### ఆలోచనాలోచనాలు ### సంస్కృత సూక్తి సుధ ### ( ప్రజ్ఞారసః తృప్తి కరో రసేభ్యః! -జ్ఞానరసమే అన్ని రసాలకన్నా తృప్తి కలిగించే రసం) 1* విద్వానేవ విజానాతి, విద్వజ్జన పరిశ్రమమ్! నహి వంధ్యా విజానాతి, గుర్వీం ప్రసవ వేదనం!! ( పండితుడు చేసిన కృషిని మరియొక పండితుడు మాత్రమే గుర్తించగలడు. గొడ్రాలు అయిన స్త్రీ ప్రసవ వేదన లోని శ్రమను గుర్తించలేదు కదా!) 2* చందనం శీతలం లోకే, చందనాదపి చంద్రమా! చంద్ర చందన యోర్మధ్యే, శీతలా సాధుసంగతి!! ( శీతల గుణం కలది చందనం. చందనం కంటే శీతలమైంది చంద్రుని వెన్నెల. ఈ రెండింటి కన్నా మిక్కిలి శీతలమైంది సజ్జన సాంగత్యం.) 3* దధి మధురం, మధు మధురం, ద్రాక్షా మధురా, సుధాపి మధురైవ! తస్య దేవహి మధురం, యస్య మనో యత్ర సంలగ్నమ్!! (పెరుగు తియ్యగా ఉంటుంది. తేనె, ద్రాక్ష, అమృతాలు తియ్యనివి. కానీ మనస్సు దేనిపై లగ్నమై ఉంటుందో అదే అతడికి/ ఆమెకు మధురాతిమధురం.) 4* నకశ్చిత్ కస్య చిన్మిత్రం, నకశ్చిత్ కస్య చిద్రిపుం! వ్యవహారేణ మిత్రాణి, జాయన్తే రిపువస్తదా!! ( ఎవ్వరికి పుట్టుకతోనే మిత్రులు కానీ శత్రువులు కానీ ఏర్పడరు. మన వ్యవహారశైలిని బట్టి మిత్రులు కాని, శత్రువులు కాని ఏర్పడతారు సుమా! అది అచ్చంగా మన నడవడిపైన మాత్రమే ఆధారపడి ఉంటుంది.) 5* నతేన వృద్ధో భవతి యేవాస్య ఫలితం శిరః! యోవా యువా స్వధీయానస్తం దేవాస్థ విరం విదుః!! -- మనీస్మృతి. ( తలవెంట్రుకలు నెరసినంత మాత్రాన వృద్ధుడనిపించుకోడు. పిన్న వయస్సు వాడైనప్పటికీ, విద్యగలవాడే వృద్ధుడనిపించుకొంటాడని దేవతలు అంటారు. ) 6* న స్నానమాచరేత్ భుక్త్వా, నాతురాన మహా నిశిః! నవాభిసోభిస్వహోజస్రం, నా విజ్ఞతే జలాశయం!! -- సుభాషిత రత్న భాండాగారం. ( భోజనం చేసిన తరువాత స్నానం చెయ్యకూడదు. రోగి అయిన వ్యక్తి స్నానం చెయ్యకూడదు. అర్థరాత్రి వేళ అస్సలు స్నానం చెయ్యకూడదు. తెలియని మడుగులోకానీ, సరస్సులో కానీ స్నానం చెయ్యడం పనికిరాదు.) 7* క్రోధో వైవస్వతో రాజా, చాశా వైతరణీ నదీ! విద్యా కామదుఘా ధేనుః, సంతుష్టి నందనవనం!!-- నీతి శాస్త్రం. ( కోపమున్నదే అది యమునితో సమానం. ఆశ ఆకాశంలోని వైతరిణీ నది వంటిది.విద్య కామధేనువు వంటిది. సంతృప్తి నందనవనం వంటిది.) 8* నాస్తి కామ సమో వ్యాధిః,నాస్తి మోహ సమో రిపుః! నాస్తి క్రోధ సమో వహ్నిః, నాస్తి జ్ఞానాత్ పరం సుఖమ్!! -- నీతి శాస్త్రం. ( కామం అన్నది వ్యాధి వంటిది. మోహం శత్రువు వంటిది. కోపంతో సమానమైన అగ్ని లేదు.జ్ఞానం కంటే సుఖాన్నిచ్చే మరొక వస్తువు లేదు. కనుక ( మనుష్యులు) జ్ఞానాన్ని పెంచుకోవాలి.) 9* యస్యనాస్తి స్వయం ప్రజ్ఞా, శాస్త్రం తస్య కరోతి కిమ్! లోచనాభ్యం విహీనస్య, దర్పణం కిం కరిష్యతి!! --- సుభాషిత రత్న భాండాగారం. ( కొంత అయినా స్వయం ప్రతిభ లేని వానికి, శాస్త్రముల వలన ప్రయోజనం ఉండదు. కళ్ళులేని కబోదికి అద్దం వలన ఏం ప్రయోజనం ఉంటుంది? 10* చితా, చింతా ద్వయోర్మధ్యే , చింతానామ గరీయసి! చితా దహతి నిర్జీవం, చింతా ప్రాణయుతం వపుః!! -- నీతి శాస్త్రం. ( చిత ( శవాన్ని కాల్చే కట్టెల రాశి), చింత ( దిగులు లేదా విచారము) ఈ రెండింటి మధ్య రెండవదే మిక్కిలి బాధాకరము. మొదటిది చనిపోయిన శవాన్ని తగులబెడితే, రెండవది బ్రతికి ఉండగా మనిషిని కాల్చివేస్తూ ఇబ్బందిని కలుగజేస్తుంది. 11* లోభేన బుద్ధిశ్చలతి, లోభో జనయితే త్వషామ్! త్వషార్తో దుఃఖమాప్నోతి, పరత్రేహచ మానవః!! -- సుభాషిత రత్న భాండాగారం. ( ధనంపై అత్యాశ ఉన్నట్లయితే, మనస్సు చలిస్తుంది. ధనాశ కోరికలను పెంచుతుంది. ధనాశ గల వ్యక్తి ఇహ, పర లోకాల్లోను దుఃఖిస్తాడు. కాబట్టి లోభం ( ధనంపై అత్యాశ ) కూడదు. 12* వరం దరిద్రః, శ్రుతి శాస్త్ర పారంగతః! నచాపి మూర్ఖః, బహురత్న సంచయః!! --- సుభాషిత రత్న భాండాగారం. వేద శాస్త్ర పారంగతుడైన వ్యక్తి దరిద్రుడైనప్పటికీ ఉత్తముడే, శ్రేష్ఠుడే! అనేక రత్న భాండాగారాలు ఉన్నప్పటికీ మూర్ఖుడు ఎన్నటికీ శ్రేష్ఠుడు కాలేడు. చివరగా ఒక చమత్కార శ్లోకం. శిరసా ధార్య మాణోపి, సోమః సౌమ్యేన శంభునా! తథాపి కృశతాం యాతి, కష్టం ఖలు పరాశ్రయః!! పరమశాంతుడైన శివుడు చంద్రుణ్ణి తన తలమీదనే అలంకారంగా పెట్టుకొన్నాడు. అయినా ఏం లాభం? ఆ చంద్రుడు రోజు, రోజుకు క్షీణిస్తూనే ఉన్నాడు. పరులను ఆశ్రయించి బ్రతకడం కష్టమే కదా? తేది 17--12--2023, అదివారం, శుభోదయం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి