడిది చేసినందువల్ల చిత్తడిగా తయారయి శోభావిహీనంగా మారిపోయింది.

.

బయలు దేరాడు రాఘవుడు సతీ సోదర సమేతంగా ! 

బాటలు నడచినడచి అత్రి మహర్షి ఆశ్రమం చేరుకున్నాడు.

.

NB

.

అత్రి మహర్షి సప్తర్షులలో ఒకరు .ఆయన సామాన్యుడు కాడు.

తాపత్రయములుమూడు.

అవి ..ఆధ్యాత్మిక ,అధిభౌతిక,అధిదైవికములు..

.

ఈ మూడు తాపాలు కూడా లేని మహాజ్ఞాని .అ త్రి..అనగా మూడు లేని వాడు అని అర్ధం ! ఏ మూడు అంటే పైన చెప్పబడిన తాప త్రయములు.

కామెంట్‌లు లేవు: