8, నవంబర్ 2024, శుక్రవారం

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*విరాట పర్వము చతుర్థాశ్వాసము*


* 189వ రోజు*

*కర్ణుడు కృపాచార్యుని తూలనాడుట*


కర్ణుడు కోపంగా " కృపాచార్యా! శత్రువుల మిత్రుడవని తెలిసీ నిన్ను తీసుకురావడం సుయోధనుని అమాయకత్వం. బాలురు, బంధువులు రాజు సంపదను ఆరగిస్తారు కాని సమయానికి తప్పుకుంటారు. ఇంటికి వెళ్ళి హాయిగా మృష్టాన్నాలు ఆరగించు. అనవసరంగా రాజు నిన్ను యుద్ధంలో ప్రవేశపెట్టాడు. మారు మాటాడక వెళ్ళు. నేను ఒక్కడినే పదునాలుగు భువనాలను గెలుస్తాను. ఒక్క రధికుడు అర్జును డెంత " అన్నాడు. భీష్ముడు కృపాచార్యుడు, ద్రోణుడు, అశ్వత్థామ సముచితంగా మాట్లాడాడు. కర్ణుడు వీరోచితంగా మాట్లాడాడు. కాని ఒకరిని ఒకరు నిందించు కోవడం న్యాయం కాదు. అంత శక్తి ఉన్న వాడు యుద్ధం చేయాలి కాని ఇలా ఇతరులను నిందించడం ఎందుకు? శత్రువులు ముట్టడించక ముందే ఉపాయం ఆలోచించాలి. శత్రువు పరాక్రమ వంతుడైతే పొగడటం సజ్జనులకు ఉచితం. పెద్దలను గౌరవించాలి కాని నిందించడం తగదు. ప్రస్తుత కర్తవ్యం ఆలోచిద్దాం. ఆచార్యా అర్జునుడు మన మీద యుద్ధానికి వస్తున్నాడు. మనం అందరం కలసి ఎదిరిస్తాం. విభేదాలకు ఇది సమయం కాదు. ఎవరో ఏదో అన్నారని మీరు కోపగించ డానికిది సమయం కాదు. నన్ను క్షమించి ముందుకు పదండి ఆచార్యా " అన్నాడు. కృపాచార్యుడు " అయ్యో మీరు క్షమించంచ మని అడుగ తగునా. నేనంతటి వాడనా. ద్రోణుడు శాంతిస్తే చాలు " అన్నాడు. కృపాచార్యుడు, భీష్ముడు, కర్ణునితో పోయి ద్రోణాచార్యుని అశ్వత్థామను క్షమించమని కోరారు.


*ద్రోణుడి వ్యూహ రచన*


ద్రోణుడు " భీష్ముని మాటలతో నా కోపం పోయింది. ముందుకు పదండి ముందు మనం రారాజును కాపాడు కుంటాము. అర్జునుడు చాలా కసితో ఉంటాడు కనుక అందరం అర్జునిని ఎదుర్కొందాము. అజ్ఞాత వాసం గురించి సుయోధనుడు అడిగిన దానికి భీష్ముడు వివరణ ఇస్తాడు " అన్నాడు. ద్రోణుని ఆంతర్యం గ్రహించిన భీష్ముడు కాల నిర్ణయం చేయవలసిన సమయం ఆసన్న మయినదని గ్రహించాడు. అతడు " సుయోధనా! మన ప్రస్తుత కాలమానం ప్రకారం రెండు సంవత్సరాలకు ఒక అధిక మాసం వస్తుంది. ఈ పదమూడేళ్ళ కాలంలో వచ్చిన అధికమాసాలను గణనలోకి తీసుకుంటే నిన్నటితో పాండవుల అజ్ఞాత వాసం పూర్తి అయింది. ఈ విషయం తెలిసే అర్జునుడు నిజ రూపంతో మనముందుకు వచ్చాడు. అతడు ధర్మం తప్పడు. అలా తప్పే వాడైతే జూదంలో ఓడి పోయిన నాడే మూర్ఖత్వంతో మనతో యుద్ధానికి దిగే వాడు. ధర్మంకోసం కట్టుబడ్డారు కనుకనే ఇంత కాలం వేచి ఉన్నారు. మనతో యుద్ధానికి వచ్చింది అర్జునుడని తెలిసి పోరాటానికి దిగితే మనం గెలువ వచ్చు ఓడి పోవచ్చు. జయాపజయాలు దైవాధీనం కనుక మనం సంధి చేసు కోవడం ఉత్తమం " అన్నాడు భీష్ముడు. సుయోధనుడు " మనకు పాండవులతో సంధి ఎలా పొసగుతుంది. పాండవులకు నేను రాజ్యభాగం ఇవ్వను. యుద్ధం నిశ్చయం ఇందులో తిరుగు లేదు " అన్నాడు. ఇది చూసిన ద్రోణుడు " యుద్ధ సమయంలో నిర్ణయాధికారం రాజుకు మాత్రమే ఉంటుంది. కనుక ఎవరూ రాజు మాట నిరాకరించ లేరు కనుక మనం యుద్ధ వ్యూహాన్ని చేయాలి. సైన్యంలో నాల్గవ భాగాన్ని తీసుకుని సుయోధనుడు ముందు నడుస్తాడు. మరొక నాల్గవభాగం గోవులతో నడుస్తుంది. మిగిలిన సగం సైన్యంతో మనం వెనుక కదులుదాము. నేను మధ్యలో ఉంటాను. నా కుడి వైపు కృపాచార్యుడు, ఎడమ వపు అశ్వత్థామ ఉంటారు. ముందు భాగంలో కర్ణుడు ఉంటాడు. దుశ్శాసనుడు, వికర్ణుడు, శకుని, జయద్రధుడు, భూరిశ్రవుడు, బాహ్లికుడు, సోమదత్తుడూ అక్కడక్కడా మొహరిస్తారు. అర్జునుడు ఎవరితో యుద్ధం చేస్తే వారిని మనంమంతా రక్షిస్తాము. ఇం, దుకు భీష్ముడు ఆమోదాన్ని తెలిపాడు. తాను వెనుక ఉండి సైన్యాలను నడిపించాడు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

కామెంట్‌లు లేవు: