23, డిసెంబర్ 2022, శుక్రవారం

సంసార వాసనలు 

సంసార వాసనలు 

మన జ్ఞ్యానులు మనలను సాధకులుగా మార్చే దిశలో అనేక మహాత్ముల  కధలు చెపుతూవుంటారు నిజానికి జిజ్ఞాసువులకు ఇటువంటి కధలు ఎంతో ఊతం ఇచ్చి ముముక్షువులుగా మారుస్తాయి వాటిలోని యదార్ధకత గూర్చి విచారించకుండా అవి మానలను ముకుక్షుకత్వము వైపు మరలుటకు ఎంతవరకు దోహదపడతాయి అనేది గమనించితే మన సాధనా మార్గం సుగమము అవుతుంది.    అటువంటి ఒక కధ ఇక్కడ పేర్కొంటున్నాను. 

సర్వసంగ పరిత్యాగి అయిన ఒక యోగీశ్వరుడు పూర్తిగా దిగంబరుడుగా వుంటూ అడవిలో దొరికే పండ్లు, ఫలాలు మాత్రం స్వేకరిస్తూ సాదారణ జన జీవనానికి దూరంగా అంటే మనుషులకు పూర్తిగా దూరంగా వుంటూ కేవలం మోక్షార్థిగా జీవనం గడుపుతున్నాడు. మనలాంటి సాధారణ మానవులు అతనిని చూస్తే అంతకంటే విరాగి, స్థితప్రజ్ఞుడు, సన్యాసి ఇంకొకరు ఉండలేరు అని తలవక పోము . ఒకరోజు మన యోగపుంగవులు అడవిలో చెట్టుక్రింద ఒక బండమీద పడుకొని ఉండగా గగన మార్గంలో పార్వతీ పరమేశ్వరులు వెళ్ళటం మన యోగపుంగవులు గమనించారు.  అమ్మవారు ఈశ్వరునితో స్వామి మీ భక్తుడు పూర్తిగా విరాగిగా వుంటూ నిత్యం మిమ్ములనే స్మరిస్తూ వున్నాడు అతనికి మోక్షాన్ని ఎప్పుడు ప్రాసాదిస్తున్నారని అడిగింది.  దానికి స్వామి ఇంకా అతనిలో సంసారపు వాసనలు పోలేదు అటువం టప్పుడు యెట్లా మోక్షానికి అర్హుడు అవుతాడు అని సెలవిచ్చారు. అది విన్న మన యోగపుంగవులు పరుగు పరుగున ఈశ్వరుని సన్నిధికి వెళ్లి స్వామీ నేను నా సంసారం పూర్తిగా త్యజించి అడవిలో ఎలాంటి వాసనలు లేకుండా యతిగా జీవనం గడుపుతూ నిత్యం మోక్షార్థినై జీవిస్తున్నాను, జగన్మాత కూడా నా అవస్థ గమనించి మోక్షము ప్రసాదించవలసిందిగా మీకు తెలిపింది,   నాకంటూ  ఏదిలేదు. మరి నేను ఎలా సంసారపు వాసనలు కలిగి వున్నాను అని ప్రశ్నించారు. దానికి పరమేశ్వరులు ప్రసన్న వదనంతో నాయనా నీవన్నది నిజం. నిజానికి నీవు అత్యంత కఠినమైన దీక్షతో మోక్షార్థిగా జీవనం  గడుపుతున్నావు. నిన్ను చేస్తే ఎవరయినా సర్వసంగ పరిత్యాగి అంటే నీవే అని అంటారు అందులకు సందేహంలేదు. నీవు ఎలాంటి సుఖాలను, భోగాలను పొందకుండా అన్నిటిని వీడి పూర్తిగా యతిగా జీవిస్తున్నావు. కానీ ఇంకా నీలో సంసారపు వాసనలు సూక్ష్మంగా వున్నాయి అని అన్నారు. అవి ఏమిటని మన యతీశ్వరులవారు అడుగగా దానికి స్వామి నీవు పడుకునేటప్పుడు తలకింద చేయి ఎందుకు పెట్టుకున్నావు అది సుఖం మీద జాస కాదా అని  వివరించారు. అప్పుడు యతీశ్వరులు చేయి కూడా తలక్రింద పెట్టుకోకుండా పడుకొంటూ అనతికాలంలోనే ఈశ్వర సాన్నిధ్యాన్నిపొందారట. 

సాధక మిత్రమా యెంత కఠినంగా సాధన చేస్తేనో కానీ మోక్షం లభించదు.  మనం నిత్యం సంసారిక జీవనంలో వుంటూ అనేకులతో అనేక విధాలుగా సామాజిక, ఆర్ధిక పరంగా సంబంధాలు పెట్టుకొంటూ రోజులో కొంత సమయాన్ని మాత్రమే సాధనకు కేటాయిస్తూ జీవిస్తున్న మనం పైన పేర్కొనిన యోగపుంగవులుతో పోల్చుకుంటే ఏపాటివారము అని మనము ఆలోచిస్తే మన సాధన ముందుకు వెళుతుంది. మన జీవనంలో సాధనకు ఎక్కువ సమయం లవుకిక జీవితానికి తక్కువ సమయం కేటాయిస్తే కానీ మనం సాధనలో ప్రగతి సాధించలేము. కానీ మనం సమాజంలో వుంటూ గృహస్థ జీవనం గడుపుతూ ఎంతవరకు సాధించగలం అనేది ప్రస్నార్ధకమే.

ఇది చదివిన సాధకులు తమసాధనలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని అభిలషిస్తూ 

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి శాంతిః  

మీ భార్గవ శర్మ

కామెంట్‌లు లేవు: