2, అక్టోబర్ 2020, శుక్రవారం

**శ్రీమద్భాగవతము**

 **దశిక రాము**




 తృతీయ స్కంధం -36


బ్రహ్మాండోత్పత్తి 

అది ఎలాగంటే ఈ మనస్తత్త్వానికి చింతనం సహజం. ఆ చింతనం సామాన్య చింతనం, విశేష చింతనం అని రెండు విధాలు. వీనినే క్రమంగా సంకల్పం, వికల్పం అని పేర్లు. ఈ సంకల్ప వికల్పాల వల్లనే సృష్టిలోని వస్తువులు వేరువేరు లక్షణాలతో మనకు కనిపిస్తాయి. వీనివల్లనే వివిధ కామాలు ఉత్పన్నమౌతాయి. కనుకనే ఇది ప్రద్యుమ్న వ్యూహం అని చెప్పబడుతుంది. ఇక అనిరుద్ధ వ్యూహం సంగతి చెబుతాను. ఇదే ఇంద్రియాలన్నిటికి అధీశ్వరమై, యోగీంద్రు లందరకు సంసేవ్యమై, శరత్కాల మందలి నల్లకలువ వలె శ్యామల వర్ణంతో విరాజిల్లుతూ ఉంటుంది. తైజసాహంకారం వల్ల బుద్ధితత్త్వం పుట్టింది. ద్రవ్యాన్ని ప్రకాశింపజేసే జ్ఞానం, ఇంద్రియానుగ్రహం, సంశయం, మిథ్యాజ్ఞానం, నిద్ర, నిశ్చయం, స్మృతి అనేవి బుద్ధితత్త్వ లక్షణాలు. ఈ తైజసాహంకారం వల్లనే ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు, క్రియాజ్ఞాన సాధనాలు ఏర్పడుతాయి. ఈ తైజసాహంకారం వల్లనే ప్రాణానికి సంబంధించిన క్రియాశక్తి, బుద్ధికి సంబంధించిన జ్ఞానశక్తి కలుగుతాయి. ఈ రెండు శక్తులూ కర్మేంద్రియాలను, జ్ఞానేంద్రియాలను పనిచేయిస్తాయి. భగవద్భక్తివల్ల ప్రేరేపించబడిన తామసాహంకారంనుండి శబ్దతన్మాత్రం పుట్టింది. ఈ శబ్ద తన్మాత్రంనుండి ఆకాశం పుట్టింది. ఆకాశం నుండి శ్రోత్రేంద్రియం (చెవి) పుట్టింది. శ్రోత్రం శబ్దాన్ని గ్రహిస్తుంది. అదే శబ్దం అర్థానికి ఆశ్రయమై శబ్దం వినేవానికి జ్ఞానజనకం అవుతున్నది. ఈ శబ్దతన్మాత్రం వల్ల ఆకాశం ఏర్పడింది. ఈ ఆకాశం సకల జీవులకు లోపల వెలుపల అవకాశం ఈయటమే కాక ఆత్మకూ, ప్రాణాలకూ, ఇంద్రియాలకూ ఆశ్రయంగా ఉంటుంది. కాలగమనం వల్ల మార్పు చెందే శబ్దతన్మాత్ర లక్షణమైన ఆకాశం వల్ల స్పర్శమూ, స్పర్శంవల్ల వాయువూ, ఆ వాయువువల్ల స్పర్శను గ్రహించగల చర్మమూ పుట్టి స్పర్శజ్ఞానాన్ని కలిగించింది. మెత్తదనం, గట్టిదనం, చల్లదనం, వెచ్చదనం ఇవి స్పర్శజ్ఞానానికి లక్షణాలు. వాయువునకు కదలుట, కదలించుట, వేరుచేయుట, కలుపుట, ద్రవ్యనేతృత్వం, శబ్దనేతృత్వం, సర్వేంద్రియాత్మకత్వం అనేవి లక్షణాలు. గంధంతో కూడిన ద్రవ్యాలను ఆఘ్రాణింపజేయటం ద్రవ్యనేతృత్వం. దూరంగా ఉన్న శబ్దాన్ని చెవికి వినిపింప జేయటం శబ్దనేతృత్వం. భగవత్ప్రేరణతో స్పర్శతన్మాత్రం వల్ల పుట్టిన వాయువువల్ల రూపం పుట్టింది.ఈ రూపం వలన తేజస్సు కలిగింది. నేత్రేంద్రియం వల్ల గ్రహింపదగింది రూపం. నేత్రాన్ని పొందిన రూపానికి అనగా కనుపించునటువంటి ఆకారానికి వృత్తులు ఉపలంభకత్వం (అనుభవం కలుగడం), ద్రవ్యాకారసమత్వం (ద్రవ్యంయొక్క ఆకారాన్ని ఉన్నదున్నట్లుగా చూపడం), ద్రవ్యోపసర్జనం (ద్రవ్యం అప్రధానం కావడం), ద్రవ్యపరిణామ ప్రతీతి (ద్రవ్యంయొక్క మార్పు తెలియడం). ఇక తేజస్సుకు సాధారణాలైన ధర్మాలు ద్యోతం, పచనం, పిపాస, ఆకలి, చలి. ద్యోతానికి ప్రకాశం, పచనానికి బియ్యం మొదలైన పాకం, పిపాసకు పానం, ఆకలికి ఆహారం, చలికి శోషణం అనేవి వృత్తులు. దైవప్రేరితమై మార్పు చెందిన తేజస్సువల్ల రసతన్మాత్రం పుట్టింది. ఈ రసతన్మాత్ర వల్ల జలం పుట్టింది. జిహ్వ అనే పేరుగల రసనేంద్రియం రసాన్ని గ్రహించేది అయింది. ఆ రసం ఒకటే అయినా ద్రవ్యాల కలయికలోని మార్పువల్ల వగరు, చేదు, కారం, పులుపు, తీపి, ఉప్పు అనే రుచులుగా మారి వాటి కలయిక వల్ల ఇంకా అనేకవిధాలుగా మార్పు చెందింది. తనలో చేరిన ద్రవ్యాల మార్పులనుబట్టి ఆర్ద్రం కావడం, ముద్ద గట్టడం, తృప్తినివ్వడం, జీవనం, అందలి మాలిన్యాన్ని నివారించడం, మెత్తపరచడం, తాపాన్ని పోగొట్టడం, బావిలో జెలలు ఏర్పడి అడుగున ఉన్న జలం పైకెగయడం అనేవి ఈ జలవృత్తులు. రసతన్మాత్రవల్ల దైవప్రేరణతో మార్పుచెందిన జలంనుండి గంధతన్మాత్రం పుట్టింది. ఈ గంధతన్మాత్రం వలన పృథ్వి (భూమి) ఏర్పడింది. ఘ్రాణేంద్రియం (ముక్కు) గంధాన్ని గ్రహించేదయింది. ఈ గంధం ఒకటే అయినా ఇంగువ మొదలైన పదార్థాలతో కలిసిన కారణంగా మిశ్రమగంధం అనీ, నిలువ ఉన్న పెరుగు ముద్ద, జంతుమాంసం మొదలైన వానితో కలిసినప్పుడు దుర్గంధం అనీ, కర్పూరం మొదలైనవానితో కలిసినపుడు సుగంధం అనీ, తామరపూలు మొదలైన వానితో కలిసినపుడు శాంతగంధం అనీ, వెల్లుల్లి మొదలైన వానితో కలిసినపుడు ఉగ్రగంధం అనీ, పాసిపోయిన చిత్రాన్నం వంటి వాటితో కలిసినపుడు ఆమ్లగంధం అనీ వేరువేరు పదార్థాలతో కలిసినపుడు మరెన్నో విధాలుగా పేర్కొనబడుతుంది. భూమికి సంబంధించిన సాధారణ ధర్మాలు ఏవనగా ప్రతిమల రూపాన్నీ వాటి ఆకారాలనూ నిలుపుకోవడం, జలం మొదలైన వాటితో అవసరం లేకుండా స్వతంత్రంగా నిలబడగలగటం, జలాదులకు తాను ఆధారమై ఉండటం, ఆకాశం, వాయువు, తేజస్సు, బలం వీనిని విభజించడం, సకల జీవరాసులకు దేహంగా పనిచేయటం అనేవి పృథ్వీవృత్తులు” అని చెప్పి కపిలుడు ఇంకా ఇలా అన్నాడు. “పంచభూతాలకు సాధారణ ధర్మాలు విన్నావు. ఇవికాక వానికి సంబంధించిన అసాధారణ ధర్మాలు విను. ఆకాశానికి అసాధారణగుణం శబ్దం. దీనిని శ్రవణేంద్రియం గ్రహిస్తుంది. వాయువుకు అసాధారణగుణం స్పర్శం. దీనిని త్వగింద్రియం గ్రహిస్తుంది. తేజస్సుకు అసాధారణగుణం రూపం. దీనిని నేత్రేంద్రియం గ్రహిస్తుంది. జలానికి అసాధారణగుణం రసం. దీనిని జిహ్వేంద్రియం గ్రహిస్తుంది. పృథివికి అసాధారణగుణం గంధం. దీనిని ఘ్రాణేంద్రియం గ్రహిస్తుంది. ఆకాశం మొదలైన అన్నింటితో సంబంధం ఉండడం వల్ల భూమికి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు అసాధారణ గుణాలు అయినాయి. మహత్తు, అహంకారం, పంచతన్మాత్రలు అనే ఈ ఏడు తత్త్వాలు ఒకదానితో ఒకటి కలిసి భోగానుభవానికి పాత్రుడైన పురుషుని కల్పించటానికి అసమర్థంగా ఉన్న ఆ సమయంలో కాలస్వరూపుడూ అంతుపట్టని అస్తిత్వం కలవాడూ, జగత్కారణుడూ, సత్త్వరజస్తమోగుణాలకు అతీతుడూ, సమస్తాన్ని నియమించేవాడూ, నిరంజనాకారుడూ అయిన సర్వేశ్వరుడు పైన చెప్పబడిన పురుషునిలో ప్రవేశించాడు. అప్పుడు ఒకదానితో ఒకటి కలగాపులగమై ఘర్షణ పొంది కలిసిపోయిన మహదాదుల వలన అధిష్ఠాతయైన భగవంతుని చైతన్యం కోల్పోయిన ఒక అండం పుట్టింది. ఆ అండంలో మహత్తరమైన శక్తితో విరాట్పురుషుడు విరాజిల్లుతూ ఉంటాడు. ఆ అండాన్ని పొదువుకొని పృథివి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం, అహంకారం, మహత్తు అనే ఆవరణాలు ఒకదానికంటె ఒకటి పదింతల ప్రమాణం కలిగి ఉంటాయి. లోకాలకు మేల్కట్టు చాందినీలవలె ఒప్పియున్న ఆ పొరలలో నుంచి విష్ణుదేవుని తేజస్సు ప్రకాశిస్తూ ఉంటుంది. జలంతో తేలుతూ ఉన్న బంగారుమయమైన ఆ అండంలో మహానుభావుడు, అభవుడు, శ్రీహరి, దేవదేవుడు, విశ్వవిజేత అయిన నారాయణుడు ప్రవేశించి గగనమండలాన్ని భేదించి వేస్తాడు.


విరాట్పురుష ప్రకారంబు 


ఆ అండంలో విరాట్పురుషుడు వెలుగుతూ ఉంటాడు. అతని ముఖం నుండి వాణి, వాణితోపాటు అగ్ని పుట్టాయి. ముక్కునుండి ప్రాణాలు, ఘ్రాణేంద్రియం పుట్టాయి. ఘ్రాణేంద్రియం నుండి వాయువులు, ప్రాణవాయువులు ఆవిర్భవించాయి. ప్రాణవాయువుల వల్ల కన్నులు, కన్నులవల్ల సూర్యుడు పుట్టారు. వానియందు ధ్యాన మేర్పడగా చెవులు పుట్టాయి. వానివల్ల శ్రోత్రేంద్రియం దిక్కులూ పుట్టాయి. చర్మంనుండి గడ్డం, మీసాలు మొదలగు రోమసమూహమూ, ఓషధులూ జనించాయి. ఇంకా...చర్మం వలన మూత్రావయవం పుట్టింది. దానినుండి రేతస్సు పుట్టింది. రేతస్సువల్ల జలం పుట్టింది. దానివల్ల అపానం పుట్టింది. దానివల్ల మృత్యువు పుట్టింది.విరాట్పురుషుని చేతులవల్ల బలం, చేతుల బలంవల్ల ఇంద్రుడు, పాదాలవల్ల గమనం, పాదగతులవల్ల ఉపేంద్రుడు ఉద్భవించటం జరిగింది. విరాట్పురుషుని నాడులవల్ల రక్తమూ, రక్తంవల్ల నదులూ, జఠరం వల్ల ఆకలిదప్పులూ, ఈ రెండింటివల్ల సముద్రాలు పుట్టాయి.విరాట్పురుషుని హృదయంవల్ల మనస్సూ, మనస్సువల్ల చంద్రుడూ, బుద్ధీ, చిత్తంవల్ల బ్రహ్మ, క్షేత్రజ్ఞుడు కలిగారు. ఇలా ఆ అండం నుండి సృష్టికారకుడైన పురుషుడు పుట్టాడు.

ఇంకా విరాట్పురుషునిలో జన్మించిన ఆకాశం మొదలైన పంచభూతాలూ, శబ్దం మొదలైన పంచతన్మాత్రలూ, వాక్కు మొదలైన ఇంద్రియాలూ, ఆ ఇంద్రియాల అధిదేవతలూ వేరువేరుగా ఉండిపోయాయి. అవి తమలో తాము సమైక్యం పొందనందువల్ల జీవుణ్ణి ప్రవర్తింపజేయలేక పోయాయి. ఆ యా దేవతలు అధిష్ఠించిన ఇంద్రియాలు, తాము ప్రత్యేకంగా క్షేత్రజ్ఞుని లోకవ్యవహారానికి ప్రేరేపింపజాలక వరుసగా ఆయా స్థానాలలో ఉండిపోయాయి. విరాట్పురుషుని ముఖాన అగ్ని వాగింద్రియంతో కూడి వర్తించి నప్పటికీ విరాట్పురుషుని కార్యమైన ఇతరేతర జీవుల శరీరోత్పత్తి కలుగలేదు. అట్లే విరాట్పురుషుని నాసికలో వాయువు జ్ఞానేంద్రియంతో వర్తించినప్పటికీ జీవోత్పత్తి కాలేదు. అదే విధంగా కన్నులలో సూర్యుడు చక్షురింద్రియంతో కూడి వర్తించినా వ్యర్థమే అయింది. అలాగే చెవులలో దిక్కులు శ్రోత్రేంద్రియంతో కూడినప్పుడు కూడ విరాట్పురుషుని కార్యం సాధించటంలో వృథా అయ్యాయి. రోమాలలో త్వగింద్రియంతో ఓషధులు వర్తించి విఫలమయ్యాయి. అలాగే జలం అధిదేవతగా కల పురుషాంగం రేతస్సును పొందికూడా సృష్టికి సమర్థం కాలేదు. మలావయవం మృత్యువుతోకూడి అపానేంద్రియాన్ని చేరి నిరర్థకమే అయింది. హరిదేవతాకాలైన పాదాలు గతితో కూడి శక్తిహీనాలు అయ్యాయి. ఇంద్రదేవతాకాలైన చేతులు బలాన్ని పొంది కూడా నిరుపయోగాలైనాయి. నదీ దేవతాకాలైన నాడులు రక్తంతో కూడినప్పటికీ నిరర్థకాలైనాయి. కడుపు సముద్రాలతో కూడి ఆకలిదప్పులను పొందినప్పటికీ నిష్ప్రయోజనమైంది. హృదయం మనస్సుతో చంద్రుణ్ణి పొందికూడా ఊరక ఉంది. అట్లే బుద్ధి హృదయాన్ని పొందినప్పటికీ, చిత్తం రుద్రుణ్ణి చెందినప్పటికీ విరాట్పురుషుని కార్యాలు ఉత్పన్నం కాలేదు. అనంతరం అన్నిటికీ సమైక్యం కుదుర్పగల క్షేత్రజ్ఞుడు హృదయాన్ని అధిష్ఠించి, చిత్తంలో ప్రవేశించాడు. అప్పుడు విరాట్పురుషుడు, జలాలలో తేలుతున్న బ్రహ్మాండాన్ని అధిష్ఠించి సృష్టికార్యాన్ని ప్రవర్తింప గలిగాడు. నిద్రించిన జీవుని ప్రాణాలు మొదలైనవి తమ సొంతబలంతో కదలాడలేవు. లేవటానికి సమర్థాలు కావు. ఆ విధంగా అగ్ని మొదలైనవి తమకు అధిష్ఠానాలైన ఇంద్రియాలతో దేవాది శరీరాలు పొందికూడా, అవి శక్తిహీనా లయ్యాయి. క్షేత్రజ్ఞుడు ప్రవేశించగానే మెలకువ వచ్చినట్లు ఆయా శరీరభాగాలు పనిచేయటం ప్రారంభించాయి. అటువంటి విరాట్పురుషుని ఎడతెగని భక్తితో వివేకం కలిగి విరక్తులైన మహాత్ములు ధ్యానిస్తారు. ప్రకృతి, పురుషుల యథార్థజ్ఞానం వల్ల మోక్షమూ, కేవలం ప్రకృతి సంబంధంతో సంసారబంధమూ కలుగుతుంది” అని చెప్పి కపిలుడు దేవహూతితో మళ్ళీ ఇలా అన్నాడు.

🙏🙏🙏

సేకరణ

**ధర్మము-సంస్కృతి*

🙏🙏🙏


**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం**

*మన ధర్మాన్ని రక్షిద్దాం**


**ధర్మో రక్షతి రక్షితః**

🙏🙏🙏

కామెంట్‌లు లేవు: