*ధనుర్మాస ధ్యానం భజనం 2023-24 ప్రత్యేక శీర్షిక .*💐
*అన్నమయ్య అజరామర సంకీర్తనలు - 01*
🌺🍃 *----------------* 🍃🌺
*అన్నమయ్య అక్షరవేదం ..సంపుటి -- 359*
*( అదివో అల్లదివో హరివాసము ... )*
🌺🍃 *----------------* 🍃🌺
ఓం నమో వేంకటేశాయ. 🙏
అన్నమయ్య అక్షర వేదం ..సంపుటి -- 359 కి శుభ స్వాగతం ..🙏
*ప్రార్థన ః--*🌹🙏
*అదిగో వేంకటనగ మది-*
*గదిగో వైకుంఠమనగ నదియే యిలలో !*
*పదముల కలసట లేలా ?*
*పదపదరే వేంకటాద్రి వరదుని కడకున్ !*
🌹🙏🌹
✍️ *స్వీయపద్యము ( కందము )*
🌹🌹
( అలసట మరచి ఇలవౖకుంఠమైన తిరుమల కొండనెక్కి
ఆ వేంకటాద్రి విభుని వద్దకు చేరుదాము ! 🙏
అదిగో మన చేరువనే ఉన్నది ,ఆలస్యము వలదు , అలపులు అసలే వలదు !!🙏 )
🌹🙏🌹
🌺🍃 *----------------* 🍃🌺
అన్నమాచార్యుల వారి సుప్రసిద్ధ సంకీర్తనలలో ఆది కీర్తనగా దీనిని పరిగణించుకోవచ్చు .
ప్రతీ తెలుగింటిలోనూ మారుమ్రోగే కీర్తన ఇది . 🙏
ఈ పాట పాడుకుంటూ ఆ తిరుమల కొండ మెట్లు ఎక్కుతుంటే అలసట అన్నది ఉంటుందా అసలు ?🙏
అంతటి ఉత్సాహాన్ని మనలో నింపారు అన్నమయ్య ఆ తిరుమల కొండను అండగా చూపించి .
అందరికీ తెలిసిన కీర్తనయే ఐనా నా తృప్తికోసము భావార్థమును అందిస్తున్నాను అంతే ! 🙏
🌺🍃 *----------------* 🍃🌺
🌹🌹
అదిగో ! అదిగదిగో ! అదేనయ్యా ఆ శ్రీ హరి మనకోసమే కొలువైన కొండ , ఆయన స్థిరనివాసమును ఏర్పరుచుకున్న కొండ .🙏
ఆ కొండ ఎంత గొప్పగా ఉన్నదో చూడండి ఆ ఆది శేషుని వేయిపడగలతో ముందే స్వామికొరకు వచ్చి అమరినట్లుగా ఉన్నది .🙏
శేషశాయి అయిన ఆ *శ్రీమన్నారయణుని* శేషతల్పమే ఈ కొండ .🙏
🌹🌹
అదే వేంకటాద్రి కొండ .
అన్నిటికీ మించినదియై పొడవుగా అలరారుచున్నది .🙏
అదియే ఆ బ్రహ్మ మొదలగు వారికి మిక్కిలి విలువైన , అసాధారణమైన కొండ .🙏
అదియే శ్రేష్టులైన మౌని తపస్వులకందరికీ నిజమైన ఇరవు .🙏
అదిగో చూడండి ! అదిగో ఆ కొండకు నమస్కరించుకోండి !🙏
అంతకు మించిన ఆనందము మరెక్కడా ఉండదు . అక్కడికి చేరుటయే అన్నిటికీ మించిన ఆనందమగును .🙏
🌹🌹
అదిగో ప్రక్కనే శేషాద్రి కొండ కూడా శోభలతో కూడి యున్నది .
ఆ ఆకాశాన ఉన్న దేవతలకందరికీ ఇదియే సత్యమగు నిధానము .🙏
మన ముందరే అదిగో గర్భగుడిలో వెలసి నిలుచున్నాడు సంపదలకంతటికీ గొప్ప సంపదయైన వాడు .🙏
బంగారు కాంతులీనుచూ గోపుర శిఖరములతో ఆ పరబ్రహ్మ స్వరూపమే అయి ముక్తిని ప్రసాదించే దివ్య ధామము .🙏
🌹🌹
ఇక్కడికి చేరుతున్నామంటే ఆ వైకుంఠమునకు చేరువలో ఉన్నాము అనియే భావించండి .అంత గొప్పనైనది ఈ వేంకటాద్రి .🙏
ఈ కొండయే ఆ *శ్రీ వేంకటేశ్వరునికి* సిరియై యున్నది .🙏
అసలు చిత్త శుద్ధిగా భావన చేసితే ,
సంపదలన్నిటిలోకి మేలైన సంపద ఇదియే .🙏
పవిత్రములైన వాటన్నిటిలోకి అమిత పవిత్రమైనది కూడా ఇదియే .🙏
రండి ఆ వేంకటాద్రి కొండ ఎక్కెదము . *శ్రీ వేంకటేశ్వరుని* దర్శించుకుని ధన్యులమౌదాము .🙏
🌹🙏🌹
*ఓమ్ శ్రీ అలమేలుమంగా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామినే నమః !*🙏
తాత్పర్య సహిత దృశ్య మాలికగా మీకు అందించాలన్న నా చిన్న ప్రయత్నమును ఆశీర్వదిస్తారని ఆశిస్తూ..🙏
దోషములున్న...మన్నించమని విన్నపము... 🙏
*( అన్నమయ్య అక్షర వేదం --- సంపుటి 359)*
✍️ *-- వేణుగోపాల్ యెల్లేపెద్ది* 🙏
🌹🌹 *సంకీర్తన* 🌹🌹
*॥పల్లవి॥*
అదివో అల్లదివో హరివాసము
పదివేలుశేషుల పడగల మయము
*॥చ1॥*
అదె వేంకటాచల మఖిలవున్నతము
అదివో బ్రహ్మాదుల కపురూపము
అదివో నిత్యనివాస మఖిలమునులకు-
నదె చూడుఁడదె మొక్కుఁడానంద మయము
*॥చ2॥*
చెంగట నల్లదివో శేషాచలము
నింగినున్న దేవతల నిజవాసము
ముంగిట నల్లదివో మూలనున్న ధనము
బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము
*॥చ3॥*
కైవల్యపదము వేంకటనగ మదివో
శ్రీవేంకటపతికి సిరులైనది
భావింప సకలసంపద రూపమదివో
పావనములకెల్లఁ బావన మయము
🌹🙏🌹🙏🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి